5-0తో ఇంటర్ మిలాన్‌పై గెలుపు
తొలిసారి చాంపియన్స్ లీగ్ టైటిల్ వశం
మ్యూనిచ్ (జర్మనీ) : ఫ్రెంచ్ ఫుట్‌బాల్ క్లబ్ పిఎస్‌జి (పారిస్ సెయింట్ జర్మెన్) చరిత్ర సృష్టించింది. 70 ఏండ్ల యుఈఎఫ్‌ఏ యూరోపియన్ కప్, చాంపియన్స్ లీగ్ చరిత్రలో అత్యంత ఏకపక్ష విజయం నమోదు చేయటంతో పాటు తొలిసారి చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. జర్మనీలోని మ్యూనిచ్ ఎలియంజ్ ఎరినా స్టేడియంలో జరిగిన చాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్ మిలాన్‌పై పిఎస్‌జి 5-0తో అదిరే విజయం సాధించింది. 90 నిమిషాల రుగులేని ఆధిపత్యం చెలాయించిన పిఎస్‌జి ఐదు గోల్స్ కొట్టింది. హాకిమి (12వ నిమిషం), డిసైర్ (20వ నిమిషం) గోల్స్‌తో ప్రథమార్థంలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన పిఎస్‌జి.. ద్వితీయార్థంలో దుమ్మురేపింది. డిసైర్ 63వ నిమిషంలో మరో గోల్ కొట్టగా..క్విచ 73వ నిమిషంలో నాల్గో గోల్ అందించాడు. 86వ నిమిషంలో సెనీ మయులు ఐదో గోల్‌తో పిఎస్‌జి ఆధిక్యాన్ని అందనంత ఎత్తులో నిలిపాడు. పిఎస్‌జి 23 సార్లు ఇంటర్ మిలాన్ గోల్ పోస్ట్‌పై దాడి చేయగా.. ఇంటర్ మిలాన్ కేవలం ఎనిమిది సార్లు మాత్రమే ఆ పని చేసింది. 60 శాతం బంతిని నియంత్రణలో నిలుపుకున్న పిఎస్‌జి.. ఇంటర్ మిలాన్‌ను చిత్తు చేసింది. చాంపియన్స్ లీగ్ చరిత్రలో ఓ ఫైనల్ పోరు ఈ స్థాయిలో ఏకపక్షంగా సాగటం ఇదే ప్రథమం.
అదుపు తప్పిన ఆనందం! :
ఫ్రెంచ్ క్లబ్ పిఎస్‌జి తొలిసారి యుఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్ చాంపియన్‌గా నిలువటంతో ఫ్రాన్స్‌లో అభిమానుల సంబురాలకు అంబురాన్ని అంటాయి. ఇదే సమయంలో విజయోత్సవాలు అదుపు తప్పటంతో శాంతి భద్రతలకు సమస్యకు దారితీసింది. పారిస్‌లో అభిమానులను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. 200కు పైగా వాహనాలు ధ్వంసం కాగా.. 22 మంది భద్రతా సిబ్బంది, ఏడుగురు ఫైర్ సిబ్బందికి గాయాలు అయ్యాయి. అల్లర్ల నేపథ్యంలో పోలీసులు 559 మందిని అరెస్టు చేశారు. గెలుపు సంబురాలు అదుపు తప్పగా ఇద్దరు అభిమానులు మృత్యువాత పడగా.. 192 మంది గాయాల పాలయ్యారు.
చాంపియన్ పిఎస్‌జి
- Advertisement -
- Advertisement -