షాంఘై నుంచి బ్యూనస్ ఎయిర్స్‌కు…
బీజింగ్ : చైనా ఎయిర్‌లైన్ విమానం గురువారం ఉదయం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్ టైమ్స్ అందించిన వివరాల ప్రకారం…చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎంయూ745 షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వైపు బయలుదేరింది. చివరికి అది అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ చేరుకుంటుంది. సుమారు ఇరవై వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ విమానం తూర్పు, పశ్చిమ గోళార్థాలతో పాటు ఉత్తర, దక్షిణ గోళార్థాలను కూడా దాటుతుంది. ప్రపంచంలో ఒక వైపు (వన్ వే) సుదీర్ఘ ప్రయాణం సాగించే విమానంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. దీని ద్వారా చైనా, దక్షిణ అమెరికా మధ్య ప్రయాణ కాలం నాలుగు గంటలకు పైగా తగ్గుతుంది. వారానికి రెండు సార్లు ప్రయాణించేలా దీని షెడ్యూల్‌ను రూపొందించారు. షాంఘై నుంచి దక్షిణ అమెరికాలోని ప్రధాన నగరాలకు ఇప్పటి వరకూ నేరుగా విమాన సర్వీసులు లేవు. ఆ లోటును ఈ విమానం భర్తీ చేస్తుంది. విమానం తన ప్రయాణంలో మూడు ఖండాలను అనుసంధానించడం విశేషం. ఈ కొత్త మార్గం దక్షిణ కారిడార్‌ను ఉపయోగించుకొని మధ్యలో ఆక్లాండ్‌లో ఆగుతుంది. మొత్తంమీద ఈ మార్గం ప్రయాణ సమయాన్ని 30 నుంచి 25 గంటలకు తగ్గిస్తుంది.



