పిల్లలు భావి భారత పౌరులు. వాళ్లు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే మంచి పౌరులుగా తయారవుతారు. లేదంటే దేశ భవితకే ప్రమాదం. అందుకే పిల్లలకు విలువలతో కూడిన విద్యావిధానం అవసరం. బట్టీ చదువులు కాకుండా సృజనాత్మకతను పెంచే చదువు కావాలి. అప్పుడే వాళ్లు మంచి సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములవుతారు. అలాంటి కృషి చేస్తున్నవారిలో ఏలూరి మమత ఒకరు. బాలోత్సవ్ రాష్ట్ర సహాయకార్యదర్శిగా ఉంటూ భావి భారతం కోసం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమెతో మానవి సంభాషణ…
మీ బాల్యం గురించి చెబుతారా..?
మా సొంత ఊరు ఖమ్మం దగ్గర కొక్కిరి గ్రామం. పుట్టింది పెరిగింది మొత్తం ఖమ్మం. నాన్న ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉన్నాము. మా నాన్న మన్నేపల్లి రాములు, అమ్మ కుసుమ. నాన్న సీపీఎం పార్టీ నాయకులు. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. ఆయనకు వచ్చిన ఆదాయంలో చాలా వరకు పార్టీకే ఇచ్చేవారు. పేదల కోసం పని చేస్తున్న పార్టీ అంటే నాన్నకు చాలా ఇష్టం. మేము ముగ్గురం పిల్లలం. అక్క, నేను, తమ్ముడు. ఇంట్లో అమ్మాయి, అబ్బాయి అనే తేడా ఉండేది కాదు. అమ్మాయిలు అన్నింట్లో ముందుండాలి అనే భావన వుండేది. మేము కూడా చాలా స్వేచ్ఛగా పెరిగాము. పార్టీ కుటుంబం వల్లనే అనుకుంటా ఇలాంటి అలవాట్లు మాకు స్వతహాగానే వచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐలో కూడా పని చేశాను. దీనివల్లనే సమాజానికి మన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలి అనేది అలవడింది. నాన్న ఆఫీసు, పార్టీ పనుల్లో బిజీగా ఉంటే మమ్మల్ని చూసుకోవడంతో పాటు వ్యవసాయం మొత్తం మా అమ్మనే చూసుకునేది. అలా అమ్మ కూడా చాలా కష్టపడేది.
టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
నాకు మొదటి నుండి పిల్లలతో గడపడం చాలా ఇష్టం. అందుకే టీచింగ్ ఎంచుకున్నాను. కొన్ని రోజులు టీచర్‌గా పని చేసి ఖమ్మంలో జాన్సన్ కిడ్స్ పేరుతో ఒక స్కూల్ పెట్టాను. బట్టీ చదువులు కాకుండా విద్యలో కొత్త పద్దతులు తీసుకురావాలనేది నా భావన. మాది ప్రైమరీ స్కూల్. ప్రతి తరగతికి నేనే స్వయంగా వెళ్లి క్లాసులు తీసుకునేదాన్ని. పిల్లల్లో వస్తున్న మానసిక మార్పులు గుర్తించి పీజీ సైకాలజీ చేసి చైల్డ్ సైకాలజీలో స్పెషలైజేషన్ చేశాను. కరోనా టైంలో స్కూల్ ఆగిపోవడంతో చాలా రకాల ఆర్ట్ నేర్చుకున్నాను. ఖమ్మంలో స్కూల్ వేరే వాళ్లకు లీజ్‌కి ఇచ్చి మేము హైదరాబాద్‌లో ఉంటున్నాం.
ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
పిల్లల కోసం ఏదో ఒక పని చేయకుండా ఉండలేను. అందుకే ప్రస్తుతం సుచిత్ర దగ్గర హౌలిస్టిక్ పేరుతో పిల్లల కోసం కౌన్సిలింగ్ సెంటర్ నడిపిస్తున్నాను. వారంలో నలుగురు పిల్లలు వస్తే అందులో ముగ్గురు ఫోన్‌కి అలవాటు పడిన వాళ్లే ఉంటున్నారు. కొంత మంది పిల్లలు ఫోన్లు ఇవ్వకపోతే తల్లిదండ్రులను కొట్టడం, కొరకడం వంటి హింసకు కూడా పాల్పడుతున్నారు. అంటే పిల్లలు చాలా ప్రమాదరకరమైన స్థాయికి వెళ్లిపోతున్నారు. అందుకే పిల్లలకు చిన్నతనం నుండే ఫోన్‌కి ప్రత్యామ్నయం చూపించాలి. ఇతర కార్యక్రమాల్లో వాళ్లను బిజీ చేయాలి. అందుకే బాలోత్సవ్‌తో కలిసి పని చేస్తున్నాను. రాష్ట్ర సహాయకార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నాను.
బాలోత్సవ్ ఆధ్వర్యంలో మీరు చేస్తున్న కార్యక్రమాలు.
భావితరాన్ని కాపాడుకోవల్సిన అవసరం మనకు ఉంది. అందుకే బాలోత్సవ్ ఆధ్వర్యంలో మేము కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. ఇప్పటికే వేసవి శిభిరాలు నిర్వహిస్తున్నాము. వీటికి మంచి స్పందన వచ్చింది. అలాగే ఉచిత ట్యూషన్లు నడిపిస్తున్నాము. ట్యూషన్లంటే ఏదో హౌంవర్క్ చేయడం, వెళ్లడం కాదు. పిల్లల్లో సృజనాత్మకత పెంచే విధంగా కథలు చెప్పడం, కొత్త ప్రయోగాలు చేయించడం లాంటివి ప్లాన్ చేస్తున్నాము. ఇలా అనునిత్యం పిల్లలను ఏదో ఒక రూపంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫోన్లకు బానిసలవుతున్న పిల్లల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఇవి కొంత వరకు ఉపయోగపడతాయి. మా కార్యక్రమాలు ఇంకా పెరగాలంటే తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. పిల్లలు మన దేశ సంపద. వాళ్లకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిస్తే మన సమాజం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అందుకే మేము బాలోత్సవ్ ఆధ్వర్యంలో ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం.
బాలోత్సవ్ కార్యక్రమాలకు స్పందన ఎలా ఉంది?
చాలా బాగుంది. ఈ మధ్య కొన్ని పాఠశాలల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాము. వీటికి మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రాధమిక స్థాయి నుండే ఆడపిల్లలకు వాళ్ల శరీరంపై వాళ్లకు అవగాహన కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నాం. చాలా మంది టీనేజ్‌లో చెప్తే సరిపోతుందిలే అనుకుంటారు. కానీ పిల్లలకు ప్రాధమిక స్థాయి నుండే చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎలాంటి విషయమైనా షేర్ చేసుకునేలా వాళ్లను తయారు చేయాలి. లేదంటే వాళ్లల్లో వాళ్లే దాచుకొని తర్వాత తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు వారంతట వాళ్లు ఆలోచించేలా చేయాలి. అప్పుడే వాళ్లలో క్రియేటివిటీ పెరుగుతుంది. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర రావాలి. చైనాలో అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. చైనాలో ఇలాంటి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు సమానం అనే అవగాహన కల్పిస్తారు. అందుకే అక్కడ అమ్మాయిలపై దాడులు జరగవు. మన దగ్గర కూడా అలాంటి వాతావరణం రావాలి.
చైనాలో ఇంకా మీకు నచ్చిన అంశాలేమిటీ?
పిల్లల్ని చూసుకునే విధానం బాగా నచ్చింది. అక్కడ ఒక పెద్ద పర్నిచర్ షాపింగ్ మాల్‌కు వెళ్లాము. మేము వెళ్లినప్పుడు అక్కడి పిల్లలకు వేసవి సెలవులు. అక్కడ పని చేసే వాళ్ల పిల్లలను తీసుకొచ్చి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆటలు ఆడిస్తున్నారు. ఎవరికి నచ్చిన ఆటలు వాళ్లు ఆడుకుంటున్నారు. మేము అక్కడే సుమారు రోజంతా గడిపాము. మన దగ్గరలా పిల్లలెవ్వరూ ఫోన్లు చూస్తూ కనిపించలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పని ప్రదేశంలో పిల్లల కోసం వాళ్లు చేసిన ఇలాంటి ఏర్పాటు నాకు బాగా నచ్చింది. మన దగ్గర కూడా ఇలా ఉంటే బాగుండనిపించింది. జంపింగ్ టవర్‌కు వెళితే అక్కడకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వందల మంది వచ్చారు. ఆ ప్లేస్ గురించి తమ పిల్లలకు చక్కగా వివరిస్తున్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తున్న ప్రాధాన్యం నాకు బాగా నచ్చింది. అలాగే అక్కడి మహిళలు 90 శాతం మంది పనిలో ఉన్నారు. క్యాబ్ డ్రైవర్స్, టూరిజం గైడ్స్, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటర్స్ దాదాపు అందరూ మహిళలే. చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారు.
టెక్నాలజీ పరంగా అక్కడ మీరు చూసిన మార్పులు..?
చైనా వాళ్లు టెక్నాలజీలో చాలా అప్డేట్‌గా ఉన్నారు. నేను ముందే చెప్పినట్టు మనకంటే 15 ఏండ్లు ముందున్నారు. డస్టబిన్ వాడాలన్నా స్కానర్ వాడతారు. ఆ స్థాయిలో వాళ్లు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రాధమిక స్థాయి నుండే పిల్లల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఏం కావాలన్నా వాళ్లవి వాళ్లే డిజైన్ చేసుకునే స్కిల్స్, టెక్నాలజీ వాళ్ల దగ్గరున్నాయి. అందుకే వాళ్లు తయారు చేసే వస్తువులకు రేట్లు చాలా తక్కువ. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఎలక్ట్రికల్ వాహనాలు, సైకిల్స్ బాగా వాడుతున్నారు. అక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ప్రజలు నివసించే భవనాలు మనలాగా వారసులకు రాసివ్వడం వుండదు. భవనానికి 70 ఏండ్లు పూర్తయితే ప్రభుత్వం వాటిని స్వాదీనం చేసుకుంటుంది. ఇది నాకు బాగా నచ్చింది. అందుకే అక్కడి ప్రజల్లో నాకు ఆశ, ఆరాటం, ఆర్భాటం కనిపించలేదు. ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు.
భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
బాలోత్సవ్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలకు ప్లాన్ చేయాలి. పిల్లలకు అందమైన బాల్యం అందించాలి. చైనాను చూసి వచ్చిన తర్వాత పిల్లలకు అలాంటి వాతావరణం కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. మాకు సాధ్యమైంత వరకు బాలోత్సవ్‌గా అలాంటి కృషి చేస్తాం. అయితే దీనికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం.
చైనా గురించి చెబుతున్నారు ఎప్పుడైనా వెళ్లారా?
ఈ మధ్యనే మా స్నేహితులతో కలిసి అనుకోకుండా వెళ్లాము. చాలా బాగా అనిపించింది. మనకన్నా 15 ఏండ్లు అడ్వాన్స్‌గా ఉంది చైనా. మేము వెళ్లిన ముఖ్యమైన నగరాలను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా శుభ్రంగా ఉంటాయి. అలాగే వాళ్ల ఆహార అలవాట్లు కూడా చాలా బాగున్నాయి. పిల్లలకు కూరగాయాలు, పండ్లు ఎక్కువగా ఇస్తారు. 70, 80 ఏండ్ల వయసు వారు కూడా చాలా ఫిట్‌గా ఉన్నారు. అందరినీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. నేను ఏ దేశం వెళ్లినా పిల్లల లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా పరిశీలిస్తున్నాను. చైనాలో కూడా అదే పరిశీలించాను.
– సలీమ
పిల్లలకు అందమైన బాల్యం అందించాలి
- Advertisement -
- Advertisement -