Monday, March 30, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ సబలెంక

చాంపియన్‌ సబలెంక

- Advertisement -

ఫైనల్లో కొకొ గాఫ్‌పై గెలుపు
మయామి ఓపెన్‌ 2026

మయామి (యుఎస్‌ఏ)
మయామి ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ అరినా సబలెంక (బెలారస్‌) సొంతమైంది. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో అమెరికా యంగ్‌స్టర్‌, వరల్డ్‌ నం.4 కొకొ గాఫ్‌పై 6-2, 4-6, 6-3తో అరినా సబలెంక ఘన విజయం సాధించింది. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన అంతిమ సమరంలో బెలారస్‌ భామ పైచేయి సాధించింది. ర్యాలీలు, నెట్‌ గేమ్‌తో కొకొ గాఫ్‌ను ఇరకాటంలో పడేసిన సబలెంక.. పవర్‌ఫుల్‌ సర్వ్‌లతో అమెరికా అమ్మాయిని మట్టి కరిపించింది. 3 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లు సాధించిన సబలెంక.. మూడు సెట్ల సమరంలో ఆధిపత్యం చెలాయించింది. పాయింట్ల పరంగా 94-82తో కొకొ గాఫ్‌పై సబలెంక స్పష్టమైన పైచేయి సాధించింది.

సబలెంక 16 గేమ్‌లు గెలుపొందగా, కొకొ గాఫ్‌ 11 గేమ్‌లు నెగ్గింది. కొకొ గాఫ్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేసి తొలి సెట్లో ఆధిక్యం సాధించిన సబలెంక.. అదే జోరుతో సెట్‌ను ఖాతాలో వేసుకుంది. కానీ రెండో సెట్లో కొకొ గాఫ్‌ గట్టిగా పోరాడింది. ఓసారి సబలెంక సర్వ్‌ను బ్రేక్‌ చేసింది. సబలెంక సైతం పట్టు వదలకుండా పోరాడినా 6-4తో కొకొ గాఫ్‌ రెండో సెట్‌ను ఖాతాలో వేసుకుంది. టైటిల్‌ ఫైట్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. ఉత్కంఠభరిత నిర్ణయాత్మక సెట్లో సబలెంక జోరందుకుంది. గాఫ్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేసింది. విలువైన ఆధిక్యం దక్కించుకుని 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను.. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. వరుసగా ఇండియన్‌వెల్స్‌, మయామి ఓపెన్‌ టైటిల్స్‌ సాధించిన అరినా సబలెంక.. ఇగా స్వైటెక్‌ (2022) తర్వాత ఒకే సీజన్‌లో ‘సన్‌షైన్‌ డబుల్‌’ టైటిల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది.

సబలెంక, స్వైటెక్‌, విక్టోరియ అజరెంక, కిమ్‌ క్లిస్టర్స్‌, స్టెఫీగ్రాఫ్‌లు మాత్రమే ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. ఈ ఏడాది డబ్ల్యూటీఏ సీజన్‌లో మూడు టైటిల్స్‌ సాధించిన సబలెంక.. 24 మ్యాచ్‌ల్లో 23 విజయాలు సాధించింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో వరల్డ్‌ నం.2 ఎలెనా రిబకినా చేతిలో ఓడిన తర్వాత సబలెంక.. మరో మ్యాచ్‌లో పరాజయం పాలవలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ తర్వాత సబలెంకను మూడు సెట్లు ఆడించిన తొలి ప్రత్యర్థి కొకొ గాఫ్‌ కావటం గమనార్హం. ‘గత కొన్ని నెలలుగా ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకునే క్షణం తీరిక లేదు. టెన్నిస్‌ కోర్టులో నేను సాధించిన ఘనత పట్ల ఎంతో గర్వంగా ఉన్నాను. కొకొ గాఫ్‌ ప్రతి అవకాశం కోసం పోరాడుతుంది. ఫైనల్లో గాఫ్‌ నమ్మశక్యం కాని రీతిలో ఆడింది. కానీ నేను మానసికంగా ఎంతో దృడంగా ఉన్నాను. నేను అంతా బాగానే ఆడుతున్నాను, ఒకట్రెండు పాయింట్లు సాధిస్తే సరిపోతుందనే ఆలోచనతో ఉన్నాను’ అని సబలెంక తెలిపింది.

22 ఏండ్ల కొకొ గాఫ్‌ సాధించిన రెండు గ్రాండ్‌స్లామ్‌ విజయాలు సబలెంకను ఓడించి దక్కించుకున్నవే. మయామి ఓపెన్‌లో సబలెంక విజయంతో ఈ ఇద్దరి ముఖాముఖి రికార్డు 6-6తో సమమైంది. సినర్‌కు ఎదురుందా? : ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నమెంట్లలో అప్రతిహాత రికార్డుతో దూసుకెళ్తున్న వరల్డ్‌ నం.2, ఇటలీ స్టార్‌ ఆటగాడు జానిక్‌ సినర్‌ మయామి ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌పై కన్నేశాడు. ఇండియన్‌వెల్స్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన జానిక్‌ సినర్‌.. ఈ సీజన్‌లో ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కోల్పోకుండా అసమాన విజయాలు సాధిస్తున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో 21వ సీడ్‌, అండర్‌డాగ్‌ జిరి లెహెకతో సినర్‌ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను ఏడో సీడ్‌, ఇటలీ జోడీ సిమోనె, ఆండ్రియలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో 6-4, 6-2తో హ్యారీ, హెన్రీలపై అలవోక విజయం సాధించారు. మహిళల డబుల్స్‌ టైటిల్‌ కోసం ఇటలీ అమ్మాయిలు సారా ఎరానీ, జాస్మిన్‌ పావొలినిలతో టేలర్‌ (అమెరికా), సైనికోవ (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -