రైతుల నుంచి ఓఆర్‌సీ ఫీజు రద్దు
గేటెడ్ కమ్యూనిటీల్లో వ్యక్తిగత మీటర్లకు అనుమతి
మ్యాన్‌వల్‌కు స్వస్తి..ఇక నుంచి అన్ని ఆన్‌లైన్లోనే
గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో గురువారం నుంచి భారీ మార్పులు చోటుచేసు కోనున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. వినియోగదారుల అభ్యర్థన మేరకు వారికి పారదర్శక సేవలను అందించేం దుకు అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181లోని సబ్-సెక్షన్ (1) ప్రకారం సవరణలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ గెజిట్ గురువారం నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం కనెక్షన్ల కోసం కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాద వినియోగదారులకు తప్పనుంది. ఎస్టిమేషన్ల పేరిట కాంట్రాక్టర్లు, అధికారుల అక్రమ దందాకు తెరపడనుంది.
గతంలో విద్యుత్ స్తంభాలు, లైన్ల కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో ఫీజు వసూలు చేసేవారు. ఇకపై ఫిక్స్‌డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. కొత్త కనెక్షన్ కావాలనుకునే వారు ఇకపై భౌతిక పత్రాలతో అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత డిస్కం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, సంబంధిత ఆస్తి తాలుకు రుజువులు వంటి అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. వినియోగదారుడి దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జాప్యం జరిగితే ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారులకు సమాచారం చేరుతుంది.
రైతులకు భారీ ఊరట
సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకునే రైతులకు భారీ ఊరట లభించనుంది. ఇక నుంచి రైతులు కిలోవాట్‌కు రూ.1,000 చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్లు కావాలనుకుంటే ఆ మేరకు చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అదనపు చార్జీలంటూ అక్రమంగా వసూలు చేయడానికి వీలుండదు. గతంలో రైతులకు మోటారు నుంచి మూడు విద్యుత్ స్తంబాల వరకు ఉచితంగా ఇచ్చేవారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ (ఓఆర్‌సీ) పేరిట రూ.45 వసూలు చేసేవారు. ఇక నుంచి రైతులు ఓఆర్‌సీ చెల్లించాల్సిన అవసరం లేదు.
అపార్ట్ మెంట్లకు వెసులు బాటు
అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత కనెక్షన్లు తీసుకోవచ్చు. ఒక కిలోమీటర్ లోపు ఉన్న అపార్ట్‌మెంట్‌కు నిర్దేశిత ఫీజు చెల్లిస్తే ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. ఉదాహారణకు ఒక అపార్ట్‌మెంట్‌కు 20 మెగావాట్ల విద్యుత్ అవసరమనుకుంటే కిలోవాట్‌కు రూ.1,000 చొప్పున రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అపార్ట్‌మెంట్ వరకు లైన్లు వేయడం, విద్యుత్ వైర్లను లాగడం, ట్రాన్స్‌ఫార్మర్ బిగించడం లాంటి అన్ని రకాల పనుల బాధ్యత డిస్కంలదే అని గెజిట్‌లో స్పష్టం చేశారు. అయితే ఒక కిలో మీటర్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం పూర్తి ఖర్చు వినియోదగారులే భరించాల్సి ఉంటుంది.
అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారు వ్యక్తిగత కనెక్షన్లను తీసుకోవచ్చు. 150 కిలోవాట్ల లేదా అంతకన్నా ఎక్కువ కనెక్షన్ల కోసం వెచ్చించే వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవచ్చని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిస్కంలకు 2020లో ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల వల్ల నష్టం జరిగిందని డిస్కంలు భావిస్తే తదుపరి ఏడాదిలో ట్రూఆప్ పిటిషన్లో వాస్తవంగా తమకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకునే వెసులు బాటు కల్పించారు. కేంద్ర విద్యుత్ శాఖ తీసుకొస్తున్న సవరణల మేరకు తెలంగాణ డిస్కంల్‌లు ఏడాది కిందటే రెగ్యూలేషన్‌ను సవరించాలని ఈఆర్‌సీని కోరాయి. ఈ మేరకే కొత్త నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని భావిస్తున్నారు.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) ప్రకారం సర్వీస్ చార్జీలు
ఎల్టీ-వన్ డొమెస్టిక్ టారీఫ్
ఒక కిలోవాట్ (కేవీ) రూ. 500
ఒక కిలోవాట్ పైనుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జి రూ. 500 ఆపై ప్రతి కిలోవాట్‌కు రూ 600
ఐదు కిలోవాట్ల పైనుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జి రూ.2,900 ప్రతి కిలోవాట్‌కు రూ.1,500
20 కిలో వాట్ల పైన కనీస చార్జి రూ రూ.10,000
ఎల్టీ 2: గహేతర, వాణిజ్య,-ఎల్టీ 5 వీధి దీపాలు నీటి సరఫరా పథకాలు, ఎల్టీ 7-జనరల్ టారీఫ్
ఒక కిలోవాట్ (కేవీ) రూ. 1,000
ఒక కిలోవాట్ పైనుంచి 5 కిలోవాట్ల వరకు కనీస చార్జి రూ. 1,000 ఆపై ప్రతి కిలోవాట్‌కు రూ 1,200
ఐదు కిలోవాట్ల పైనుంచి 20 కిలోవాట్ల వరకు కనీస చార్జి రూ.5,800 ప్రతి కిలోవాట్‌కు రూ.2,000
20 కిలో వాట్ల పైన కనీస చార్జి రూ రూ.10,000
ఎల్టీ 3:పరిశ్రమలు
20 కిలోవాట్ల వరకు ప్రతి కిలో వాట్‌కు రూ.4,000
20 కిలోవాట్ల పైన ప్రతి కిలో వాట్‌కు రూ.10,000
ఎల్టీ 4: కుటీర పరిశ్రమలు
19 కిలోవాట్ల వరకు ప్రతి కిలో వాట్‌కు రూ.1,000
ఎల్టీ 5: వ్యవసాయం
20 కిలోవాట్ల లోపు ప్రతి కిలో వాట్‌కు రూ.1,000 (రైతుల నుంచి ఓఆర్‌సీ వసూలు చేయరాదు)
ఎల్టీ 9: విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు
ఒక కిలోవాట్ వరకు రూ.1,000
ఒక కిలోవాట్ నుంచి 20 కిలో వాట్ల వరకు కనీస చార్జి రూ.1,000, ప్రతి కిలోవాట్‌కు రూ.1,200
20 కిలోవాట్లపైన ప్రతి కిలోవాట్‌కు రూ.1,200



