నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్‌రావు, పాల్కొండ విజయానంద్‌రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామారెడ్డి, కళా రంగం నుంచి దీపికారెడ్డి, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. సేవా, కళా, ఇతర రంగాల్లో వారు చూపిన అంకితభావం, సేవలతోనే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశ ప్రజలందరికీ పండుగ వంటిదని సీఎం పేర్కొన్నారు. జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలియజేశారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు సన్మానం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఘనంగా సన్మానించనున్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్‌తోపాటు విభిన్న రంగాల్లో సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తర్వాత పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించారు. గతంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవితోపాటు ఇతరులను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని సన్మానించనున్నారు.



