Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌ వైఖరిలో మార్పు!

భారత్‌ వైఖరిలో మార్పు!

- Advertisement -

ఇజ్రాయిల్‌ ఏకపక్ష చర్యలను ఖండించే అంతర్జాతీయ ప్రకటనకు మద్దతు
మరోపక్క ఇజ్రాయిల్‌ పర్యటనకు సిద్ధమవుతున్న మోడీ
కేంద్రం ద్వంద్వ విధానంపై విమర్శలు

న్యూఢిల్లీ : వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చేపడుతున్న ఏకపక్ష చర్యలను ఖండిస్తూ జారీ చేసిన అంతర్జాతీయ సంయుక్త ప్రకటనలో భారత్‌ తన పేరును చేర్చింది. తొలుత 85 దేశాలు విడుదల చేసిన ఈ ప్రకటనలో భారత్‌ భాగస్వామ్యం కాలేదు. అయితే 24 గంటల వ్యవధిలోనే భారత్‌ ఆ ప్రకటనను మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యవేత్తల విమర్శలు, అరబ్‌ దేశాలతో సంబంధాలు వంటి కారణాలతోనే మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ సంయుక్త ప్రకటనను ఐక్యరాజ్యసమితి వద్ద పాలస్తీనా రాయబారి రియాద్‌ హెచ్‌.మన్సోర్‌ చదివి వినిపించారు. ఈ ప్రకటనకు లీగ్‌ ఆఫ్‌ అరబ్‌ స్టేట్స్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), అలాగే బ్రిక్స్‌ వ్యవస్థాపక దేశాలైన బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలు మద్దతు తెలిపాయి. భారత్‌కు క్వాడ్‌ భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్‌తో పాటు పొరుగు దేశాలు కూడా ఈ ప్రకటనకు మద్దతు తెలిపాయి. వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చట్టవిరుద్ధంగా తన ఆధిపత్యాన్ని విస్తరించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రకటనలో పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. 1967 నుంచి ఆక్రమిత ప్రాంతాల జనాభా, భౌగోళిక స్వరూపం, చట్టపరమైన స్థితిని మార్చే ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తు న్నామని వివరించాయి.

భారత్‌ వైఖరిపై విమర్శలు
తొలుత భారత్‌ ఈ ప్రకటనలో భాగం కాకపోవడం పలు దౌత్యవేత్తల విమర్శలకు దారి తీసింది. విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి నిరుపమ మీనన్‌ రావ్‌.. భారత్‌ తీరును సున్నితంగా విమర్శించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అరబ్‌ లీగ్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రధాని మోడీ గత కొన్నేండ్లుగా ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఇజ్రాయిల్‌కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే మద్దతు పలికే మోడీ.. నెతన్యాహు చర్యలను గతంలో ఖండించిన దాఖలాలు లేవు. గాజా ఘర్షణ సమయంలోనూ భారత్‌.. ఇజ్రాయిల్‌ చర్యలను తప్పుబట్టలేదు.

ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ చర్యలను ఖండించే ప్రకటనకు మొదట దూరంగా ఉండటం, ఆ తర్వాత విమర్శలు, ఒత్తిళ్ల నేపథ్యంలో మద్దతు పలకడం మోడీ ప్రభుత్వ అస్పష్ట వైఖరిని ప్రతిబింబించిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. దాదాపు తొమ్మిదేండ్ల విరామం తర్వాత మళ్లీ ఇజ్రాయిల్‌ పర్యటనకు సిద్ధమవుతున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక ప్రధాని మోడీ.. ఇజ్రాయిల్‌కు వెళ్లనుండటం ఇదే తొలిసారి అవుతుంది. వెస్ట్‌బ్యాంక్‌ విషయంలో ఇజ్రాయిల్‌ తీరును ఖండిస్తున్నామని అంతర్జాతీయ ప్రకటనకు మద్దతు ఇస్తూ.. మళ్లీ అదే ఇజ్రాయిల్‌ పర్యటనకు మోడీ వెళ్లనుండటం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -