నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురువారం తలపెట్టిన ‘చలో బస్‌భవన్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. దీంతో నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి బస్‌భవన్‌కు చేరుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయాన్నే కేటీఆర్, కోకాపేటలోని హరీశ్‌రావు నివాసాల వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు, వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా వారి నివాసాలకే పరిమితం చేశారు.