Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇచ్చిన హామీలు నిలుపుకోకుంటే 'చలో అసెంబ్లీ'

ఇచ్చిన హామీలు నిలుపుకోకుంటే ‘చలో అసెంబ్లీ’

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌
ములుగులో ఆదివాసీల ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ – ములుగు

వలస ఆదివాసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోకపోతే ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో 73 వలస ఆదివాసీ గూడెల్లో గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో వారం రోజుల నుంచి అధికారులు ఇష్టానుసారంగా కందకాలు తవ్వుతున్నారని విమర్శించారు. గిరిజనులు 20 సంవత్సరాల నుంచి పోడు సాగు చేసుకుని భూములు దున్నుకుంటుంటే వారికి హక్కు పత్రాలు ఇవ్వాల్సింది పోయి, గూడెంలపై దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ హక్కు చట్టం – 2006 ప్రకారం గతంలో ఈ భూములన్నీ సర్వే చేశారని, కేవలం ఎస్టీ సర్టిఫికెట్లు లేనందున వీరికి హక్కు పత్రాలు రాలేదని తెలిపారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చిందని, మిగిలిన 8లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా ఒక ఎకరానికి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
జిల్లా మంత్రి అయిన సీతక్క.. నేడు వలస ఆదివాసీ గూడెంలో దాడులు జరుగుతుంటే సైలెంట్‌గా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అటవీ హక్కుల చట్ట ప్రకారం వలస ఆదివాసులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని, గిరిజన గూడెల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆదివాసులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, పోడు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫారెస్ట్‌ అధికారులు దాడులు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, ఎండీ దావూద్‌, రత్నం రాజేందర్‌, కొప్పుల రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -