Sunday, November 9, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్రచనలతో అద్భుతాలు చేస్తున్న పిల్లలు

రచనలతో అద్భుతాలు చేస్తున్న పిల్లలు

- Advertisement -

పిల్లల ప్రపంచం వేరు. అక్కడంతా పరస్పర సహకారం, స్నేహమే ఉంటుంది. మంచి చేయాలనే దృష్టి ఉంటుంది. దుర్మార్గాన్ని నిరసించే కోపం ఉంటుంది. జనాన్ని హింసించి ఆనందం పొందే దురాత్ములను తుదముట్టించే ఆవేశం ఉంటుంది. మొత్తంగా ప్రజలంతా సుఖంగా, శాంతిగా మనుగడ సాగించాలనే సామాజిక దక్పథమే కనిపిస్తుంది.

అసలు పిల్లలకే రాజ్యాన్ని అప్పచెబితే – ఏ కుంభకోణాలు, మరే స్వార్థ రాజకీయాలు లేకుండా ప్రజలందరినీ సమాన దృష్టితో పరిపాలన చేస్తారు కదా అని అనిపిస్తుంది. ఈ విశాల దృక్పథం, పరులకు మేలు చేయాలనే తపన, క్రమశిక్షణగా జీవించడం, పర్యావరణ హితంగా మెలగడం వంటి మంచి లక్షణాలతో మనుషుల మధ్య కులమతాల అడ్డుగోడలు ఉండకూడదు అనుకుంటారు. ఉన్నవాడు – లేనివాడు అనే తారతమ్యం లేని ప్రపంచాన్నే కలలు కంటారు. లోకంలోని అందాలు, ఆనందాలు అందరికీ చెందాలని తపన పడతారు. మొత్తంగా విశాల భావంతో, విశ్వ హితాన్ని కోరే పిల్లలే మనకు సాక్షాత్కరిస్తారు. వారికి పెద్దల్లాగా స్వార్థం ఉండదు. విశ్వైక భావనే ఉంటుంది. వారు ఈ ఆలోచనలతోనే పరిమళిస్తుంటారు. ఈ భావాలే వారి కథల్లోనూ, కవిత్వంలోనూ కనిపిస్తుంది. స్వయంగా బాలలు అనేక కథలు, కవిత్వాలు, పద్యాలు రాసి, ఏకంగా పుస్తకాలనే తీసుకువచ్చారు. ఇలా తీసుకురావడానికి, ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చి, వారు రచనలు చేస్తే ప్రోత్సహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉండడం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు.


హైదరాబాదుకు చెందిన వినీల, సాయికిరణ్‌ కొడుకు నిధీష్‌. సుచిత్ర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఇంగ్లీష్‌ మీడియంలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. ఏకంగా ”Mister Max and Mischief
thieves ” అనే కథల పుస్తకాన్ని ఆంగ్లంలో రాసేశాడు. దొంగలు సమాజంలో అరాచకాలు సృష్టించడం, వారిని ఎదుర్కోవడం ఈ కథల్లోని సారాంశం. చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, వయొలిన్‌ ప్లేయర్‌నే కాకుండా తైక్వాండోలో రాష్ట్ర స్థాయి బహుమతులు గెలుచుకుని బహుముఖ రంగాల్లో ప్రజ్ఞ చూపిస్తున్న సింహాద్రి ఆయుషి, రచయిత్రి నాగశిరీష కూతురు. 7వ తరగతి శ్రీ అరవింద ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతూనే ‘Finally a True Friend’ అనే నవలికను ఆంగ్లంలో రాసింది. ప్రణతి ఆనే విద్యార్థిని అన్యాయాలను ఎదుర్కునే క్రమంలో, ఎలైస్‌ అనే గ్రహాంతర వాసి వచ్చి సహాయం చేయడం ఇందులో ప్రధానాంశం.

ప్రైవేట్‌ పాఠశాలలకన్నా ప్రభుత్వ పాఠ శాలల్లో స్వేచ్చ కాస్త ఎక్కువే. గ్రామీణ ప్రాంతానికి చెందిన బాల బాలికలు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లోని చెడు తొలగిపోవాలని అనేక కథలు రాశారు. పిల్లల్లోని క్రియేటివిటీని గుర్తించిన టీచర్లు వారి కథలను వెలుగులోకి తెచ్చారు. సిద్దిపేట జిల్లాలోని అనంతసాగర్‌ ZPHS విద్యార్థి 11 ఏళ్ల వయసుకే 26 కథలు రాశాడు . 18 కథలతో ‘విశ్వ తేజం’ బాలల కథల సంపుటిని వారి గైడ్‌ టీచర్‌ బైతి దుర్గం సహకారంతో తెచ్చాడు. కథలన్నీ సామాజిక అంశాలైన పర్యావరణం, బైక్‌ రైడింగ్‌, జంతువుల పాత్రలతో పిల్లలకు హితం చెప్పడంగా ఉంటాయి. ఈ విద్యార్థి కథా రచన పోటీల్లోనూ, కథలు చెప్పడంలోనూ అనేక బహుమతులు గెలుచుకున్నాడు.

ఏచూరి సాయి నవీన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నాగుపల్లిలో పదవ తరగతి చదువుతూ ‘నవీన కథావనం’ అనే 20 కథలతో పుస్తకాన్ని తీసుకువచ్చింది. భూక్యా వర్షిత,ZPHS పాపకొల్లు నుండి ‘పందెం కాసిన చెట్లు’ అనే 16 కథలతో పుస్తకాన్ని వెలువరించింది. ఈ కథల్లో మూఢ నమ్మకాల నిరసన, స్నేహం, రైతులను రక్షించడం, మొదలైన సమాజ హితంగా ఆలోచించి రాసిన కథలే ఎక్కువ. ఈ చిన్నారి గైడ్‌ టీచర్‌, రచయిత్రి ఉరిమళ్ళ సునంద ఈమెని తీర్చిదిద్దారు. కథలే కాదు. రిజ్వాన అనే పదవ తరగతి చదివే అమ్మాయి చెరువుమాదారం ZPHS నుండి ‘రిజ్జు శతకం’ రాసింది. కన్నెగంటి వెంకటయ్య టీచర్‌ సహకారంతో ఈ వంద పద్యాలను రాసి వెలుగులోకి తెచ్చింది. ఇలా రాసుకుంటూ పోతే ఒక Ph.D., అంత గ్రంథమౌతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణలో వందలాది మంది బాలబాలికలు తమ రచనలను పత్రికల్లో, గ్రంథరూపంలోనూ వెలువరిస్తున్నారు. వీరంతా ముందు ముందు గొప్ప రచనలు చేసి, తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేయాలని కోరుకుందాం.

  • పుప్పాల కృష్ణమూర్తి
    99123 59345
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -