Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డికి మతి భ్రమించింది

సీఎం రేవంత్‌రెడ్డికి మతి భ్రమించింది

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా గద్దెలు కూల్చేయాలని పిలుపు నివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హౌంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్‌ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగే వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్ల కాలంలో లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో, నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు అధికారంలో ఉండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో చిన్న పోస్ట్‌ పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ, మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్‌ రెడ్డి పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. నాలుగు కోట్ల తెలంగాణ సమాజం ఈ కుట్రను తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెడుతున్న రేవంత్‌ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -