Saturday, July 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుచంద్రబాబూ..మా ప్రాజెక్టుల్ని అడ్డుకోవద్దు

చంద్రబాబూ..మా ప్రాజెక్టుల్ని అడ్డుకోవద్దు

- Advertisement -

మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పాలమూరు ప్రారంభమైంది
కేసీఆర్‌ సీఎం అయ్యాకే తెలంగాణ ప్రాజెక్టులకు ఎక్కువ అన్యాయం : జటప్రోలు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి /పెంట్లవల్లి

తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ”మీరు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాలమూరు-రంగారెడ్డి మొదలైంది. మీ కాలంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడం ఏం న్యాయం? మీకు విజ్జప్తి చేస్తున్నా.. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. మీరు బాధ్యతగా ఉండండి. మమ్మల్ని బతకనీయండి. రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయండి” అని అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవల్లి మండలంలోని జటప్రోలులో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోకంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. పాలమూరు ప్రజలను ఆయన్ని ఎంపీగా గెలిపిస్తే, ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని అన్నారు. 2034 వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డే ఉంటాడని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్‌ తన డైరీలోనో, గుండెల పైనో, లేక ఆయన కొడుకు గుండెల పైనో రాసుకోవాలని చెప్పారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతూ, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని తెలిపారు. రెండున్నరేండ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఎన్ని వందల కోట్లయినా ఖర్చు చేస్తామనీ, ఈ ఏడాది డిసెంబర్‌ 9 లోపు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరిస్తాంమని అన్నారు. ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, ఏడాది తిరిగేలోపు 2.85 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే రికార్డు సాధించామన్నారు. జనగణనలో కులగణన చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వివరించారు.మాజీ సీఎం కేసీఆర్‌ వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి, మాట తప్పారన్నారు.
సమాజంలో సగం జనాభాగా ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం పారదర్శకంగా ముందుకు నడుస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కొల్లాపూర్‌లో రూ.170 కోట్లతో ఇండ్లు నిర్మింస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇంటిగ్రేడెట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -