Sunday, July 6, 2025
E-PAPER
Homeసోపతిబాలల 'అభినందన' కథలమాల

బాలల ‘అభినందన’ కథలమాల

- Advertisement -

ఇందూరు జీవచేతన శ్రీరాం సాగర్‌తో పాటు మహాకవి దాశరథి కవిత్వానికి భూమికగా నిలిచిన నేల. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు, రూపాల్లో ఈ నేల పైన సృజన యజ్ఞం జరిగింది… ఇంకా జరుగుతోంది. ఈ కోవలోనే బాల సాహిత్య రచన కూడా జరిగింది. అనేక మంది కవులు, రచయితలు, బాల వికాసకారులు ఇవాళ్ళ బాల సాహిత్యం… బాలల సాహిత్యానికి ‘నిజామాబాద్‌’ను చిరునామాగా చేస్తున్నారు. ఇది చక్కని పరిణామం… బాల సాహిత్యానికి మంచి కాలం. కవిత్వం, కథ, గేయం, నానాలు, హైకూలు, చిత్ర కవితలతో పాటు బాలల కోసం సాహిత్యాన్ని రాస్తున్న కవయిత్రి, రచయిత్రి కె.వి. సుమలత ఇందూరు నేల.. గాలి.. నీటి వారసత్వంగా ఎదిగిన సాహితీవేత్త. కె.వి.సుమలతగా పాఠకులకు తెలిసిన శ్రీమతి కైకాల వెంకట సుమలతది నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌.

సుమలత 24 సెప్టెంబర్‌, 1970న పుట్టారు. శ్రీమతి పొన్నూరు వెంకట సత్యవతి-శ్రీ పొన్నూరు వెంకట సత్యనారాయణ వీరి తల్లితండ్రులు. సుమలత బాల్యం, విద్యాబ్యాసం వేల్పూరు, ఆర్మూరు, నిజామాబాద్‌లో జరిగాయి. బి.యస్సీ చదివి ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. విద్యార్థి దశలోనే సాహితీరంగంలో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు అన్ని రూపాలు ప్రక్రియల్లో విరివిగా రచనలు చేస్తున్నారు. ఈనాడు పత్రికలోని మకరందం, అంతర్యామిలోనూ వ్యాసాలు రాస్తున్నారు. కథా రచయిత్రిగా అన్ని ప్రముఖ పత్రికల్లో వీరి కథలు అచ్చయ్యాయి. తెలుగునాట జరిగే ప్రతి కథల పోటీల్లో పాల్గొన్న సుమలత అనేక బహుమతలను అందుకున్నారు. వీటిలో అక్షరాల తోవ పురస్కారం, నిజామాబాద్‌ వారి మందారం పురస్కారం, ముల్కనూరు కథా పురస్కారం, సోమేపల్లి పురస్కారం, సాహితీ కిరణం పురస్కారం మొదలైనవి. కవితలకు కూడా పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన బాల సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు. సుమలత ఇటీవల ‘స్వాతి’ పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ‘నాతి చరామి’ నవలకు లక్ష రూపాయల బహుమతి అందుకున్నారు. పదహారు వారాలపాటు స్వాతిలో సీరియల్‌గా ఈ నవల రానుంది. రచయిత్రిగా అచ్చయిన సుమలత తొలి పుస్తకం ‘సుమ సౌరభాలు’ కథా సంపుటి. ఈ పుస్తకం శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు రచయిత్రులు తొలి పుస్తకాల ప్రచురణలో భాగంగా అచ్చేవేయడం విశేషం. ఈ కథలన్నీ మనుషుల్ని, వారి మధ్యనున్న అనురాగాలు, ఆప్యాయతలను చూపుతాయి. ప్రతి కథ ఏదో ఒక కొత్త అంశాన్ని చెబుతుంది. అవన్నీ సుమ సౌరభాలే మరి.
‘నాకు పిల్లలన్నా.. వాళ్ళ కోసం రాయడమన్నా ఇష్టం’ అని చెప్పే సుమలత నూటాయాభైకి పైగా పిల్లల కథలు రాసారు. ఇవన్నీ హారు బుజ్జి, వార్త, నమస్తే తెలంగాణ, సాక్షి, సృజనక్రాంతి, ప్రజాశక్తి, నవ తెలంగాణ పత్రికల్లో వచ్చాయి. పిల్లల కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ఒకదానిని ‘అభినందన’ పేరుతో ‘నవచేతన’ ప్రచురించగా, మరొకటి ‘అసలైన బహుమతి’ పేర సాహితీ వారు ప్రచురించారు. బాలల మనసెరిగి, స్థాయి తెలిసి రచనలు చేసే బాలల రచయిత్రి సుమలత. ప్రకృతిని, ప్రకృతి తత్వాన్ని కథల్లో ఎలా పరిచయం చేయాలో ఈమెకు బాగా తెలుసు. అందుకు ఊరును తాతమనవళ్ళను ఎంచుకుని చక్కని కథలు రాసారు. ‘ఒదిగి ఎదగమని వెదురు చెబుతుంది’ కథలో చిన్నూ తాతతో ఉదయం నడకకు వెళ్తూ జారిపోతాడు. ఒడ్డునవున్న వెదురును పట్టుకు నిలదొక్కుకుంటాడు. ఆ నేపథ్యంలో తాత వెదురుతో పాటు అన్ని ప్రాణుల్లో ఉండే జీవం గురించి చెప్పడం ఈ కథ. బాగుంది కదూ! అవును మరి ఈ తరం పిల్లలకు చెప్పాల్సిన పద్ధతి యిదే మరి. ఏది చెప్పినా కొత్తగా చెప్పడం ఈమెకు బాగా తెలుసు. అటువంటిదే మరో కథ… ‘ఎంచక్కా నలుగురు మిత్రులు’. ఇది స్నేహంలో అంతరాలు.. తేడాలు లేవని తెలిపే చక్కని కథ. బాలల మనసును హత్తుకునేలా రాస్తారు సుమలత. ఈ టెక్నిక్‌ తన అన్ని కథల్లో చూడవచ్చు. అత్యాశకు పోవద్దని, ఉన్నదానితో తృప్తి పడడానికి మించిన ఆనందంలేదని చెప్పే కథ ‘వదల బొమ్మా నిన్ను వదల’ కథ. ‘తృప్తింజెందని మనుజు సప్తద్వీంబునైన చక్కబడునే’ అంటుంది భాగవతం. ఈ కథ కూడా అత్యాశకు పోకూడదని చెప్పే మంచి కథ. కేవలం నీతులు, సూక్తులు చెప్పి ఇవే కథలు అనలేదు రచయిత్రి. తాను చెప్పాలనుకున్న ప్రతి అంశాన్ని వివరంగా చెప్పడం… పిల్లలకు వివిధ విషయాలు అవగాహన అయ్యేట్టు రాయడం ఈమెకు బాగా తెలుసన్న విషయం బాలల కథలు చెబుతాయి. ‘ఓ వంతెన.. రెండు మేకలు.. ఒక పావురం’ కథ అహంకారం ఎలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుందో చెబుతుంది. ‘భలే భలే బన్నీ’ అసూయపడకూడదని, అది మంచిది కాదని పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టు రాసిన కథ. ఇందులో అందాల నెమలి అందాన్ని చూసి అసూయపడిన బల్లికి కుందెలు ఎలా బుద్ధి చెప్పిందో చూడొచ్చు. అభినందన కథ రోహిత్‌కు తల్లి బాల్యం నుండి చెప్పిన వీరగాథల వల్ల ప్రేరేపితుడై చేసిన సాహస కార్యాన్ని గురించి తెలిపే కథ. తన చుట్టూ ఉన్న మనుషులు, చూసిన సంఘటనలను తన కథకు వస్తువులుగా ఎంచుకుని రాశారు. బాల సాహిత్యంలో కొత్త చేరికలను తన కథా సంపుటాల ద్వారా తెచ్చిన సుమలతకు అభినందనలు. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -