జర్మనీని వెనక్కి నెట్టి పదో స్థానానికి..
వరుసగా మూడో ఏడాదీ ఇదే స్థానం
38వ ర్యాంకుకే పరిమితమైన భారత్
ఆర్ అండ్ డీలో బయటపడిన బలహీనతలు : జీఐఐ 2025 నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2025 లో ఈ సారి పెద్ద మార్పులే జరిగాయి. చైనా తొలిసారిగా పదో స్థానానికి ఎగబాకింది. జర్మనీని వెనక్కి నెట్టి టాప్-10 జాబితాలోకి ప్రవేశించింది. దీంతో జర్మనీ 11వ స్థానానికి పడిపోయింది. ఈ పరిణామం పాశ్చాత్య దేశాల ఆధిపత్యం తగ్గుతూ.. కొత్త దేశాలు వాటి స్థానాన్ని భర్తీ చేస్తున్నాయని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇక భారత్ మాత్రం 38వ స్థానంలోనే ఉన్నది. మూడేండ్లుగా భారత్ ఇదే ర్యాంకులో ఉన్నది. అనగా.. దేశంలో పరిశోధన నిధుల కొరత, పెట్టుబడులు తక్కువగా ఉండటం, పరిశ్రమ- విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు బలహీనంగా ఉండటం వంటి నిర్మాణాత్మక లోపాలను సూచిస్తున్నట్టు నివేదిక పేర్కొన్నది.
స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్‌లు టాప్-5లో ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి నివేదికను ‘ఇన్నోవేషన్ ఎల్ ఎ క్రాస్‌రోడ్స్’ అనే పేరుతో విడుదల చేశారు. ఈ 18వ ఎడిషన్‌లో 139 దేశాలు, వందకు పైగా ఇన్నోవేషన్ క్లస్టర్లను విశ్లేషించారు. నివేదిక సమాచారం ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) ఖర్చుల పెరుగుదల 2024లో 2.9 శాతానికి పడిపోయింది. ఇది 2009 తర్వాత కనిష్టం కావటం గమనార్హం. ప్రపంచం ఇప్పుడు ఆర్ అండ్ డీపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నదనీ, భారత్ ఈ విషయంలో త్వరగా స్పందించాలని నిటి ఆయోగ్ సభ్యులు, డీఆర్‌డీఓ మాజీ చీఫ్ వి.కె. సారస్వత్ అన్నారు.
చైనా చారిత్రాత్మక ముందడుగు
చైనా పదో స్థానంలోకి రావడం ప్రపంచ ఇన్నోవేషన్ శక్తి సమతుల్యంలో కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం పేటెంట్ ఫైలింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్నది. మొత్తం ఆర్ అండ్ డీ ఖర్చులో రెండో స్థానంలో నిలిచింది. షెన్జెన్-హాంకాంగ్-గ్వాంగ్‌జౌ ప్రాంతం ప్రపంచంలో నంబర్ 1 ఇన్నోవేషన్ క్లస్టర్‌గా ఉన్నది. ఇక జర్మనీ మాత్రం పరిశ్రమల డిజిటల్ మార్పు ఆలస్యం కావడం, ఆర్థిక మందగమనంతో 11వ స్థానానికి దిగజారింది.
ముందుకు కదలని భారత్
గత మూడేండ్లుగా భారత్ 38వ ర్యాంకులో స్థిరంగా కొనసాగుతోంది. ఆర్ అండ్ డీ ఫండింగ్ తక్కువగా ఉండటంతో మొత్తం ఇన్నోవేషన్ వేగం ఆగిపోయింది. భారత ఆర్ అండ్ డీ ఖర్చు దేశ జీడీపీలో 0.7 శాతమే. ఇది చైనా(2.4 శాతం), దక్షిణ కొరియా(4.9 శాతం)లతో పోలిస్తే చాలా తక్కువ కావటం గమనార్హం. భారత్‌లో పరిశోధనను ఉత్పత్తులుగా మార్చే వ్యవస్థ బలహీనంగా ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఇక టాప్ 100 ఇన్నోవేషన్ క్లస్టర్లలో భారత్ నుంచి బెంగళూరు (21), ఢిల్లీ (26), ముంబయి (46), చెన్నై వంటి నాలుగు నగరాలు స్థానం సంపాదించాయి. భారత్ వచ్చే ఐదేండ్లలో ఆర్ అండ్ డీ ఖర్చును దేశ జీడీపీలో 1.5 శాతం వరకు పెంచాలని వి.కె సారస్వత్ సూచించారు. టర్కీ, వియత్నాం, ఫిలిప్పిన్స్, మొరాకో, ఇరాన్ వంటి మధ్య ఆదాయ దేశాలు ఇన్నోవేషన్‌లో మంచి పురోగతిని సాధిస్తున్నాయి. ఆఫ్రికాలో కూడా రువాండ, ట్యునీషియా లాంటి దేశాలూ ఎదుగుతున్నాయి. అంటే ఇన్నోవేషన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.



