Friday, September 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅస్తవ్యస్తం వాటర్‌ సైకిల్‌

అస్తవ్యస్తం వాటర్‌ సైకిల్‌

- Advertisement -

వరదలు, కరువు మధ్య ఊగిసలాట
ఆరేండ్ల నుంచి పెరుగుతున్న అసమానతలపై డబ్ల్యూఎంఓ నివేదికతో ఆందోళన

జెనీవా : ప్రపంచ నీటి చక్రం (వాటర్‌ సైకిల్‌) రాన్రానూ అస్తవ్యస్తంగా, విపరీతంగా తయారవుతోందని, ఒకపక్క భారీ వరదలు, మరోపక్క తీవ్రమైన కరువు మధ్య ఊగిసలాడుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) గురువారం విడుదల చేసిన కొత్త నివేదిక పేర్కొంది. డబ్ల్యూఎంఓ సభ్య దేశాలు, అంతర్జాతీయ హైడ్రలాజికల్‌ మోడలింగ్‌ వ్యవస్థలు, ఉపగ్రహాలు పంపిన సమాచారం ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. ఆర్థికవ్యవస్థలు, పర్యావరణ వ్యవస్థలు, సమాజాలపై అధిక వర్షపాతం, అసలు వర్షాలే లేకపోవడం రెండూ కూడా తీవ్రమైన ప్రభావాన్నే కనబరుస్తాయని స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ వాటర్‌ రీసోర్సెస్‌ 2024 నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో మూడో వంతు ప్రాంతాలు మాత్రమే గతేడాది సాధారణ పరిస్థితులను కలిగివున్నాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో అయితే అతి లేదా కరువు పరిస్థితులను చవి చూశాయని తెలిపింది. అత్యంత స్పష్టంగా వున్న ఈ అసమానతలు వరుసగా ఆరేళ్ళనుండి కొనసాగుతుండడం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హిమనదాలు విపరీతంగా కరిగిపోతున్నాయి.

ఇలా జరగడం గతేడాది వరుసగా మూడో ఏడాదని డబ్ల్యుఎంఓ నివేదిక పేర్కొంది. ఇక ప్రాంతాల వారీగా చూసినట్లైతే అమెజాన్‌ పరీవాహక ప్రాంతం, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే దక్షిణాఫ్రికాలోని కొన్ని భాగాలు తీవ్ర కరువు గుప్పిట అల్లాడుతున్నాయి. దీనికి విరుద్ధంగా, సెంట్రల్‌, పశ్చిమ, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు సెంట్రల్‌యూరప్‌ల్లో సాధారణం కన్నా అత్యంత ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యాయి. మన సమాజాలను నిలిపివుంచది, మన ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేది, మన పర్యావరణ వ్యవస్థలకు ప్రాణాధారమైనది నీరే, అటువంటి జలవనరులే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జలసంబంధ ప్రమాదాలు, ముప్పు పెరుగుతోంది, ప్రజల జీవితాలను, జీవనోపాధులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని డబ్ల్యుఎంఓ సెక్రటరీ జనరల్‌ సెలెస్టె సాలో వ్యాఖ్యానించారు. నీటి కొరత ఇంకా పెచ్చరిల్లే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే 360కోట్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక నెలన్నా సరిపడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. 2050 నాటికి ఈ సంఖ్య 500కోట్లకు చేరే ప్రమాదముందని హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -