దేశవ్యాప్తంగా జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. ఈ పండగను ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ నియమాలు ప్రాంతాల వారీగా విభిన్నంగా ఉంటాయి. దక్షిణాదిలో ఒక తరహాలో, ఉత్తరాదివారు ఒక విధంగా జరుపుకుంటారు. ఏది ఏమైనా ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని రకాల వంటకాలు చేసుకుంటారు. అవేంటో చూద్దాం…
అటుకుల లడ్డు
కావాల్సిన పదార్ధాలు: నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, అటుకులు కప్పు, పల్లీలు కప్పు, జీడిపప్పులు గుప్పెడు, పావు కప్పు పుట్నాలు, ఒక నాలుగు ఇలాచీలు (మీకు ఇష్టమైతే), బెల్లం ముప్పావు కప్పు.
తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, అది కరిగిన తర్వాత అందులో ఒక కప్పు అటుకులు వేసి వేయించు కోవాలి. వేగిన ఆటుకుల్ని తీసి వేరేగా పెట్టుకోవాలి. అదే బాండీలో పల్లీలు, జీడిపప్పులు వేసి రంగు మారేంతవరకు వేయించుకోవాలి. ఈ మూడింటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో నాలుగు ఏలకులు దంచి వేయాలి. ఒకసారి చేత్తో మిశ్రమాన్ని బాగా కలుపుకొని, అందులో ఒక ముప్పావు కప్పు బెల్లం పొడిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో కలపాలి. ఈ మిశ్రమాలన్నిటిని చేత్తో బాగా కలుపుకోవాలి. లేదా అన్నిటినీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పి తీసేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన సైజ్‌లో నచ్చిన ఆకారంలో ఉండలుగా చేసుకోవడమే. ఇది ఎంతో బలమైన ఆహారం కూడా.
హల్వా
కావాల్సిన పదార్థాలు: అరకప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, నెయ్యి సరిపడా, కొంచం గోధుమ పిండి, కొంచం బొంబాయి రవ్వ, బెల్లం ఒకటిన్నర కప్పు(తీపి కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు), యాలకులు ఐదు, జీడిపప్పు ఎనిమిది, కిస్మిస్ ఎనిమిది, బాదం పప్పులు ఎనిమిది.
తయారు చేయు విధానం: కందిపప్పు, పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి, చల్లారిన తర్వాత మూత తీసి వాటిని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్, సన్నగా తరిగిన బాదంపప్పు ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్ల గోధుమపిండి, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. అవి కొంచెం దొర రంగులోకి రాగానే దాంట్లో మెత్తగా చేసి పెట్టుకున్న పప్పు వేయాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసి మూడు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత దానిలో మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లం వేసి బాగా కలపుతూ ఉండాలి. పప్పు, బెల్లం కలిసిపోయేలాగా కలియబెడుతూ స్పూన్ నెయ్యి వేసి యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి పైనుంచి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు వేయాలి. బాగా మెత్తగా అయ్యి దగ్గర పడిన తర్వాత కొద్దిగా నెయ్యివేసి కలిపి దించేయాలి.
– పాలపర్తి సంధ్యారాణి
చవితి స్పెషల్
- Advertisement -
- Advertisement -