ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వున్నాం. డిజిటల్ తెరలపై చేతి వేళ్లు ముద్దాడే బాల్యాన్ని కళ్లారా చూస్తూ వున్నాం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పుల్ని గమనిస్తూనే వున్నాం. అత్యాధునిక సాంకేతికత అందివచ్చిన కాలంలోనూ కొంతమంది పిల్లలు కవిత్వాన్ని, కథల్ని ఇష్టపడుతూ చదువుతున్నరు. వారిలో ఒకరిద్దరు తమ సజనకు పదునుపెట్టి చిన్నచిన్న కథలు, కవితలు రాస్తూ వున్నరు. అందులో ఒక ఆణిముత్యం ఎమ్.డి. సన. ్గూనూ కాళేశ్వరం పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.
పిల్లలు రాసే కవిత్వంలో ‘వస్తువు’లు ఎలా వుంటున్నాయో తెలుసుకోవడం ద్వారా వారిపై వున్న ప్రభావాల్ని అంచనా వేయవచ్చు. పిల్లల ప్రవర్తనను, మూర్తిమత్వాన్ని నిర్ణయించే అంశాలుగా ఆ ప్రభావాలు ఎంతమేరకు దోహదపడు తున్నాయో తెలుసుకోవచ్చు. ఎటువంటి కుటుంబ, సామాజిక, పాఠశాల వాతావరణం వారి చుట్టూ వుందో అర్ధం చేసుకోవచ్చు.
”ఇతరులతో/ నిన్ను సంభాషిస్తుంటే/ ఎంతో వినసొంపుగా వుంటావు/ తెలంగాణ రాష్ట్రం కోసం/ అనేక రచనలు చేయించి/ సాధించి పెట్టావు/ నీవు అంతరించి పోకముందే/ మేము కాపాడు కుంటాము” (తెలుగు పలుకులు)
‘సన’ ఆంగ్ల మాధ్యమంలో చదువుతూ తెలుగులో కవిత్వం రాస్తుంది. తెలుగుభాష పట్ల వున్న మమకారాన్ని తెలిపే కవిత్వ పాదాల్ని సజిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాహిత్యం పాత్రను గుర్తుచేస్తుంది. రోజువారీ సంభాషణల్లోని తెలుగు మాధుర్యం ఎటువంటిదో చెబుతుంది. భవిష్యత్తులో తెలుగు అంతరించకముందే కాపాడుకుంటామని, కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేస్తుంది.
”మీరు లేకుంటే మా భవిష్యత్తు ఊహించలేనిది/
మంచి, చెడులను నేర్పినవారు అనునిత్యం తోడుండి విద్యాబుద్ధులు చెప్పినవారు మీరు చెప్పిన పాఠాలే/
మా జీవితాల్లో అక్షర సత్యాలు” (మార్గదర్శులు మా గురువులు)
చదువు నేర్పే గురువుల పట్ల గౌరవభావాన్ని ప్రకటిస్తుంది. పాఠాల్ని జీవిత సత్యాలుగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనను కల్గిస్తుంది. గురువు లేని విద్యను ఊహించలేమని చెబుతుంది. మరి డిజిటల్ పాఠాలు, ఎ.ఐ టీచర్లు విద్యారంగంలో సమూల మార్పులకు కారణమౌతున్న నేటితరంలో ‘గురువు’ స్థానాన్ని శాశ్వతం చేసేలా కవిత్వం రాయటం ముదావహం.
”పరీక్షలు అయిపోతున్నాయంటేచాలు వేసవి సెలవుల కోసం ఎదురుచూస్తాను/
సెలవులు వచ్చాయంటే చాలు అమ్మమ్మ ఊరికి ఎగిరిపోతాను ఊర్లోకి వెళ్లగానే/
ఆ పంటపొలాల గాలి తాకి శరీరం పులకరిస్తుంది/
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లగానే/ మనసు ఆనందంతో తేలియాడుతుంది” (వేసవి సెలవులు)
సెలవులంటే పిల్లలకెంత సంబురమో చెప్పనలవిగాదు. సెలవుల్లో అమ్మమ్మ ఊరు, పంటపొలాలు, ఆనంద క్షణాలు అన్నీ కవిత్వంలో బంధిస్తూ బాల్యాన్ని ఎలా ఆస్వాదిస్తుందో తెలియజేస్తుంది. బంధాలకు, ప్రేమకు, ప్రకతికి పిల్లల మనసు ప్రతిస్పందించిన విధం ఆయా అనుభూతులు, అనుభవాలు లేని వారికి కూడా ఆ ఆనందక్షణాల్ని పంచుతుంది.
”పంటపొలాలన్నీ బీడువారి పోతున్నాయి/
పెదాలు తడారిపోతున్నాయి. కడుపులు అలమటిస్తున్నాయి పల్లెలకు వెలుగు లేదు పచ్చదనం పారిపోయింది గలగల పారే నదులు/
మా ఊరి చెరువులు ఎండిపోయాయి/
ఆకాశంలో ఎక్కడ దాక్కున్నావు? ఎప్పుడొస్తావు?” (ఎప్పుడొస్తావు ?)
ప్రకతి వైపరీత్యం తాలూకు ప్రతిఫలనాలను ఎత్తి చూపిస్తూ, వాస్తవిక పరిస్థితుల్ని నేపథ్యంగా చేసుకుని ‘ఎప్పుడొస్తావు?’ అని వర్షాన్ని ప్రశ్నించడం చూస్తే ‘వస్తువు’ వైయక్తిక అనుభవాల నుంచి క్రమక్రమంగా సామాజిక, పర్యావరణ అంశాల దిశగా కొనసాగుతున్న తీరు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముగింపు ద్వారా శీర్షికను పాఠకులు ఊహించేలా పాటించిన నిర్మాణ వ్యూహం యిందులో వుంది. కార్యకారణ సంబంధం ద్వారా తిరిగి పునఃస్థాపించే అవకాశం వుందనే విషయం – వర్షాన్ని పిలవటం ద్వారా పచ్చదనం సంతరించుకుని, నీళ్లతో చెరువులు, నదులు కళకళలాడటం ద్వారా పల్లెలు వెలుగుతాయనే అంశాల్ళి చిన్నారి కలం సందేశాన్ని ఇస్తుందని భావించవచ్చు. ‘సన’ తన కవిత్వం ద్వారా సొంత అనుభవాలు, అనుభూతులతో పాటు సామాజిక బాధ్యతతో మరిన్ని రచనలు చేస్తూ ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కోరుకుంటూ చిన్నారి -సన’ కు అభినందనలు.
– బండారి రాజ్ కుమార్, 8919556560



