Wednesday, May 7, 2025
Homeజాతీయంబీహార్‌లో మార్పు అనివార్యం

బీహార్‌లో మార్పు అనివార్యం

- Advertisement -

– ఎన్డీఏ కూటమి ఓటమికి ఐక్య మహా కూటమి వ్యూహం
– సమన్వయంతో ముందడుగు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
– ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సీపీఐ(ఎం) నేతల భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

బీహార్‌లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఐక్య మహా కూటమి వ్యూహంతో ముందుకు వెళ్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పేర్కొన్నారు. పాట్నాలో బీహార్‌లోని గ్రాండ్‌ అలయన్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, బీహార్‌ రాష్ట్ర కార్యదర్శి లాలన్‌ చౌదరి, కేంద్ర కమిటీ సభ్యుడు అవధేష్‌ కుమార్‌, సీపీఐ(ఎం) శాసనసభా పక్షనేత అజరు కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే ఈ ఏడాది అక్టోబర్‌లో బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ మహాఘట్‌బంధన్‌ (గ్రాండ్‌ అలయన్స్‌)ను బలోపేతం చేయడానికి వామపక్షాల కృషి కొనసాగుతోందని అన్నారు. సమన్వయంతో కూడిన ప్రతిపక్ష వ్యూహం అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. బీహార్‌లో ప్రభుత్వ మార్పు అనివార్యమని పేర్కొన్నారు. బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ ప్రోత్సహిస్తున్న మతతత్వాన్ని ఓడించడానికి అన్ని లౌకిక పార్టీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. ”బీహార్‌లో బీజేపీని ఎలా ఓడించాలి. రాబోయే కీలకమైన ఎన్నికల్లో మహాఘట్‌ బంధన్‌ను ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై చర్చలు జరుగుతాయి” అని ఆయన అన్నారు. మే 20న జరిగే కార్మిక సమ్మెకు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలవడంతో ప్రతిపక్షాల ఐక్యత, సంకల్పం స్పష్టమైందన్నారు. ఈ పరిణామాలతో బీహార్‌లో ప్రతిపక్షాలు తమ బలాన్ని పెంచుకుంటాయని, కూటమి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో వామపక్షాలు మరింత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఐక్య కూటమిని నడిపించడంలో సహాయపడాలనే సీపీఐ(ఎం) ఉద్దేశాన్ని ఎంఏ బేబీ నొక్కి చెప్పారు. బీహార్‌లో మహాకూటమి సామరస్యంగా ముందుకు సాగుతోందని, సీట్ల చర్చలు పురోగమిస్తున్నాయని తేజస్వి యాదవ్‌ అన్నారు. బీహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం పట్ల వారికి ఆసక్తి లేదని ఆయన అన్నారు. అంతకు ముందు బీహార్‌లోని మధుబని జిల్లా హుస్సేన్‌పూర్‌ గ్రామంలో సీపీఐ(ఎం) నేత భోగేంద్ర యాదవ్‌ విగ్రహాన్ని ఎంఏ బేబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎంఏ బేబీ మాట్లాడారు. మధుబని జిల్లాలో వామపక్షాల నేతృత్వంలోని పోరాటాల అద్భుతమైన వారసత్వాన్ని ప్రస్తావించారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దారుణమైన దాడిని ఖండిస్తూనే, ఉగ్ర వాదానికి మతం లేదని వారు నొక్కి చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా బీజేపీ మతపరమైన విభజనకు ఆయుధంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ”బీజేపీ నకిలీ జాతీయవాదం, మతతత్వాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలి” అని ఎంఏ బేబీ అన్నారు. రాబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్తు చేసి ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే, రాష్ట్ర కార్యదర్శి లాలన్‌ చౌదరి, కేంద్ర కమిటీ సభ్యుడు అవధేష్‌ కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎమ్మెల్యే అజరు కుమార్‌, రాంపరి దేవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ్‌ నరేష్‌ పాండే, ఆర్‌జెడి రాజ్యసభ ఎంపీ ఫయాజ్‌ అహ్మద్‌, సీపీఐ(ఎం) నాయకులు మనోజ్‌ కుమార్‌ యాదవ్‌, షీలా దేవి తదితరులు ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -