దోషులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల దురహంకారంతోనే చిన్నారిని హత్య చేశారనీ, హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో గుడిలోకి ప్రవేశించారనే కారణంతో అణగారిన కులాలకు చెందినవారనే ఉద్దేశంతో ఒక కుటుంబంపై దాడి చేసి 2 నెల్ల పసికందును కాళ్లతో తన్ని చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల దురహంకారం తలకెక్కిన కుల, మతోన్మాదులు రాష్ట్రంలో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇది అవాంచనీయమని చెప్పారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘటనలకు హద్దూ అదుపు లేకుండా పోతుందని హెచ్చరించారు. దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనీ, పైగా బాధితులపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయకార్యదర్శి బుగ్గవీటి సరళ, పి. ప్రభావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండి పద్మ, కె నాగలక్ష్మి, ఎమ్ వినోధ, పి శశికళ, వై వరలక్ష్మి, ఎమ్‌డీ షబానా బేగం, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కుల దురహంకారంతోనే చిన్నారి హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



