ఛేదనలో మంధాన, జార్జియా జోరు
6 వికెట్ల తేడాతో ఫైనల్లో గెలుపు
నాల్గోసారీ క్యాపిటల్స్‌కు తప్పని భంగపాటు
మహిళల ప్రీమియర్ లీగ్ 2026
అటు ఐపీఎల్, ఇటు డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మేనియా కొనసాగుతోంది. గత సీజన్‌లో తొలిసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ ముద్దాడిన ఆర్‌సీబీ అమ్మాయిలు… ఈ సీజన్‌లోనూ టైటిల్ నిలబెట్టుకున్నారు. నాలుగు సార్లు ఫైనలిస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఘన విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో తొలి నాలుగు సీజన్లు ఫైనల్‌కు చేరినా.. చాంపియన్‌గా నిలువని జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.
నవతెలంగాణ-వడోదర
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాల్గో సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గురువారం వడోదరలో జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ఒత్తిడితో కూడిన టైటిల్ పోరులో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మరో 2 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ స్మృతీ మంధాన (87, 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా, జార్జియా వోల్ (79, 54 బంతుల్లో 14 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించింది. మంధాన, జార్జియా రెండో వికెట్‌కు 92 బంతుల్లోనే 165 పరుగులు జోడించి ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరి చేశారు.
చినెలి హెన్రీ (2/34), మిన్ను మణి (1/19) ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆఖరు వరకు రేసులో నిలిపినా.. రాధ యాదవ్ (12 నాటౌట్), నదినె (7 నాటౌట్) ఆఖరు ఓవర్లో ఉత్కంఠకు తెరదించారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. జెమీమా రొడ్రిగ్స్ (57, 37 బంతుల్లో 8 ఫోర్లు), లారా (44, 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెన్రీ (35 నాటౌట్, 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిజెలి లీ (37, 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
మంధాన, జార్జియా ధనాధన్
ఆర్‌సీబీ లక్ష్యం 204 పరుగులు. టైటిల్ పోరులో ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాధించటం అంత సులువు కాదు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ హారీస్ (9) వికెట్ కోల్పోయింది. 9/1తో ఆర్‌సీబీ ఒత్తిడిలో పడింది. కానీ కెప్టెన్ స్మృతీ మంధాన (87), జార్జియా (79) ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. వికెట్ పడినా.. పవర్‌ప్లేలో ఎదురుదాడి చేశారు. 6 ఓవర్లలో 59/1తో దీటుగా బదులిచ్చారు. మంధాన, జార్జియాలను ఒత్తిడికి గురి చేసేందుకు ఎటాకింగ్ ఫీల్డింగ్ మొహరించిన జెమీమా.. అందుకు భారీ మూల్యం చెల్లించింది. దూకుడుగా ఆడిన ఈ జోడీ క్రమం తప్పకుండా బౌండరీలు బాదింది.
మంధాన 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ అందుకోగా.. జార్జియా 9 ఫోర్లతో 37 బంతుల్లో ఫిఫ్టీ సాధించింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 92 బంతుల్లోనే 165 పరుగులు జోడించింది. మంధాన, జార్జియా క్రీజులో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మ్యాచ్‌పై ఎటువంటి ఆశలు లేవు. కానీ, ఆఖర్లో ఈ ఇద్దరినీ సాగనంపిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను రక్తి కట్టించింది. ఎదుర్కొన్న తొలి బంతికే జీవనదానం పొందిన రాధ యాదవ్.. ఒత్తిడిలో శ్రీ చరణిపై వరుస ఫోర్లు బాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు డబ్ల్యూపీఎల్ టైటిల్ అందించింది. 19.4 ఓవర్లలో 4 వికెట్లకు ఆర్‌సీబీ 204 పరుగులు చేసింది.
సమిష్టిగా రాణించినా..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ సమిష్టి ప్రదర్శన చేసింది. ఓపెనర్లు లిజెలీ లీ (37), షెఫాలీ వర్మ (20) శుభారంభం అందించారు. షెఫాలీ మూడు ఫోర్లతో మెరువగా.. లిజెలీ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగింది. ఓపెనర్లు ఇద్దరూ క్రీజులో ఉండగా క్యాపిటల్స్ దండిగా పరుగులు పిండుకుంది. ఆ తర్వాత కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (57) ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకుంది.
మిడిల్ ఓవర్లలో లారా (44)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. 7 ఫోర్లతో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన జెమీమా ఢిల్లీ క్యాపిటల్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించింది. జెమీమా, లారా జోడీ మూడో వికెట్‌కు 51 బంతుల్లో 76 పరుగులు చేయగా.. హెన్రీ (35 నాటౌట్), లారా జోడీ నాల్గో వికెట్‌కు 24 బంతుల్లోనే 55 పరుగులు పిండుకున్నారు. హెన్రీ ఆఖర్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో క్యాపిటల్స్‌ను 200 పరుగుల మార్క్ దాటించింది. ఆర్‌సీబీ బౌలర్లలో సయాలి, నదినె, అరుంధతి రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు.



