ఆచార్య సూర్యాధనంజయ్… ఇవ్వాళ్ళ తెలుగు సాహితీక్షేత్రంలో పరిచయం అక్కరలేని పేరు. మారుమూల బంజారా తండా నుండి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఎదిగిన స్త్రీమూర్తి. ఆమె స్ఫూర్తి ఎందరినో తండా నుండి చదువుల జండాలుగా ఎగిరేలా చేస్తోంది. దీనికి తోడు అందివచ్చిన విద్యావకాశాలు కావచ్చు, తల్లితండ్రుల చైతన్యం కావచ్చు, ఇవ్వాళ్ళ అనేక మంది ‘బాలసూర్య’లుగా వెలుగుతున్నారు. వారిలో చిన్నారిపొన్నారి దశలోనే కథారచయిత్రిగా లేత సంతకాన్ని చేస్తున్నది భూక్యా వర్షిత. ఇక్కడ ఒకమాట చెప్పాలి…
ఇంట్లో అమ్మా నాన్నలు మాట్లాడే భాష ఒకటి…! తన చుట్టుపక్కల ఉండే మిత్రులు మాట్లాడే భాష మరొకటి. దీనికి తోడు మూడు భాషల పద్ధతితో బడిలో మరో రెండు భాషలు నేర్చుకోవాలి. ఇన్నింటిని దాటుకుని ఎదగడం కదా! కానీ భూక్యా వర్షిత అటు చదువులోనూ… ఇటు రచనలోనూ రాణిస్తుంది. ఈ తీగకు ఆసరాగా నిలిచిన ఉపాధ్యాయిని వురిమళ్ళ సునందక్క. బాల వికాస కార్యక్రమాల్లో ముందు నిలిచిన సునందక్క స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో రచయితలుగా ఎదిగిన బాలబాలికల సంఖ్య పెద్దదే.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, జూలూరు పాడు మండలం, పాపకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న భూక్యా హర్షిత 7 నవంబర్, 2011 న పాపకొల్లు పరిధిలోని భీమ్లా తండాలో పుట్టింది. శ్రీమతి భూక్యా విజయ – మోతీరాం అమ్మానాన్నలు. అక్షరాలు నేర్చుకుంటున్న తొలిదశలో కవితలు, కథలు చెప్పడం మొదలుపెట్టిన హర్షిత రచనలు ‘పాపకొల్లు పసిడి కథలు’, ‘అమ్మ చెప్పింది’ సంకలనాల్లో అచ్చయ్యాయి. హర్షితకు చిన్నప్పటి నుండి కథలు చదవడం, వినడం ఇష్టం. రోజూ పత్రికల్లో వచ్చే కథలు చదివిన హర్షిత తాను కూడా అలా పత్రికల్లో రాయాలనుకుంది. అందుకు సునంద టీచర్ ప్రోత్సాహం తోడైనిలవగా హర్షిత రచయిత్రిగా నిలిచింది. హర్షిత రాసిన తొలికథ ‘తగినశాస్తి. ఈ కథకే ‘గడుగ్గాయి’ అంతర్జాతీయ బాలల పత్రిక వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి అందుకుంది. పాఠశాల దశలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న చిరంజీవి హర్షిత తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఉత్తమ బాల కథారచయిత్రిగా తన రెండవ కథ ‘ప్రతి నిమిషం విలువేనదే’కు బహుమతి గెలుచుకుంది. మరో బహుమతిని బాల సాహితీవేత్త చందమామ మాచిరాజు బాల సాహిత్య పీఠం వారు నిర్వహించిన జాతీయస్థాయి బాలల కథల పోటీల్లో ద్వితీయ బహుమతిగా నగదు పురస్కారం అందుకుంది హర్షిత.
సునందక్క చెప్పినట్టు, ‘సృజన గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం’ ఈ హర్షిత. తాను రాసిన కథల్లోంచి మేలిమి కథలు పదహారింటిని కూర్చి ‘పందెం కాసిన చెట్లు’గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాపకొల్లు పేరున వచ్చింది. పెద్దసారు మీరా సాహెబ్‌తో పాటు వెంకటనారాయణ, నిర్మల, విజయలక్ష్మి, ఎం.సుజాత, బి.సుజాత, శంకర్, ఇందిరల సౌజన్యం అందుకు తోడై నిలిచింది. పుస్తకానికి పేరు పెట్టిన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది పర్యావరణం విలువను, చెట్టూ, చేమా, పుట్టా, పురుగు దేని పాత్ర దానిదేనని చెప్పే కథ. ఈ కథలో అడవిలోని చెట్లను నరకడానికి వచ్చిన మనుషులతో చెట్లు పందెం కాస్తాయి. పందెం ప్రకారం చెట్లు కొద్దిసేపు ప్రాణ వాయువును అందించడం అపేస్తాయి. దాంతో బుద్దొచ్చిన మనుషులు తమ తప్పు తెలుసుకుని చెట్లను కొట్టకుండ ఉంటారు. తండాలో తాను చూసిన ఆకుపచ్చని స్వప్నాలను, వాటికి జరగుతున్న విధ్వంసాన్ని చూసింది కనుక హర్షిత ఈ కథను రాయగలిగింది. బాల్యంలోనే హేతువుగా ఆలోచించే గుణం రచయిత్రికి అబ్బింది. లేకుంటే ఇందులోని ‘అదృష్టం కోసం ఎదురుచూస్తూ…’ వంటి కథను రాయడం వీలుకాదు. అదృష్టాన్ని మాత్రమే గుడ్డిగా నమ్మితే ఎలా మోసపోతామో, ఎలా ఇబ్బందులు పడుతామో ఈ కథలోని కిరణ్ పాత్ర మనకు చెబుతుంది. అంతేకాదు, కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఈ కథ చెబుతుంది. బడి గుడిలో ఎదిగిన హర్షిత మంచి ఉపాధ్యాయులను గురించి, వారి విశిష్టతను గురించి చెప్పిన చక్కని కథ ‘ఉసాధ్యాయుని విలువ’. ఇది చదివితే విద్యార్థులను ప్రేమించి, వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దిన వారిని గురించి తెలుస్తుంది. ‘పట్నం వర్సెస్ పల్లెటూరు’ మరో మంచి కథ. తాను తండా నుండి వచ్చింది కదా, అక్కడి మనుషులు, గాలి, నీరు, వాతావరణం అన్నీ తనకు తెలుసు. తాను చదువుతున్నది కూడా ఇంకా టౌన్‌గా ఎదగని ఊరులోనే. అందుకే తల్లి లాంటి పల్లె ప్రాముఖ్యతను సంభాషణల రూపంలో ఈ కథలో కళ్ళకు కట్టినట్టు చెబుతుంది రచయిత్రి. ముఖ్యంగా పల్లెల్లోని బంధుత్వాలు, ప్రేమలు ఇందులో చూపిస్తుంది. నేటి పిల్లలు కంప్యూటర్లు, ఫోన్లతో పాటు ‘జంక్‌ఫుడ్ తింటే’ జరిగే అనర్ధాలను హర్షిత తన ఆలోచనల్లో చెబుతుంది. ఇందులోని ‘వీడియో గేమ్స్’, ‘సైన్స్ సూత్రాలను..’ ‘అత్యాశ’, ‘కోతి చేసిన కొండంత సాయం’, ‘ఎండాకాలంలో.. ఓ మంచి పని’, ‘ప్రతి నిమిషం విలువైనది’, ‘తగినశాస్తి’ వంటివి చక్కని నీతిని చెబుతాయి. బాల్యంలో వెల్లివిరిసిన స్నేహం జీవితాంతం నిలిచివుంటుంది. తల్లితండ్రుల తర్వాత మన క్షేమం కోరేది స్నేహితులన్న విషయం తన ‘స్నేహం కోసం’ కథలో చెబుతుంది ఈ బాల రచయిత్రి. తండా నుండి ఎదిగిన ఈ బంజారా బాలచంద్రిక వెలువరించిన షోడక కాంతులీ కథలు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు బాలల సాహిత్యంలో తండా పొడిచిన పచ్చబొట్లు ఈ ‘పందెం కాసిన చెట్లు’. జయహో! బాల సాహిత్యం!
- డా|| పత్తిపాక మోహన్
9966229548