Saturday, December 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికన్‌ రక్షణ సంస్థలపై చైనా ఆంక్షలు

అమెరికన్‌ రక్షణ సంస్థలపై చైనా ఆంక్షలు

- Advertisement -

తైవాన్‌పై కవ్వింపు చర్యలు వద్దు!

బీజింగ్‌ : అమెరికాకు చెందిన 20 రక్షణ సంస్థలపై చైనా శుక్రవారం ఆంక్షలు విధించింది. తైవాన్‌కు 11.1 బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాల అమ్మకాల ప్యాకేజీ కి ట్రంప్‌ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినందుకు ప్రతిగా చైనా ఈ చర్య తీసుకుంది. తైవాన్‌ అంశంపై చైనాను రెచ్చగొట్టే ఏ ప్రయత్నానికైనా తీవ్ర ప్రతిస్పందన వుంటుందని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. అమెరికా తీసుకున్న చర్యను ఖండిస్తూ అమెరికా మిలటరీకి చెందిన 20 సంస్థలపై, 10మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపై చర్యలు తీసుకోవాలని బీజింగ్‌ నిర్ణయించింది. ఇటీవల కాలంలో తైవాన్‌కు ఆయుధాలు అందచేసే ప్రక్రియలో వీరందరి పాత్ర వుందని చైనా భావిస్తోంది.

తైవాన్‌కు సంబంధించిన చైనా కీలక ప్రయోజనాలను అమెరికా ఎన్నడూ ఉల్లంఘించరాదని, ఇది చైనా-అమెరికా సంబంధాల్లో మొదటి లక్ష్మణరేఖ అని ఆ ప్రకటన పేర్కొంది. ఎవరైనా ఈ రేఖను ఉల్లంఘించాలని భావించినా, లేదా తైవాన్‌పై రెచ్చగొట్టే చర్యలకు దిగినా చైనా కచ్చితంగా దీటుగా స్పందిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. ఒకే చైనా అన్న సూత్రానికి అమెరికా కట్టుబడాలని కోరింది. తైవాన్‌కు ఆయుధాలు అందచేసే ప్రమాదకరమైన చర్యలను నిలిపివేయాలని పేర్కొంది. తైవాన్‌ జలసంధిలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించరాదని స్పష్టం చేసింది. తైవాన్‌ వేర్పాటువాద శక్తులకు తప్పుడు సంకేతాలు పంపరాదని పేర్కొంది. దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -