రాజ్యాంగ చెల్లుబాటు మీద సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ : కొత్తగా తీసుకువచ్చిన యూజీసీ నిబంధనలు వివక్షను ప్రోత్సహిస్తున్నాయంటూ వాటి రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించే) నిబంధనలు-2026 లోని రెగ్యులేషన్ 3(సి) రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ న్యాయవాది వినీత్ జిందాల్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే రిజర్వేషన్ కోటాను ఇస్తున్న ఈ నిబంధన వివక్షతో కూడినదని ఆయన పేర్కొన్నారు. అదే రిజర్వేషన్ రక్షణను జనరల్ లేదా అగ్రవర్ణాలకు ఇవ్వడానికి నిరాకరించడాన్ని ప్రశ్నించారు. ఈ నెల 13న కొత్త యూజీసీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘కులం ఆధారిత వివక్ష’ నిర్వచనం పరిధిలోకి ఈ నిబంధనలు వస్తున్నాయని ఆ పిటిషన్ పేర్కొంది. కేవలం కులం ప్రాతిపదికన గణనీయ సంఖ్యలోని పౌరులకు చట్టం కింద సమాన రక్షణ నిరాకరించబడుతోందని పిటిషన్ పేర్కొంది. జాతీయ విద్యా విధానం, 2020కి అనుగుణంగా సమానత్వం, అందరినీ కలుపుకుని పోవడం, ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షారహిత విద్యా వాతావరణ వంటి లక్ష్యాల సాధన కోసం యూజీసీ-2026 నిబంధనలను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. కుల ఆధారిత వివక్ష కేవలం ఒక దిశలో మాత్రమే పనిచేయగలదనే అనామోదయోగ్యమైన భావనతో ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చారని పిటిషనర్ వాదించారు. అగ్ర వర్ణాలకు లేదా జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తులు కూడా కుల ఆధారిత ఘర్షణలను, శతృత్వాలను, దూషణలను, బెదిరింపులను లేదా వ్యవస్థాగత విభేదాలను ఎదుర్కొనే అవకాశాన్ని చట్టపరంగా ముందుగానే తోసిపుచ్చారని పిటిషన్ పేర్కొంది.
కొత్త యూజీసీ నిబంధనలపై సవాల్
- Advertisement -
- Advertisement -



