No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయం23న చలో హైదరాబాద్‌

23న చలో హైదరాబాద్‌

- Advertisement -

– 20 నెలలైనా అమలు కాని కాంగ్రెస్‌ హామీలు
– అనివార్య పరిస్థితుల్లోనే ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా
– విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
– యూఎస్‌పీసీ నేతల డిమాండ్‌
– పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ విమర్శించింది. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని తెలిపింది. అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఆ హామీలను అమలు చేయలేదని పేర్కొంది. అనివార్య పరిస్థితుల్లోనే ఈనెల 23న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు తెలిపింది. ఉపాధ్యాయులు వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 23న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను యూఎస్‌పీసీ నేతలు సోమవారం హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, ఎ వెంకట్‌ (టీఎస్‌యూటీఎఫ్‌), ఎన్‌ తిరుపతి (టీపీటీఎఫ్‌), ఎం సోమయ్య, టి లింగారెడ్డి (డీటీఎఫ్‌), కొమ్ము రమేష్‌ (బీటీఎఫ్‌), ఎస్‌ హరికిషన్‌ (టీటీఏ), వై విజయకుమార్‌ (ఎస్సీఎస్టీయూయస్‌) మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన హామీలను అమలు చేయడం లేదన్నారు. నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి వివిధ రకాల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.

ప్రాథమిక పాఠశాలలకు 5,571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని సూచించారు. డీఎడ్‌, బీఎడ్‌ అర్హతలున్న ప్రతి ఎస్జీటీకి పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులకు అవకాశం అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ పూర్తయినందున 2,3,9,10 జీవోలను రద్దు చేసి 11,12 జీవోల ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని సూచించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలనీ, 2023, జులై ఒకటి నుంచి పీఆర్సీని అమలు చేయాలని సూచించారు.

25 జీవోను సవరించాలనీ, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లుండాలని చెప్పారు. 40 మంది విద్యార్థుల కంటే ఎక్కువున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికొక టీచర్‌ ఉండాలని కోరారు. రూ.398 టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్‌ను మంజూరు చేయాలన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలని సూచించారు. గురుకుల టైంటేబుల్‌ను సవరించాలనీ, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికీ మంత్రులు, అధికారుల కమిటీలు వేసినా పరిష్కారం కాకపోవడంతో గతనెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని యూఎస్‌పీసీ నిర్ణయించిందన్నారు. చివరి దశలో ఈనెల 23న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు పి మాణిక్‌రెడ్డి, ఎ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad