– సరిహద్దు ఆర్థిక సేవలకు ఊతం
– వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అమలు
బీజింగ్ : విదేశీ వాణిజ్య చట్టానికి చైనా సవరణ చేసింది. ఈ సవరణను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. తాజా సవరణ సరిహద్దు ఆర్థిక సేవలు, డిజిటల్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపునకు ఊతమివ్వనున్నది. ఈ సవరించిన చట్టం 2026 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. మీడియా సమావేశంలో జాతీయ ప్రజాసభ శాసన వ్యవహారాల కమిషన్ ప్రతినిధి హువాంగ్ హైహువా మాట్లాడుతూ.. ఈ సవరణల ప్రధాన లక్ష్యాలు చైనాను బలమైన వాణిజ్య దేశంగా తీర్చిదిద్దడం, న్యాయమైన అంతర్జాతీయ ఆర్థిక-వాణిజ్య వ్యవస్థను రక్షించడం, వివిధ మార్గాల ద్వారా అంతర్జాతీయ సేవల వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అలాగే వాణిజ్య ప్రోత్సాహక వేదిక సేవా సామర్థ్యాన్ని పెంచడమేనని తెలిపారు. చైనా విదేశీ వాణిజ్య చట్టం తొలిసారిగా 1994లో అమల్లోకి వచ్చింది. 2004లో ఒకసారి సవరించారు. తాజా సవరణలతో ఈ చట్టం ఇప్పుడు 11 అధ్యాయాలుగా రూపొందించబడిందని జిన్హువా వివరించింది. విదేశీ వాణిజ్య నైపుణ్య వనరుల అభివృద్ధి ఈ చట్ట సవరణలో ఒక ముఖ్యమైన అంశంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అధ్యయన సంఘం కార్యవర్గ సభ్యులు లీ యోంగ్ తెలిపారు. విదేశీ వాణిజ్య చట్ట సవరణ తక్షణమే విదేశీ వాణిజ్యాన్ని స్థిరీకరించడమే కాకుండా.. దీర్ఘకాలంలో నాణ్యమైన, స్థిరమైన వాణిజ్య అభివృద్ధికి పటిష్టమైన పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సవరణలు చైనా కమ్యూనిస్టు పార్టీ రూపొందించిన 15వ ఐదేండ్ల ప్రణాళిక లక్ష్యాలకు పూర్తి అనుగుణంగా ఉండి, చైనాను బలమైన వాణిజ్య దేశంగా మార్చే దిశగా ముందడుగు వేస్తాయని ఆయన తెలిపారు.
విదేశీ వాణిజ్య చట్టానికి చైనా సవరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



