Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

- Advertisement -

– నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
– మున్సిపల్‌ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-అంబర్‌పేట

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అంబర్‌పేట జోన్‌ పరిధిలోని మున్సిపల్‌ వర్కర్ల అజర్‌ పాయింట్ల వద్ద, కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం సమ్మె కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులకు వేతనాలు పెంచుకునే హక్కు, పని భద్రత, ప్రశ్నించే హక్కు, సమ్మె చేసే హక్కు పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రమాదకర కోడ్‌ల ద్వారా కార్మికులను బానిస వ్యవస్థలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, పెట్టుబడిదారుల లాభాల కోసమే ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను, కార్మికుల శ్రమను దోచి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో 9 సంవత్సరాలపాటు మున్సిపల్‌ కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేతనాలు పెరగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై స్పందన లేదని తెలిపారు. పైగా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లకు అనుగుణంగా తెలంగాణలో 10 గంటల పని విధానానికి జీవో జారీ చేసి కార్మికులపై అదనపు భారం మోపుతున్నారన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్‌ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పర్యవేక్షణకు వచ్చిన అంబర్‌పేట సర్కిల్‌ డీఈ రఘు ప్రసాద్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి ఎం.దశరథ్‌, నగర ఉపాధ్యక్షులు జి.రాములు, అంబర్‌పేట జోన్‌ కన్వీనర్‌ పి.శ్రీనివాస్‌, బి.సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఏలు ఆదిల్‌ షరీఫ్‌, నరసింహ, మున్సిపల్‌ కార్మికులు అండాలు, జయశ్రీ, లలిత, మునీషా, నాగేష్‌, ఆదిలక్ష్మి, యశోద, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -