తెలంగాణ హక్కులను కాలరాస్తున్న రేవంత్
బనకచర్ల, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి
అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీ సమావేశంలో మొదట చర్చించిందే బనకచర్లపై అని తెలిపారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్ల మీద ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. సీఎం, ఇరిగేషన్ మినిస్టర్ కలిసి గోదావరి నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇచ్చారని మండిపడ్డారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని విమర్శించారు. తన కాలేజీ టీడీపీ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఇంకా కాలేజీలో ఉన్నట్టే నీళ్లను కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. రేవంత్ చర్యలతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
టెలిమెట్రీ స్టేషన్లు ఇదివరకే ఉన్నాయని, కేఆర్‌ఎంబీ ఏపీలో ఉండాలన్నది విభజన చట్టంలోనే ఉందని గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలోని తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం చేపడితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఇచ్చే కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగల్ ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో జరిగిన అనధికారిక సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారని కవిత విమర్శించారు. బనకచర్లను ఆపేందుకు తెలంగాణ జాగృతి పక్షాన న్యాయపోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. కలిసివచ్చే పక్షాలతో ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు.
ఈనెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బనకచర్లతో పాటు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడనీ, ఆయనకు టీబీజీకేఎస్ బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఒక ఎమ్మెల్సీని జనాభా లెక్కల నుంచి తీసేశాననీ, ఆయన ఎవరో తనకు తెలియదనీ, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కవిత చెప్పారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES