Thursday, October 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురేటు తగ్గిన మిర్చి

రేటు తగ్గిన మిర్చి

- Advertisement -

క్షీణించిన ఎగుమతులు
తగ్గిన సాగు విస్తీర్ణం
రెండేండ్ల క్రితం క్వింటా రూ.25వేలు..ఇప్పుడు రూ.12వేలు
ఎకరానికి రూ.3.25 లక్షల పెట్టుబడి
ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపుతున్న రైతాంగం
గతేడాది పంట ఇప్పటికీ కోల్డ్‌స్టోరేజీల్లోనే..

”వాణిజ్య పంటల రారాజు మిర్చి. అన్నీ అనుకూలిస్తే రైతులకు సిరుల పంటే.. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ధరలు బాగుంటే రైతులకు రూ.లక్షల్లో ఆదాయం తీసుకువచ్చేది ఇదే. అటువంటి ఈ పంట రెండేండ్లుగా నష్టాల బాట పడుతోంది. దీనికి తెగుళ్లు పెరగడం, దిగుబడులు తగ్గటం ఓ కారణమైతే.. ఎగుమతులు లేక ధరలు క్షీణించటం ప్రధాన కారణం.”

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో మిర్చి సాగు విస్తీర్ణం పడిపోతోంది. గత సీజన్‌లో విదేశాలకు ఎగుమతులు లేక మార్కెట్లో ధరలు విపరీతంగా తగ్గాయి. 2023లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా రూ.25వేలకు పైగా పలికిన మిర్చి ఇప్పుడు రూ.12వేలు-రూ.13వేలకే పరిమితమైంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం మిర్చి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ నెలతో మిరప సాగు కాలం ముగుస్తుంది. 2024-25 సీజన్‌లో రాష్ట్రంలో 2,66,043 ఎకరాల్లో మిర్చి సాగవగా, దీనిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 60,401 ఎకరాలు, మహబూబాబాద్‌లో 48,729, జోగులాంబ గద్వాలలో 38,363, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 22,555, జయశంకర్‌ భూపాలపల్లిలో 20,145, భద్రాద్రి కొత్తగూడెంలో 17,590 ఎకరాల్లో సాగు చేశారు.

ఈ ఏడాది (2025-26) ఖమ్మం జిల్లాలో 30వేలు, మహబూబాబాద్‌ జిల్లాలో 25వేలు, భద్రాద్రిలో 8వేల ఎకరాల్లో ఇప్పటి వరకు మిర్చి సాగైనట్టు ఉద్యానశాఖ అధికారుల అంచనా. రాష్ట్రం మొత్తమ్మీద 96వేల ఎకరాలు మాత్రమే సాగైనట్టు లెక్కలు చెబుతున్నాయి. మిరప విత్తనాల విక్రయాలు కూడా భారీగా తగ్గాయి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మం, వరంగల్‌ నుంచి తేజ, ఇతరత్రా మెరుగైన మిర్చి విత్తనాలను రైతులు విరివిగా కొనుగోలు చేసేవారు. రెండేండ్ల క్రితం కిలో రూ.35వేల నుంచి రూ.లక్ష విలువ చేసిన మిర్చి సీడ్‌ ధరలు ఈ ఏడాది తగ్గాయి. రూ.25వేల నుంచి రూ.55వేలకు క్షీణించినా కొనేవారు కరువయ్యారు. ఇప్పటికీ 25శాతానికి పైగా విత్తనాలు షాపుల్లోనే నిల్వ ఉన్నాయి. మిర్చి నర్సరీల సంఖ్య కూడా ఈ ఏడాది పదిశాతానికి పడిపోయింది.

కోల్డ్‌ స్టోరేజీల్లోనే గత ఏడాది పంట
రాష్ట్రంలో పండిన మిర్చిని చైనా, థారులాండ్‌, అమెరికా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఆ దేశాల్లోనూ మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో దిగుమతి చేసుకోవటం తగ్గించారు. మనదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు సైతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మిర్చి ఎక్కువగా ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ మిర్చి సాగవుతుండటంతో అక్కడికీ ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా నిరుడు పండించిన పంట ఇప్పటికీ కోల్డ్‌స్టోరేజీలు, గోదాముల్లో నిల్వ ఉంది. బహుళజాతి కంపెనీలు గతంలో రైతులతో బై బ్యాక్‌ ఒప్పందాలు కుదుర్చుకొని మిర్చి సాగును ప్రోత్సహించేవి. ప్రస్తుతం మార్కెట్లో మిర్చికి డిమాండ్‌ లేకపోవటంతో కంపెనీలు కూడా ఆసక్తి చూపటం లేదు.

మిగులు లేకే వెనుకబాటు
గత ఏడాది నుంచి మిర్చి ధరలు క్షీణించటంతో మిగులు లేక రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎకరానికి దాదాపు రూ.3.20 లక్షలు పెట్టుబడి అవుతుండగా ప్రస్తుత ధరల ప్రకారం విక్రయిస్తే రూ.3.50 లక్షల వరకు వస్తున్నాయి. 9నెలల పాటు కష్టపడితే కేవలం రూ.30వేలు మాత్రమే మిగులుతున్నాయి. అది కూడా రూ.14వేలకు క్వింటా చొప్పున అమ్మితేనే ఈ కొద్దిపాటి లాభం కూడానూ. ఒకవేళ రూ.12వేలకు క్వింటా చొప్పున విక్రయిస్తే రూ.5వేల వరకు నష్టం చవిచూడాల్సిందే. గత మూడు, నాలుగేండ్లుగా మిర్చికి నల్లుల బెడద ఎక్కువైంది. తామరనల్లి వ్యాప్తి అధికంగా ఉండటంతో రైతాంగం వారానికి రెండు సార్లు మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది.

9నెలల కాలంలో 45-50 సార్లు పురుగుమందు స్ప్రే చేస్తే దీనికే రూ.లక్షకు పైగా పెట్టుబడి అవుతోంది. ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తే.. మిర్చి కోతలకు క్వింటాకు రూ.6వేల చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. అంటే పురుగుమందులు, మిర్చి సేకరణకే రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఇక.. అడుగుమందులు, దున్నుడు కూళ్లు, పాట్లు, కలుపుతీత పనులకు కలిపి మరో రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. కనీసం క్వింటా రూ.20వేలకు పైగా ఉంటే రైతుకు ఎకరానికి రూ.2-3 లక్షల వరకు మిగులుతాయి. ప్రస్తుత ధరలతో ఏమాత్రం గిట్టుబాటు కాదనే కారణంతో రైతాంగం మిరప సాగుకు సిద్ధపడట్లేదని ఉద్యానశాఖ చెబుతోంది.

ఈ ఏడాది మిర్చి వేయలేదు : కె.వినోద్‌రెడ్డి, బీరోలు, తిరుమలాయపాలెం
ధరలు తగ్గటంతో మిర్చి పంట ఏమాత్రం లాభదాయకంగా లేదు. అందుకే మిర్చి కన్నా ఇతర పంటలు మేలని మొత్తం పొలం అచ్చుగట్టా. కొంచెం పత్తి వేశా. మా గ్రామంలో గతంలో మిరప సాగు చేసే అనేక మంది రైతులు ఇప్పుడు ఆయిల్‌పామ్‌ సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -