Saturday, September 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిచార్లీ కిర్క్‌ హత్య - కొన్ని అంశాలు!

చార్లీ కిర్క్‌ హత్య – కొన్ని అంశాలు!

- Advertisement -

అమెరికా జనాభా 35 కోట్లు, తుపాకులు 50 కోట్లు, పెద్ద వారి దగ్గర సగటున 1.93 ఉన్నట్లు అంచనా. వాటిలో ఒక దానికి మూడు పదుల వయస్సున్న ఒక విశ్లేషకుడు, విద్వేష మితవాద ప్రచారకుడు చార్లీకిర్క్‌ బలయ్యాడు. రోజుకు అమెరికాలో సగటున 131 మంది తుపాకులకు సమిధలవుతున్నారు. అలాంటి స్వేచ్ఛా గడ్డమీద గుండెమీద చేయి వేసుకొని రోడ్ల మీదకు రావాలంటే రాజకీయ నేతలు భయపడుతున్నారు. భిన్న భావజాలం కలిగినవారి చేతుల్లో బలయ్యే స్థితి అమెరికాలో ఉంది. కిర్క్‌ హత్యపై అమెరికా, భారత్‌తో సహా యావత్‌ ప్రపంచ మీడియా గుండెలు బాదుకొంటోంది. అతడిని రెండు పదుల వయస్సు దాటిన టేలర్‌ రాబిన్సన్‌ అనే యువకుడు సెప్టెంబరు పదవ తేదీన కాల్చి చంపాడు. 31 ఏండ్ల కిర్క్‌ తన మిత్రుడు అంటూ 79 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందనతో పెద్ద ప్రచారం, చర్చ జరుగుతున్నది. ఈనెల 21 కిర్క్‌ అంత్యక్రియ లకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కానున్నాడు. దేశవ్యాపితంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించాడు. ఇంత జరుగుతున్న తర్వాత మితవాద శక్తులు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా పెద్దలు ఆగుతారా? అందులోనూ మితవాద, కార్పొరేట్‌, పురోగామి భావాల వ్యతిరేక మీడియా ప్రపంచ వ్యాపితంగా రెచ్చిపోతున్న రోజులివి. కిర్క్‌ హత్యతో సంబరాలు చేసుకున్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తామని ట్రంప్‌ బృందం హెచ్చరించింది.

వామపక్ష తీవ్రవాదులే హత్యకు కారకులని, వారి అంతు చూస్తామని ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్‌ బెదిరింపులకు దిగాడు. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. ఏ భావజాలానికి చెందిన వారినైనా వ్యక్తిగతంగా హత్యకావించటం సమర్థించకూడదు. అది భావదారిద్య్రం, సరకులేని బాపతు చేసే పని. యావత్‌ ప్రపంచంలో మితవాదం మీద భావజాల పోరు ఈనాటిది కాదు. పురోగామి శక్తులు అన్ని విధాలుగా సన్నద్ధంగానే ఉన్నాయి. కిర్క్‌ను రాబిన్సన్‌ ఉద్రేకంతో చంపినట్లు కనిపిస్తున్నది. చార్లీ కిర్క్‌ పచ్చి మితవాది, మీడియా రంగంలోనే ఉన్నాడు. తీవ్రవాద భావాలతో ఉన్న వామపక్షవాదులు అద్భుతమైన చార్లీ కిర్క్‌ వంటి అమెరికన్లను నాజీలు, ఫాసిస్టులు, సామూహిక హత్యలు చేసేవారు, నేరగాళ్లుగా వర్ణిస్తున్నట్లు ట్రంప్‌ ఆరోపించాడు. అమెరికాలో ఏం జరుగుతోంది? ఎవరు ఎవరిని చంపుతున్నారు. యాంటీ డిఫమేషన్‌ లీగ్‌ అనే సంస్థ పదేళ్ల నాటి పరిణామాల గురించి 2022లో ఒక అధ్య యనం జరిపింది. మూడింట రెండు వంతులకు పైగా హత్యలు మితవాదులు చేసినవే అని తేలింది. మన దేశంలో మితవాద భావజాలాన్ని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని జాతి వ్యతిరేకులు, తుకడే తుకడే గాంగ్‌, కుహనా లౌకికవాదులు, అర్బన్‌ నక్సల్స్‌ అంటూ ముద్ర వేసినట్లుగానే అమెరికాలో కూడా తీవ్రవాద వామపక్ష వాదులని, మరొకటిగా చిత్రించి వాళ్లను చంపినా ఫరవాలేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. చంపివేస్తున్నారు.

న్యూయార్క్‌ మేయర్‌ పదవికి పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోహ్రాన్‌ మమదానీ తాను కమ్యూనిస్టును కాదని పదే పదే చెప్పినా డోనాల్డ్‌ ట్రంప్‌ పక్కా కమ్యూనిస్టు అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జోహ్రాన్‌ డెమోక్రటిక్‌ సోషలిస్టు గనుక అలా అన్నాడనుకుందాం. జో బైడెన్‌ గెస్టపో పాలన కొనసాగిస్తున్నాడని ట్రంప్‌ ఆరోపించాడు. గెస్టపో అంటే హిట్లర్‌ నాజీ పాలనలో ప్రత్యర్ధులను మట్టుపెట్టే రహస్య పోలీసు దళం. అలాంటపుడు జో బైడెన్‌ ఫాసిస్టు అయినట్లా? మన దేశంలో మత, కుల దురహంకారాలు ఉన్నట్లే అమెరికాలో జాత్యంహకారం ఉంది. చార్లీ కార్క్‌ హత్య జరిగింది ఎక్కడీ మితవాదుల అడ్డాగా ఉన్న అటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో. తుపాకీ సంస్కృతి ఎక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతు న్నదంటే మితవాదులు ఎక్కువగా ఉన్న రెడ్‌ రాష్ట్రాలలో అన్నది జగమెరిగిన సత్యం. 2021లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన పదింటిలో ఎనిమిది రాష్ట్రాలలో తలసరి తుపాకి మరణాలు లక్షకు 33.9 ఉన్నాయి. డెమోక్రాట్లు బలంగా ఉన్న మసాచుసెట్స్‌లో 3.4గా ఉంది. సామూహిక తుపాకి హత్యలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయంటే మితవాదులు ఎక్కువగా ఉన్న చిన్న పట్టణాల్లో ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. రిపబ్లికన్ల తుపాకి విధానాలు వారినే బలి తీసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.

తుపాకి హింసాకాండను అరికట్టేందుకు కేటాయించిన బడ్జెట్‌లో ఈ ఏడాది ట్రంప్‌ యంత్రాంగం 15.8 కోట్ల డాలర్ల కోత పెట్టింది. మితవాదుల పట్ల అమెరికాలో ఎంత వ్యతిరేకత ఉందంటే కార్క్‌ హత్య వార్త వెలువడగానే కొందరు సైనికులు పండగ చేసుకున్నారని వార్తలు రాగా వారి సంగతి చూడాలంటూ రక్షణ మంత్రి హెగసేత్‌ ఆదేశించాడు. సామాజిక మాధ్యమంలో సాయుధ దళాలకు చెందిన వారితో సహా ఉద్యోగులు, టీచర్లు, ప్రొఫెసర్లు ఇంకా అనేక మంది హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారంటే చార్లీ కిర్క్‌ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఐరోపా, అమెరికాలో ఇటీవలి కాలంలో పచ్చి మితవాదులు, వారిని వ్యతిరేకించేవారి సమీకరణలు పెరుగుతున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఆర్థికంగా ఆయా దేశాలు అనేక సమస్యలను ఎదుర్కోవటం. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు మూఢభక్తి, మితవాద భావనలు పెరగటానికి అవకాశాలు ఉంటాయి. మన దేశంలో సాంస్కఅతిక సారథుల పేరుతో సంఘపరివార్‌కు చెందిన వారు ఎలా తయారువుతున్నారో అమెరికాలో చార్లీ కిర్క్‌ కూడా యుక్త వయస్సు నుంచే మితవాద భావజాల సైనికుడిగా తయారయ్యాడు. ఫాక్స్‌ న్యూస్‌ వంటి మీడియా సంస్థలు అలాంటి వారిని వామపక్ష భావజాలంపై దాడికి వినియోగించాయి. మన దేశంలో కూడా అలాంటి ధోరణులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అందుకే కిర్క్‌ హత్య తర్వాత అలాంటి శక్తుల మీద సామాజిక మాధ్యమంలో అలాంటి వారికీ అదే గతి పడుతుంది లేదా పట్టాలని స్పందించారు, వీటి నుంచి అందరూ గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది.

-సత్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -