– నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.92 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఖజానా కలకలలాడుతోంది. ప్రజలను పన్నుల రూపంలో పిండేస్తున్న నిధులు రికార్డ్‌లను సృష్టిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.92 లక్షలకు చేరాయి. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 కాలంలో ఇక వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.7.19 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.6.62 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోల్చితే భారీ పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. రీఫండ్‌లు తగ్గడంతో గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 7 శాతం పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీల లావాదేవీ పన్ను (ఎస్‌టీటీ) వసూళ్ల స్వల్పంగా తగ్గి రూ.35,682 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25.20 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాదితో పోల్చితే ఈ మొత్తం 12.7 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రీఫండ్ జారీలు 18 శాతం తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి. ఇదే కాలంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.5.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.5.08 లక్షల కోట్లతో పోల్చితే కార్పొరేట్ పన్ను వసూళ్లు పెరిగాయి. రిఫండ్‌లకు ముందు స్థూల పన్ను వసూళ్లు 2.15 శాతం పెరిగి రూ.15.35 లక్షల కోట్లకు చేరాయి.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2017లో జీఎస్టీని అమలు చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా రూ.2.37 లక్షల కోట్లు వసూళ్లు కాగా.. ప్రతీ నెల సగటున రూ.2 లక్షల కోట్ల మేర వసూళ్లు జరుగుతున్నాయి. పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నప్పటికీ.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని నిపుణులు విమర్శిస్తున్నారు.
కేంద్ర ఖజానా గలగల
- Advertisement -
- Advertisement -



