ఇప్పటికీ కళ్లు తెరవని అధికారులు..
నిజామాబాద్‌లో 5 మండలాల్లో దెబ్బతిన్న బీటీ రోడ్లు..
నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలంలో వరద సృష్టించిన విలయ తాండవానికి భారీ ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. బీటీ రోడ్లు, కప్పల వాగు వంతెన, చెట్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. భీంగల్ పట్టణానికి ఇటు ఆర్మూర్ వెళ్లే ప్రయాణికులకు, ఆటు వాల్గోట్, నిజామాబాద్ వెళ్లే ప్రయాణకులకు ఇబ్బందికరంగా రోడ్డు మారింది. భారీ వరదల వల్ల రోడ్డుపై చెట్లు, కల్వట్లు కూలిపోవడం, రోడ్లు కోతకు గురవడం జరిగింది.
భీంగల్, బడా భీంగల్ మీదుగా ఆర్మూర్, నిజామాబాద్ కు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గాన ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అటువైపు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఒక బైక్ పై ఇద్దరు వెళ్తే ఒకరు బైక్ పై నుండి కిందకి దిగి, మరొకరు బైకును దాటించాల్సిన పరిస్థితి నెలకొంది. తేలిన రోడ్లపై టూ వీలర్, ఫోర్ వీలర్లతో ప్రయాణించడం గగనమైంది. ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పటికే పలు చోట్ల పునరుద్ధరణకు నోచు కోలేదు. ఇకనైనా అధికారులు రోడ్లకు మరమ్మత్తులు చేపట్టలని ప్రయాణికులు, స్థానిక ప్రజానీకం కోరుతోంది.
చుట్టూ తిరుగుకుంటా పోవాల్సి వస్తుంది..
బస్సులు రాక 13 రోజులవుతున్నది. బస్సులు, పెద్ద వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. పలు చోట్ల రోడ్డు కోతకు గురవ్వడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేటికీ భారీ వాహనాలు భీంగల్ కు రావడానికి ఇబ్బందిగానే మారింది. అత్యవసర పరిస్థితులలో అంబులెన్సులు, గర్భిణీలు, వృద్ధులు ప్రయాణించడం కష్టంగా మారింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకొని రోడ్లను బాగు చేయాలని కోరారు.