Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనైపుణ్యత పెంచేందుకే ఏటీసీలుగా మార్పు

నైపుణ్యత పెంచేందుకే ఏటీసీలుగా మార్పు

- Advertisement -

మాటిచ్చిన ఏడాదిలో అమలులో చూపించాం
మరో 51 ఏటీసీలను ఏడాదిలో అందుబాటులోకి తెస్తాం : 65 ఏటీసీలను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత ప్రభుత్వం పదేండ్లు ఐటీఐలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి విమర్శించారు. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న యువత ఆశలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. కానీ, తాను యువతలో ఒకనిగా నిరంతరం కష్టపడి, ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నట్టు చెప్పారు. నైపుణ్యత లేని చదువు వృధా అని గ్రహించి, అందుకు తగినట్టు ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)లుగా మారుస్తానని ఏడాది క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగా కేవలం 14 నెలల వ్యవధిలో రూ.2,400 కోట్లతో 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చామనీ, రాబోయే ఏడాది కాలంలో మరో 51 ఐటీఐలను ఏటీసీలుగా మార్చబోతున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దావోస్‌ సమావేశాలకు తాను, మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లినప్పుడు అక్కడ టాటా ఆటోమొబైల్స్‌లో ఉద్యోగాలున్న దానికి తగినట్టుగా సాంకేతిక అర్హత కలిగిన వారు దొరకడం లేదని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అక్కడే రాష్ట్ర యువతకు సాంకేతిక నైపుణ్యం పెంచితే మంచి అవకాశాలు లభిస్తాయని గ్రహించి, టాటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఆ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే వెచ్చించగా, టాటా కంపెనీ రూ.2,100 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.

శనివారం హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ఏటీసీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మరోసారి పునరుద్ఘాటించారు. 1956లో ప్రారంభమైన ఐటీఐల్లో కోర్సులను అప్‌ గ్రేడ్‌ చేయకపోవడంతో అవి క్రమేణా నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేది లేదు. పట్టుదల ఉంటే సాధించలేనిదేది లేదు. పెట్టుబడి ఉంటేనే సరిపోదనీ, ఆలోచన ఉండాలనీ, ఆ ఆలోచనల్లో చిత్తశుద్ధి అవరమన్నారు. తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి 65 ఏటీసీల ప్రారంభమే నిదర్శనమని సీఎం చెప్పారు. వీటిని పూర్తి చేసి, మరో 51 ఏటీసీలను మంజూరు చేశామనీ, వీటి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తామని తెలిపారు. ప్రయివేటులో అర్హత లేకుండా చిన్న ఉద్యోగం కూడా రాని పరిస్థితులున్నాయని వివరించారు. తాను, తన సహచర మంత్రులు సిఫారసు చేసినా నైపుణ్యం ఉన్న వారికే తప్ప లేనివారికి ప్రయివేటులో ఉద్యోగం ఇప్పిచే పరిస్థితి లేదని సీఎం తెలిపారు.

తలరాతను మార్చేది చదువే
ప్రతి ఒక్కరి తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ చదువుతోనే సమాజంలో అసమానతలు తొలుగుతాయని అభిప్రాయపడ్డారు. ఆ చదువుకు నైపుణ్యం తోడైతే అమెరికా మాదిరిగానే జర్మనీ, జపాన్‌ ఏ దేశమైన మన ముందు మోకరిల్లుతుందని వివరించారు. యువత వ్యసనాలకు బానిసలు కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌ ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం సూచించారు. ఏటీసీలో చదివే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2 వేల చొప్పున ఉపకార వేతనం ఇచ్చేలా చొరవ తీసుకుని ఆర్థిక మంత్రితో చర్చించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబుకు సూచించారు.

జపాన్‌లో బోలెడు అవకాశాలు
జపనీస్‌ నేర్పించి జపాన్‌లో అవకాశాలు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. విదేశాల్లో ఉపాధి అంటే కేవలం అమెరికాయే కాదన్నారు. జపాన్‌, జర్మనీ తదితర దేశాల్లో యువతరం కొరత కారణంగా ఇతర దేశాల్లోని యువతకు అవకాశాలిస్తున్నాయని తెలిపారు. కేవలం సాఫ్ట్‌వేర్‌ కోర్సులతోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దని సూచించారు. ఏటీసీలో శిక్షణ జర్మనీలో నెలకు రూ.3.50 లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలు పొందిన వారున్నారని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. స్కిల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబ్‌ గా తెలంగాణను మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక యువత కోసం ఎన్నో అవకాశాలు కల్పించిందనీ, రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలను తీసుకోనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -