Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలుచాంపియన్‌ సబలెంక

చాంపియన్‌ సబలెంక

- Advertisement -
  • టైటిల్‌ నిలుపుకున్న బెలారస్‌ స్టార్‌
  • ఫైనల్లో ఆమందకు భంగపాటు
  • యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

యూఎస్‌ ఓపెన్‌లో బెలారస్‌ స్టార్‌, వరల్డ్‌ నం.1 అరినా సబలెంక అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో లోకల్‌ స్టార్‌ ఆమంద అనిషిమోవపై వరుస సెట్లలో గెలుపొందిన సబలెంక.. సెరెనా విలియమ్స్‌ (2014) తర్వాత యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ నిలుపుకున్న తొలి క్రీడాకారిణిగా నిలిచింది. వింబుల్డన్‌ ఫైనల్లో భంగపడిన ఆమందకు సొంతగడ్డపైనా నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ వేటలో ప్రపంచ టాప్‌-2 ఆటగాళ్లు జానిక్‌ సినర్‌ (ఇటలీ), కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) పోటీపడుతున్నారు.

నవతెలంగాణ-న్యూయార్క్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో పరాజయం. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ ఓటమి. వింబుల్డన్‌లో సెమీస్‌లోనే చుక్కెదురు. అయినా, అరినా సబలెంక (బెలారస్‌) పట్టు వదల్లేదు. యూఎస్‌ ఓపెన్‌లో రెట్టించిన పట్టుదలతో బరిలోకి దిగింది. న్యూయార్క్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ ఆమంద అనిషిమోవపై 6-3, 7-6(7-3)తో సబలెంక సూపర్‌ విజయం సాధించింది. 2014 తర్వాత మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్‌ నిలుపుకున్న క్రీడాకారిణిగా సబలెంక నిలిచింది. వింబుల్డన్‌ ఫైనల్లో 0-6, 0-6తో స్వైటెక్‌ చేతిలో భంగపడిన ఆమంద అనిషిమోవ.. సొంతగడ్డపై గట్టి పోటీనిచ్చింది. వరల్డ్‌ నం.1 సబలెంకకు అంత సులువుగా టైటిల్‌ను వదులుకోలేదు. గంటన్నరకు పైగా సాగిన టైటిల్‌ పోరులో అనిషిమోవ 4 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. సబలెంక ఓ ఏస్‌తో సరిపెట్టినా.. ఆమంద సర్వ్‌ను ఐదు సార్లు బ్రేక్‌ విజేతగా నిలిచింది. ఆమంద 22 విన్నర్లు కొట్టగా.. సబలెంక 13 విన్నర్లే కొట్టింది. పాయింట్ల పరంగా 76-59తో సబలెంక పైచేయి సాధించింది. సబలెంక 15 అనవసర తప్పిదాలు చేయగా.. ఆమంద 29 అనవసర తప్పిదాలతో టైటిల్‌ను చేజార్చుకుంది. సబలెంక బలమైన సర్వ్‌, ఫోర్‌హ్యాండ్‌ ర్యాలీలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆమంద.. తొలి సెట్లో మూడు సార్లు సర్వ్‌ను కోల్పోవటం దెబ్బతీసింది. రెండో సెట్లో 5-4తో మ్యాచ్‌ పాయింట్‌ ముంగిట నిలిచిన సబలెంకను నిలువరించిన ఆమంద.. ఆ సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లింది. టైబ్రేకర్‌లో సబలెంక ఒత్తిడిలో అద్భుతంగా రాణించింది. టైబ్రేకర్‌ను తప్పక నెగ్గాల్సిన ఆమంద ఒత్తిడికి తట్టుకుని నిలువలేదు. ఫలితంగా వరుస సెట్లలో లాంఛనం ముగించిన సబలెంక మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ నీల్‌, జో ద్వయం, మహిళల డబుల్స్‌లో మూడో సీడ్‌ ఎరిన్‌, గాబ్రియెల జోడీలు విజేతలుగా నిలిచారు.

భావోద్వేగ విజయం!
ఈ ఏడాది అరినా సబలెంక సూపర్‌ ఫామ్‌ కొనసాగినా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌లో అది ప్రతిబింబించలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సహా వింబుల్డన్‌లో సబలెంకకు అమెరికా అమ్మాయిలే చెక్‌ పెట్టారు. మెల్‌బోర్న్‌లో మడిసన్‌ కీస్‌.. పారిస్‌లో కొకొ గాఫ్‌.. వింబుల్డన్‌లో ఆమంద అనిషిమోవలు సబలెంకను ఓడించారు. యూఎస్‌ ఓపెన్‌లోనూ అమెరికా అమ్మాయే సబలెంకకు సవాల్‌ విసిరింది. సమర్థవంతంగా ఎదుర్కొన్న సబలెంక ఈ ఏడాది తొలి టైటిల్‌ను, కెరీర్‌ నాల్గో గ్రాండ్‌స్లామ్‌ విజయాన్ని అందుకుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన సబలెంక… న్యూయార్క్‌ విజయాన్ని భావోద్వేగ విక్టరీగా అభివర్ణించింది. ‘పరిస్థితుల ప్రభావం, తీవ్రతను కొందరు అర్థం చేసుకోరు. గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓటమి తర్వాత నేరుగా మీడియా ముందుకొస్తే.. టైటిల్‌ పోరులో ఏం జరిగిందో, పొరపాటు ఎక్కడ జరిగిందనే తికమకలో ఉంటాం. ఆ సమయంలో పెద్దగా ఆలోచన ఉండదు. అప్పుడు ఏదో ఓ మాట అంటే.. దాన్ని వివాదం చేస్తున్నారు. గతంలో మనం ఏంటనే విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. నా పొరపాట్లను దిద్దుకుని, క్షమాపణలు సైతం చెప్పాను. ఇప్పుడు ప్రజలు నన్ను మెరుగ్గా అర్థం చేసుకుంటున్నారు. అదో మంచి పాఠం, నాకు ఎన్నో విధాలుగా దోహదపడింది. అందుకే ఇదో భావోద్వేగ విజయం’ అని అరినా సబలెంక తెలిపింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 46 వారాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సబలెంక.. యూఎస్‌ ఓపెన్‌ విజయంతో ఈ ఏడాదిని గొప్పగా ముగించింది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఆమంద అనిషిమోవ కెరీర్‌లో తొలిసారి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad