బిల్లుపై ప్రతిపక్షాల ఆగ్రహం
తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ : పంజాబ్, హర్యానా సంయుక్త రాజధాని చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చే రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో, ఆ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోలేదని, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం లేదని ఆదివారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. త్వరలో జరగనున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ అంశంపై బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు శనివారం ప్రకటించింది. చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, దమణ్-దీవ్ ప్రస్తుతం అధికరణం 240 పరిధిలో ఉన్నాయి.
ఈ అధికారణం పరిధిలోకి చండీగఢ్‌ను తీసుకువచ్చే బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రపతికి చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారం ఉంటుంది. దీంతో ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకులు భగవంత్ మాన్ విమర్శించారు. చండీగఢ్ గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ పంజాబ్‌తో విడదీయరాని భాగమేనని పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదేనని, దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా దీనిని పంజాబ్ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు.
మొదట ప్రకటించడం, ఆ తరువాత ఆలోచిస్తున్నామనడం కేంద్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ పరిపాలనకు సంబంధించి ఎలాంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన కేంద్రప్రభుత్వ చట్టం రూపొందించే ప్రక్రియను సరళీకరించాలన్న ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉందని పేర్కొంది. 1966లో పంజాబ్ నుంచి హర్యానా విడిపోయిన తర్వాత చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్, హర్యానాకు అప్పటి నుంచి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా పాలన నిర్వహిస్తున్నారు. చండీగఢ్ పంజాబ్‌దేనని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానాకు ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.
యూటీగా చండీగఢ్!
- Advertisement -
- Advertisement -



