– రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం
– ఎన్‌ఈపీని రద్దు చేయాల్సిందే…
– ప్రజానుకూల శాస్త్రీయ విద్యను రూపొందించాలి
– విద్యను రాష్ట్రాల జాబితాలోకి తేవాలి
– సర్కారు బడుల్లో విద్యార్థులకు అల్పాహారం, స్నాక్స్ ఇవ్వాలి
– ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి
– కార్పొరేట్లకు రాయితీలు.. వేతన జీవులకు పన్నుల వాత
– అవిశ్రాంత ఉద్యమాలతో చారిత్రాత్మక విజయాలు : నవతెలంగాణతో ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి
విద్యా ప్రయివేటీకరణ, సరళీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ దేశానికే ప్రమాదకరమని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. ఎన్‌ఈపీ-2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాని స్థానంలో ప్రజానుకూల రాజ్యాంగ విలువలతో కూడిన శాస్త్రీయమైన విద్యావిధానాన్ని రూపొందించాలని కోరారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను రాష్ట్రాల జాబితాలోకి తేవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లను సవరించాలని చెప్పారు. కార్పొరేట్లకు పన్ను రాయితీలు కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులైన వేతన జీవులకు పన్నుల వాత విధిస్తున్నదని విమర్శించారు. ఎస్టీఎఫ్‌ఐ ఆవిర్భావం నుంచి అవిశ్రాంతంగా పోరాడి అనేక చారిత్రాత్మక విజయాలను సాధించిందని వివరించారు. ఇటీవల కొల్‌కతాలో జరిగిన ఎస్టీఎఫ్‌ఐ జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు చావ రవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘నాకు 1989 జులైలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ఉమ్మడి ఖమ్మం) ముల్కలపల్లి మండలంలో ఉద్యోగం వచ్చింది. 7 ఏండ్లు అక్కడే పనిచేశాను. ఉద్యోగం వచ్చిన ఆర్నెల్లలోనే యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. అక్షరాస్యత ఉద్యమం, ప్రజాసైన్స్ ఉద్యమంలో పాల్గొన్నాను. 1992లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 1996లో పాల్వంచలో ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ల సమస్యలపై పనిచేశాను. మా తండ్రి ఉపాధ్యాయ నాయకుడు అయినందున ఉద్యోగుల సర్వీస్ అంశాలపై అవగాహన ఏర్పడింది. ముదిగొండ మండలానికి బదిలీ అయ్యాను. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉంటూ ఉపాధ్యాయ ఉద్యమంలో చురు గ్గా పాల్గొన్నాను. 1998 జనవరిలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 2006 ఫిబ్రవరి వరకు ఆ బాధ్యతలు నిర్వహించాను. 2006 మార్చిలో ఐక్య ఉపాధ్యాయ పత్రిక చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టాను. రాష్ట్రం విడిపోయేదాకా ఆ బాధ్యతలను నిర్వహించాను. పత్రిక ప్రారంభించాక మైనేని వెంకటరత్నం తర్వాత అంత సుదీర్ఘకాలం చీఫ్ ఎడిటర్‌గా పనిచేసినందుకు గర్వంగా ఉన్నది. 2007లో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక య్యాను. అప్పుడే చుక్కా రామయ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేశాను. 2014, ఏప్రిల్ 13న టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. 2024, డిసెంబర్‌లో జరిగిన ఆరో మహాసభలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యాను.’అని చావ రవి అన్నారు.
దేశంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం ‘ఎస్టీఎఫ్‌ఐ’
‘నేను 2012లో ఎస్టీఎఫ్‌ఐ కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాను. 2018లో ఎస్టీఎఫ్‌ఐ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యాను. ఇటీవల కొల్‌కతాలో జరిగిన జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నిక య్యాను. 14 రాష్ట్రాల్లోని 25 ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీఎఫ్‌ఐకి అనుబంధంగా ఉన్నాయి. ఏడు లక్షల సభ్యత్వం ఉన్నది. దేశంలోనే అతిపెద్ద జాతీయ ఉపాధ్యాయ సంఘంగా ఎస్టీఎఫ్‌ఐ ఉన్నది. 2000 ఆగస్టు 12న భావసారూప్యం కలిగిన ఉపాధ్యాయ సంఘాలను సమన్వయం చేసి దాచూరి రామిరెడ్డి నాయకత్వంలో ఎస్టీఎఫ్‌ఐ ఆవిర్భవించింది. 2000-2003 వరకు ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2003-05 డిసెంబర్ వరకు జాతీయ అధ్యక్షులుగా రామిరెడ్డి పనిచేశారు. రామిరెడ్డి, నారాయణ నన్ను ప్రోత్సహించారు. తెలంగాణ నుంచి ఎన్ నారాయణ, జోజయ్య, ఎం సంయుక్త ఎస్టీఎఫ్‌ఐ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 20 ఏండ్ల తర్వాత ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి బాధ్యత యూటీఎఫ్‌నకు దక్కింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ ఉద్యమానికి దక్కిన గౌరవంగా భావించాలి.’అని చావ రవి వివరించారు.
విద్యను రాష్ట్రాల జాబితాలోకి తేవాలి
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నది. విద్యారంగంలో వస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. విద్యారంగం కేంద్రీ కరణ అవుతున్నది. ఇది దేశానికే ప్రమాదకరం. విద్యను రాష్ట్రాల జాబితాలోకి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలు రూపొందించేలా ఉండాలి. విద్యకు జీడీపీలో 6 శాతం, కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలి. జాతీయ విద్యావి ధానం (ఎన్‌ఈపీ-2020), నేషనల్ కర్రికులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్) అంశాల్లో ఎస్టీఎఫ్‌ఐ వంటి జాతీయ ఉపాధ్యాయ సంఘాల జోక్యం ఉండాలి. 25 ఏండ్ల కాలంలో ఎస్టీఎఫ్‌ఐ అవిశ్రాంతంగా అనేక క్యాంపెయిన్లు, పోరాటాలను నిర్వహించింది. చారిత్రాత్మక విజయాలను సాధిం చింది. ఎన్‌సీఎఫ్-2005 శాస్త్రీయ పద్ధతిలో కర్రికులమ్ రూపొందించడంలో ఎస్టీఎఫ్‌ఐ ఉద్య మాలు దోహద పడ్డాయి. 2009లో విద్యాహక్కు చట్టం రావడం లోనూ ఎస్టీఎఫ్‌ఐ దేశవ్యాప్త క్యాం పెయిన్లు, ఉద్య మాలు కారణమయ్యాయి.’అని చావ రవి చెప్పారు.
ఎన్‌ఈపీని శాస్త్రీయంగా మార్చాలి
‘కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన ఎన్‌ఈపీ-2020కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించాం. వివిధ రాష్ట్రాల్లో ఎన్‌ఈపీ అమలుపై మహాసభల్లో చర్చించాం. రాజ్యాంగ విలువలతో కూడిన ప్రజానుకూలంగా శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్‌ఈపీ-2020ని సమూలంగా మార్చాలి. సామాజిక న్యాయం, లౌకిక విలువలు పెంచేలా విద్యారంగం ఉండాలి. ఎన్‌ఈపీ-2020ని రద్దు చేయాలి. అందరికీ నాణ్యమైన, సమానమైన ఉచిత విద్యను అందించాలి. గత ఐదేండ్లుగా ఎస్టీఎఫ్‌ఐ పోరాడుతున్నది. ‘అని చావ రవి అన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
‘2004లో కేంద్రం పాత పెన్షన్ విధానం స్థానంలో జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) తెచ్చింది. దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది. మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాలను చేపట్టింది. వేలాది మంది ఉపాధ్యాయులను సంఘటితం చేసింది. సీపీఎస్‌పై 20 ఏండ్ల పోరాట ఫలితంగానే కేంద్రం యూపీఎస్‌ను తెచ్చింది. గతంలో సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ లేదు. యూపీఎస్‌లో సర్వీసును బట్టి పెన్షన్ గ్యారంటీ ఉన్నది. అయినా ఉద్యోగుల చందాతో పెన్షన్ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నది. చందా లేకుండా పాత పెన్షన్ విధానమే కావాలి. ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఎన్‌పీఎస్, యూపీఎస్‌ను రద్దు చేయాలి. పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి. ఓపీఎస్‌ను అమలు చేయాలి’అని చావ రవి డిమాండ్ చేశారు.
ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు సవరించాలి
‘ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు 2013కు ముందున్నవే ఉన్నాయి. ఆదాయాలు, ధరలు పెరిగినా పన్ను శ్లాబ్ రేట్లు పెరగలేదు. దీని వల్ల వేతన జీవులపై భారం పడుతున్నది. ఆ భారం తగ్గిం చాలి. శ్లాబ్ రేట్లు సవరించాలి. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతనాలు ఒకే రకంగా ఉండాలి. కేంద్రీయ విద్యాలయాల ఉపాధ్యాయులతో సమా నంగా రాష్ట్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలను అమలు చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వచ్చే జీతం నుంచి వస్తువులను కొనుగోలు చేసి జీఎస్టీ కడుతున్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా రు. రెండు పన్నులు కడుతున్నారు. జీఎస్టీ ఉన్నాక ఐటీ ఎందుకు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు పన్నుల వాత పెడుతున్నది. తీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’అని చావ రవి అన్నారు.
నవంబర్ లేదా డిసెంబర్‌లో మార్చ్ టు పార్లమెంట్
ప్రభుత్వ విద్యను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. మతసామరస్యాన్ని కాపాడాలి. దీని అమలు కోసం వచ్చేనెల ఒకటి నుంచి డిసెంబర్ వరకు నాలుగు దశల పోరాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్టీఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. మొదటి దశలో మండల/బ్లాక్ స్థాయిలో సదస్సులు, రెండో దశలో జిల్లా స్థాయిలో ర్యాలీలు, సదస్సులు, మూడో దశలో రాష్ట్ర కేంద్రం లో ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలి. చివరి దశలో పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయంలో మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపడతాం. నవంబర్, డిసెంబర్‌లో ఆ కార్యక్రమం ఉంటుంది.
విద్యా కేంద్రీకరణ దేశానికే ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES