Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్ల కోసమే కేంద్ర విత్తన చట్టం

కార్పొరేట్ల కోసమే కేంద్ర విత్తన చట్టం

- Advertisement -

దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ప్రచారం : టి.సాగర్‌, సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ”2025 విత్తన చట్టం” ముసాయిదా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం కోసమే అన్నట్టుగా ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు సదస్సులు, సెమినారులు నిర్వహిస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైతు సంఘం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆ చట్టం పూర్తిగా రైతులకు నష్టం చేసేలా ఉందన్నారు. ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మెన్‌ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలనీ, షెడ్యూల్‌ 1 పార్ట్‌-ఎ లో చూపిన నామినేట్‌ కమిటీలో మెజార్టీ కార్పోరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న వారినే నియమిస్తారని తెలిపారు. సెక్షన్‌ 9 ప్రకారం రిజిస్ట్రేషన్‌, సబ్‌ కమిటీలు, సెక్షన్‌ 10 ప్రకారం వేసే రాష్ట్ర విత్తన కమిటీల ఎంపికలో పారదర్శకత లేదని చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారినే ఎన్నుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. 1966 విత్తన దిగుమతి చట్టం, దాని సవరణ చట్టం 1986 తర్వాత దేశంలోను, రాష్ట్రాలలోను విత్తనోత్పత్తి పెరిగి ప్రస్తుతం అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. టాటా, బిర్లా, ఐటీసీ లాంటి సంస్థలే కాక విదేశీ కార్పొరేట్‌ సంస్థలైన మన్శాంటో, బేయర్‌, డూ-పాయింట్‌, సింజెంటా, కార్గిల్‌ సంస్థలు విత్తన రంగంపై పూర్తి పట్టు పొందాయని తెలిపారు. విత్తన ధరలను ఇష్టారీతిగా పెంచటం, నాణ్యత లేని విత్తనాలను అంటగట్టడం, పాలినేషన్‌ తక్కువ ఉన్న విత్తనాలను రైతులకు అంటగట్టి లాభాలు పొందటం కార్పొరేట్‌ సంస్థలకు పరిపాటిగా మారిందని తెలిపారు. కార్పొరేట్ల నియంత్రణకు గత ప్రభుత్వాలు జంకి విత్తన చట్టం తేవడానికి ముందుకు రాలేదన్నారు. వాస్తవానికి విత్తన చట్టం రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిదని గుర్తుచేశారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రం అడ్డుకున్నదని విమర్శించారు. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలకు లొంగి చట్టం చేసినట్టు ఉందన్నారు. సెక్షన్‌ 16 (3) ప్రకారం విత్తనాలను వాణిజ్యపరంగా రైతులకు విడుదల చేయటానికి దేశంలోనూ, ఇతర దేశాలలోనూ పరిశోధనలు చేయవచ్చని చెప్పిందని గుర్తుచేశారు. స్థానికంగా పరిశోధన జరిపిన విత్తనాలే రైతులకు ఉపయోగపడ్డాయనీ, విదేశీ వాతావరణంలో జరిపిన ప్రయోగాలు ఇక్కడ ఉపయోగపడవని తెలిపారు. గతంలో బీటీ విత్తనాల వలన రైతులు నష్టపోయారని గుర్తుచేశారు. కంపెనీలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేస్తే లైసెన్సులు రద్దు చేయటం, జైలు శిక్షలు విధించటం లాంటి పెనాల్టీలు ముసాయిదాలో లేవని విమర్శించారు. రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా దేశీయ టెక్నాలజీని వినియోగించి వాతావరణ జోన్లలో ప్రయోగాలు, పరిశోధనలు చేసి రైతులకు అందించే విధంగా విత్తన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. విత్తన నాణ్యతపైనా, జెర్మినేషన్‌ పైనా మరింత స్పష్టత కావాలన్నారు. రాష్ట్రాల స్థాయిలో నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి విత్తన చట్ట ముసాయిదాను రూపొందించాలని సూచించారు. కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే రైతులను విత్తనాల నుంచి మార్కెట్‌ వరకు ఏటా వేల కోట్లు దోచుకుంటున్నాయనీ, అందుకు అవకాశం లేకుండా రైతులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్‌ రావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -