Friday, December 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహెచ్‌-1బీ వీసాల జారీలో మార్పులు

హెచ్‌-1బీ వీసాల జారీలో మార్పులు

- Advertisement -

లాటరీలకు చెల్లుచీటీ
నైపుణ్యం, వేతన ఆధారిత ఎంపిక


వాషింగ్టన్‌ : హెచ్‌-1బీ వీసా కార్యక్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రధానమైన మార్పులు చేసింది. రాండమ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పి నూతన ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో అధిక నైపుణ్యం కలిగిన, ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. కొత్త నిబంధనలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 27న అమలులోకి వస్తాయి. ఇవి 2027 ఆర్థిక సంవత్సరపు హెచ్‌-1బీ వీసా పరిమితి రిజిస్ట్రేషన్‌ సీజన్‌కు వర్తిస్తాయి. అమెరికా ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో భారతీయ నిపుణులపై ప్రభావం పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికాలో హెచ్‌-1బీ వీసాలు కలిగిన వారిలో భారతీయుల సంఖ్య అధికంగా ఉన్నదన్న విషయం తెలిసిందే. అధిక నైపుణ్యం కలిగిన, ఎక్కువ వేతనాలు పొందుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను సవరించడం జరిగిందని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ వివరించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ పద్ధతిని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను తీసుకుంటున్నాయని తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న రాండమ్‌ లాటరీ విధానం స్థానంలో ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని, నైపుణ్యం, వేతనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. హెచ్‌-1బీ కార్యక్రమం యొక్క అసలైన ఉద్దేశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఇప్పుడు అమలులో ఉన్న హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ రాండమ్‌ ఎంపిక ప్రక్రియను అమెరికా కంపెనీలు, సంస్థలు దుర్వినియోగం చేస్తూ స్వదేశానికి చెందిన ఉద్యోగులతో పోలిస్తే తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుం టున్నాయని యూఎస్‌ సిటిజన్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రతినిధి మాథ్యూ ట్రజెస్సర్‌ తెలిపారు. కాగా హెచ్‌-1బీ వీసాలపై ప్రస్తుతం అమలులో ఉన్న వార్షిక పరిమితి (65,000)లో ఎలాంటి మార్పు ఉండదు. అమెరికా సంస్థల నుంచి అదనపు డిగ్రీలు పొందిన దరఖాస్తుదారులకు మరో 20,000 వీసాలు ఇస్తున్నారు.

ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత…
డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్‌-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం కాకుండా పలు చర్యలు ప్రకటించారు. కొత్తగా హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించారు. ఉద్యోగులపై నిఘా పెంచారు. ఈ నెల 15వ తేదీ నుంచి హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుదారుల స్క్రీనింగ్‌, వెట్టింగ్‌ను పెంచారు. సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను నఖశిఖపర్యంతం తనిఖీ చేస్తున్నారు. ఫలితంగా భారత్‌లో వీసా ఇంటర్వ్యూలు ఆలస్యమవుతున్నాయి. అనేక అప్పాయింట్‌మెంట్లు నెలల తరబడి వాయిదా పడుతున్నాయి. ఈ జాప్యం కారణంగా వీసా స్టాంపింగ్‌ కోసం భారత్‌ వెళ్లిన అనేక మంది హెచ్‌-1బీ వీసాదారులు ఇబ్బంది పడుతున్నారు. అమెరికా వీసా అనేది సౌకర్యమే కానీ హక్కు కాదని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. దేశ భద్రతకు, ప్రజల రక్షణకు ముప్పు కలిగించే అవకాశమున్న దరఖాస్తుదారులను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని వాడుకుంటున్నామని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -