కొనుగోలు-నిర్వహణ-ఆపరేషన్‌ను ఆర్‌టిసిలకు అనుమతించడి : కేంద్రానికి ఎఎల్‌ఆర్‌టీడబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ‘సేవ్ ఆర్టీసీ’ దినోత్సవం
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ బస్సు పాలసీని మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఎఎల్‌ఆర్‌టీడబ్ల్యూఎఫ్) శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు-నిర్వహణ-ఆపరేషన్‌ను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించే బదులు రాష్ట్రాల్లోని ఆర్‌టిసిలకు అప్పగించాలని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లోని ఆర్‌టిసి కార్మికులు శుక్రవారం ‘సేవ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్స్’ను నిర్వహించిన సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు, కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నందుకు కార్మికులకు సమాఖ్య అభినందనలు తెలిపింది. ఎఫ్‌ఎఎంఇ-1, ఎఫ్‌ఎఎంఈ-2, పీఎం ఇ-బస్ సేవా వంటి పథకాల కింద ‘ఇ-మొబిలిటీ’ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం ఒత్తిడి తీసుకోస్తుందని, కేవలం పీఎం ఇ-బస్ సేవ కిందే పది వేల బస్సులకు రూ 20 వేల కోట్లు కేటాయించిదని తెలిపింది.
అయితే పథకంలో ఆర్టీసీల ద్వారా బస్సుల కొనుగోలు-నిర్వహణ-ఆపరేషన్‌ను ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేస్తారని తెలిపింది. దీంతో ఇ బస్సుల కొనుగోలుపై సబ్సీడిని ప్రయివేటు వ్యక్తులు పొందుతున్నారని తెలిపింది. పార్లమెంట్ ఆమోదించిన ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం ఆర్టీసీ లు ఏర్పడ్డాయని, ఇవి రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో పని చేస్తాయని ఈ ప్రకటనలో సమాఖ్య గుర్తు చేసింది. ఆర్‌టిసిలు అత్యల్ప ప్రమాద రేటు, అధిక ఇంధన సామర్థ్యంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని, అలాగే వాహన వినియోగం, ప్లీట్ వినియోగం, బ్రేక్ డౌన్ రేటు..వంటి వాటిలో ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయని తెలిపింది. దేశం మొత్తం అభివృద్ధిలో ఆర్టీసీ లు సహకారాన్ని అంతా అభినందిస్తున్నారని గుర్తు చేసింది. అయితే ఆర్టీసీ లను కేంద్ర విస్మరిస్తూ ప్రైవేటు వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించింది. ఈ విధానాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది.
అలాగే, శుక్రవారం ప్రభుత్వ రవాణాను రక్షించాలనే పిలుపుతో దేశవ్యాప్తంగా ‘సేవ్ ఆర్టీసీ’ దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు తెలిపింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ, కచ్ నుంచి కోహిమా వరకూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారని తెలిపింది. కరపత్రాలు పంపిణీ చేశారని, గేట్ సమావేశాలను నిర్వహించారని తెలిపింది. అలాగే, నిరసన ప్రదరన్శలు నిర్వహించి అధికారులకు మెమోరాండంలను సమర్పించారని తెలిపింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వివిధ రాష్ట్రాలోని ప్రయివేటు రవాణా కార్మికులూ నిరసన ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపింది.