ప్రియమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు..? ఎండలు బాగా ఉన్నాయని అన్నావు, జాగ్రత్త నాన్న. మంచినీళ్లు బాగా తాగు. వీలైతే మజ్జిగ చేసుకొని తాగు. దాంట్లో కొంచం ఉప్పు, ఉంటే నిమ్మ రసం కలుపుకుని తాగు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎండాకాలం అంతా ఇంట్లో నేను మజ్జిగ చేస్తూనే ఉంటాను నీకు తెలుసుకదా!
నాన్న కిందటి ఉత్తరంలో పిల్లలను స్కూల్లో వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, వారికి ఆటపాటలతో నేర్పించాల్సిన విషయాలు చెప్పాను. పసి పిల్లలు ఏడాది వయసు రాగానే చిన్న చిన్న పదాలు పలుకుతూ ఉంటారు. వారితో ఎప్పుడూ కబుర్లు చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ, ఊ కొడుతూ ఉంటారు. ఇలా చేస్తే వాళ్లకు మాటలు త్వరగా వస్తాయి. మనం మాట్లాడకుండా ఉంటే వాళ్లకు ఆలస్యంగా అర్ధం అవుతాయి. దాంతో మాటలు ఆలస్యంగా వస్తాయి. మనం చెప్తున్నది వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పాలి. పాటలు కూడా వినిపిస్తూ ఉండాలి.
మరో విషయం నాన్న.. పిల్లలకు ఆరు నెలల వరకే పాలు ఆహారం. తర్వాత నెమ్మదిగా ఘన పదార్థం కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి. ఏదైనా ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయం ప్రకారం వారికి ఆహారం ఇవ్వాలి. నిద్ర కూడా సమయం ప్రకారమే అలవాటు చేయాలి. ఒక్కొక్క సారి వాళ్ళు తిన్న ఆహారం కక్కేస్తారు. అటు వంటప్పుడు కొంచం జాగ్రత్తగా చూసి ఆహారం తినిపించాలి. అదే ఎక్కువ సార్లు అలా అయితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. నీకు ఏ చిన్న తేడా చేసినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళేదాన్ని. అప్పుడు ఆయన ఏమన్నారంటే ‘చిన్న చిన్న వాటికి భయపడి మీరు పాపను తీసుకు రాకండి అమ్మా. ఇవన్నీ పిల్లలకు మాములే’ అన్న తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని, తప్పనిసరి అయితేనే వెళ్ళటం అలవాటు చేసుకున్నాను.
నాన్న ముఖ్యంగా పిల్లల పక్క ఎప్పుడూ చాలా మెత్తగా ఉండాలి. అందుకే ఇంట్లో ఉండే పాత నూలు చీరలు పిల్లల పక్కకు వేసేవారు. వాళ్లకు వేసే బట్టలు కూడా మెత్తగా, కొంచం వదులుగా గాలి ఆడుతూ ఉండాలి. గదిలోని వాతావరణం కూడా ఎక్కువ వేడి లేకుండా కొంచం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో.
కొందరిని చూస్తుంటాను ఎండాకాలంలో చంటిపిల్లల్ని బయటకు తీసుకుని వెళ్లెప్పుడు తలకు టోపి, కాళ్లకు సాక్స్, సిల్కు బట్టలు వేసి తీసుకుని వెళ్తుంటారు. అవి వారికి చికాకు కలిగించి బిగ్గరగా ఏడవటం మొదలు పెడతారు.
ఇలాంటి దుస్తులు వేయటం అస్సలు మంచిది కాదు. ఎండ తగలకూడదు అనుకున్నప్పుడు ఒక మెత్తటి బట్టపై నుండి వేసి తీసుకెళ్లాలి. బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా వారికి మంచినీళ్లు, పాలు, అదనపు బట్టలు ఒక బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్ళాలి. పిల్లల పెంపకం గురించి చాలా ఉంది నాన్న చెప్పాల్సింది. ఈ సారికి ఇంత వరకు చాలు. వచ్చేవారం పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళను ఎలా చూసుకోవాలి, ఎలా వారితో వ్యవహరించాలో చెప్తాను. ఉంటాను నాన్న.
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి
పిల్లలకు కబుర్లు చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



