ఆలస్యంగా వెలుగులోకి ఘటన
కన్న తల్లే హంతకురాలు
మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తుండగా హత్య వెలుగులోకి..
నవతెలంగాణ-శివ్వంపేట
ఓ మహిళ కన్న కూతుర్ని హత్య చేసి ప్రియుడితో పారిపోయిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోట్ల రాజు చిన్న కూతురు మమతను ఐదేండ్ల క్రితం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కర్‌కు ఇచ్చి వివాహం చేశారు. బంటు మమత, భాస్కర్‌కు తనుశ్రీ (3) కూతురు ఉంది. కాగా, తల్లిగారింటి నుంచి వడ్డేపల్లికి వెళ్తున్నానని మే 21వతేదీన కూతురుతో కలిసి వెళ్లిన మమత.. కనిపించకుండా పోయింది. దాంతో తండ్రి రాజు శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.మిస్సింగ్ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. మమత ఫోన్ ఆన్‌లో చూపించడంతో లొకేషన్ ఆధారంగా వారిని మమత, ఫియాజ్‌ను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో తనుశ్రీని హత్యచేసి పాతిపెట్టినట్టు ఒప్పుకున్నారు. శబాష్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్‌ను మమత గతంలో ప్రేమించింది. కాగా, తన కూతురు తనుశ్రీతో కలిసి వడ్డేపల్లికి వెళ్తున్నానని శబాష్‌పల్లి నుంచి వెళ్లిన మమత.. ఫయాజ్‌తో కలిసి ఏపీలోని గుంటూరుకు వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత చేతిలో డబ్బులు లేకపోవడం, తనుశ్రీ అనారోగ్యం బారినపడటంతో గుంటూరు నుంచి తిరిగి తూప్రాన్‌కు చేరుకున్నారు. తనుశ్రీ ఎన్నిరోజులున్నా తమకు ఇబ్బందేనని, కూతురిని మట్టుపెడితే అడ్డు ఉండదని భావించిన మమత.. ఫయాజ్‌తో కలిసి కూతుర్ని చంపేసి శబాష్‌పల్లి శివారులోని వాగులో పాతి పెట్టి తిరిగి గుంటూరుకు వెళ్లిపోయారు. మమత చెప్పిన ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పాతి పెట్టిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. వైద్యుల బృందాన్ని అక్కడికే రప్పించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
శభాష్‌పల్లి శివారులో చిన్నారి హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES