Saturday, January 31, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపెట్టుబడిదారి ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొడుతున్న చైనా!

పెట్టుబడిదారి ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొడుతున్న చైనా!

- Advertisement -

చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) దృఢమైన దీక్షతో, చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ”మేడ్‌ ఇన్‌ చైనా-2025”తో వందశాతం ఆటోమేషన్‌ (స్వయంచాలితం) దిశగా హై-ఎండ్‌ సాంకేతికతల్లో పాగా వేస్తోంది. ”కృత్రిమ సూర్యుడి”ని సృష్టించి, పదికోట్ల డిగ్రీల వేడిని, 17.76 నిమిషాల పాటు చైనా నిర్వహించింది. చైనా ”కృత్రిమ సూర్యున్ని”, అడ్వాన్స్డ్‌ న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ లేదా ”ఎక్స్పెరి మెంటల్‌ అడ్వాన్స్‌ సూపర్‌ కండక్టింగ్‌ టోకామాక్‌ (ఇ.ఏ.ఎస్‌.టి), హెచ్‌.ఎల్‌-2.ఎం. టోకామాక్‌ అంటారు. అత్యంత సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక ప్రక్రియ ద్వారా కృత్రిమ సూర్యుడిని భూమిపై సృష్టించింది. స్వచ్ఛమైన అనంతమైన విద్యుత్తు తయారీ ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టును హెఫీ ప్రావిన్స్‌లో నెలకొల్పారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నిర్వహించింది. 2021లో 120 మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో 101 సెకండ్ల పాటు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ప్రక్రియలు నిర్వహించారు. అలాగే 160 మిలియన్‌ డిగ్రీ సెల్సియస్‌, 20 సెకండ్ల పాటు చైనా నిర్వహించింది. ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్పెరిమెంటల్‌ రియాక్టర్‌ (ఐ.టి.ఇ.ఆర్‌) సహాయంతో ప్లాస్మా ప్రవర్తనను నిశితంగా పరిశీలించడమే దీని లక్ష్యం. హైడ్రోజన్‌, డుటీరియం ఐసో టోపులను దీనిలో ఇందనంగా వాడుతారు.

1) సుస్థిరమైన ప్లాస్మా, నెట్‌ ఎనర్జీ, అవసరమైన దానికంటే శక్తి అత్యధికంగా ఉత్పత్తి జరుగుతుంది. 2)అత్యధిక ఉష్ణోగ్రత, రేడియేషన్‌లను నిర్వహిస్తుంది. ఐటిఇఆర్‌ సహకారంతో అంతర్జాతీయ ఫ్యూజన్‌ ప్రాజెక్టు ఫ్రాన్స్‌లో కొనసాగుతోంది. దీనికి 30 దేశాలతో పాటు చైనా కీలకమైన భాగస్వామిగా ఉంది. ఈ ప్రక్రియ ద్వారా అనంతమైన స్వచ్ఛమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడం. భూమండలాన్ని డీకార్బనైజ్‌ చేయడం లక్ష్యం. ఫ్యూజన్‌ విద్యుత్తు ఏ రకమైన గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌ను, రేడియో యాక్టివ్‌ వేస్ట్‌ను ఉత్పత్తి చేయవు. ప్రపంచ మానవాళికి అవసరమైనంత స్వచ్ఛమైన విద్యుత్తు అందిస్తుంది. సంపూర్ణ స్వచ్ఛ మైన ఇంధన భద్రతను ఇస్తుంది.శిలాజ ఇంధనానికి బదులు అనంతమైన శక్తి ఈ కృత్రిమ సూర్యుడిలో లభిస్తుంది. ప్లాస్మా స్థిరత్వం, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద సాంకేతిక పరికరాల మన్నిక, అత్యధిక ఖర్చు, అంతర్జాతీయ భాగస్వామ్యమనేవి అతిపెద్ద సవాళ్లు.

హైడ్రోజన్‌ ఐసోటోప్‌లు అయిన డ్యూటీరియం(డి)- ట్రీటియం(టి)లను సంలీనం చేయడం ద్వారా కృత్రిమ సూర్యుడిని భూమిపై సృష్టించారు. అనంతమైన, స్వచ్ఛమైన శక్తి వెలువడుతుంది. సూర్యుడు, నక్షత్రాలలో నిరంతరం జరిగే ప్రక్రియ ఇదే. ఇక్కడ హైడ్రోజన్‌ అణువులు కలిసి హీలియంగా మారుతాయి. రెండు అణువుల సంలీన క్రమంలో అనంతమైన శక్తి విడుదల అవుతుంది. ఈ కృత్రిమ సూర్యుడి ప్రయోగం అణు సంలీనాన్ని మానవాళి ఆచరణీయ శక్తి వనరుగా మార్చే దిశలో ఒక ముందడుగు. సుస్థిరమైన ప్లాస్మాను సాధించడం చాలా కీలకమని ఈఎఎస్‌టి డైరెక్టర్‌ సాంగ్‌ ఉంటావో పేర్కొన్నారు. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఫ్యూజన్‌ పరికరాలు వేల సెకండ్ల పాటు పదికోట్ల డిగ్రీల వేడిలో స్థిరంగా పనిచేయాలి. అయితే అటువంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకోగల రియాక్టర్‌ను సృష్టించడం అనే పెద్ద సవాళ్లను చైనా శాస్త్రవేత్తలు చేదించారు. అనంతమైన ప్రకృతికి హానిలేని విద్యుత్తును అందించే విధంగా, ”కృత్రిమ సూర్యుడు ప్రక్రియను ఒక భారీ ఫ్యాక్టరీగా”చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేపట్టింది. ఇది మానవాళి శాస్త్ర, సాంకేతిక చరిత్రలో అత్యంత అద్వితీయ ఘట్టం. శీతోష్ణస్థితి విధ్వంసం సాగుతుంటే, దీనికి పూర్తి భిన్నంగా భారత్‌లో మోడీ బొగ్గుబ్లాకులు ఆదానీ, బడా పెట్టుబడిదారులకు అప్పగిస్తోంది.

అమెరికా ఏఐని వణికించిన చైనా డీప్‌ సీక్‌
చైనా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధస్సు (ఎఐ) ఉత్పత్తి అయిన డీప్‌ సీక్‌ యాప్‌, అమెరికాలోని ఆపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఉచిత డౌన్లోడ్‌లలో, అమెరికన్‌ కంపెనీ ఓపెన్‌ ఎఐ యొక్క చాట్‌ జిపిటిని అధిగమించింది. ఫలితంగా అనేక అమెరికా ఎఐ టెక్నాలజీ స్టాక్‌ లు కుప్పకూలిపోయాయి. ప్రపంచ ఎఐ రేసులో డీప్‌సీక్‌ను, అమెరికా పరిశ్రమలకు ”ఒక మేలుకొలుపు(హెచ్చరిక)గా”అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించారు. డీప్‌సీక్‌ అమెరికాలో ఎందుకంత ఆందోళనను సృష్టించింది. స్టాక్‌ మార్కెట్‌లో భయాందోళనలను రేకెత్తించింది. డీప్‌సీక్‌ అత్యుత్తమ పనితీరుతో ఎఐ పరిశ్రమ ప్రవేశ అడ్డంకులను తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామర్లు ఆ వ్యవస్థను ఉపయోగించడానికి, మెరుగుపరచడానికి అనుమతించే పూర్తి ఉచిత ఓపెన్‌ సోర్సు. మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జిపిటి, గూగుల్‌ జెమిని లాంటి ఎఐ మోడళ్లతో పోలిస్తే, డీప్‌సీక్‌ ఖర్చు చాలా తక్కువ. మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జిపిటి ఎఐ ఖర్చు 41 మిలియన్‌ డాలర్ల నుండి 78 మిలియన్‌ డాలర్లనీ, గూగుల్‌ జెమిని ఎఐ 191 మిలియన్‌ డాలర్లు. ఓపెన్‌ ఎఐ(సాఫ్ట్‌ బ్యాంక్‌)పెట్టుబడులు 40 బిలియన్‌(బి)డాలర్లు.

ఓపెన్‌ ఎఐ ఆర్‌అండ్‌డి మౌలిక సదుపాయాలకు 115 బి. డాలర్లు (2029 వరకు). గూగుల్‌ జెమిని ఎఐ మౌలిక సదుపాయాలు 75 బిలియన్‌ డాలర్లు. చైనా డీప్‌సీక్‌ ఆర్‌1 ఎఐ శిక్షణ ఖర్చు కేవలం 2,94,000 డాలర్లు మాత్రమే. చాలా తక్కువని ప్రపంచం ఆశ్చర్యపోయింది. కొన్ని అంచనాలు డీప్‌సీక్‌ వి3 ఎఐ శిక్షణ ఖర్చు కేవలం 5.5 మిలియన్‌ డాలర్లనీ నాచురల్‌ జర్నల్‌ ప్రకటించింది. ఎఐ రంగంలో చైనాను తన ప్రాథమిక పోటీదారుగా అమెరికా గుర్తించింది. ఎఐ రంగంలో అమెరికా స్థానాన్ని బలోపేతం చేయడానికి గత జో బైడెన్‌ కానీ నేటి డోనాల్డ్‌ ట్రంప్‌ భారీ ఎత్తున అనేక సహాయాలను ప్రకటించారు. 2025 జనవరి 21న ట్రంప్‌ అమెరికా సాంకేతిక భవిష్యత్తును భద్రతకు 500 బిలియన్‌ డాలర్ల స్టార్‌ గేట్‌ ఎఐ మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతు ప్రకటించాడు. అమెరికా సాంకేతిక స్టాక్‌ కంపెనీలు కుప్పకూలుతుంటే. డీప్‌ సీక్‌ సైబర్‌ దాడులను ఎదుర్కొంది.

ఈ నాల్గవ (స్మార్ట్‌ టెక్నాలజీ) పారిశ్రామిక విప్లవం మానవ సమాజం విభిన్న అవసరాలను లాభాపేక్ష లేకుండా అత్యంత ప్రజా స్వామ్యయుతంగా తీర్చడానికి రూపొందించబడిన సాంకేతిక పురోగతి విప్లవాత్మక రూపమే చైనా డిప్‌సీక్‌. వైవిధ్యంతో కూడిన మిశ్రమ నమూనాలను ఉపయోగించడం డీప్‌ సీక్‌ ప్రత్యేకత. ఇది పని తీరు, సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి బహుళ నిపుణుల, దేశాల నమూనాలు, ఆయా వైవిధ్యాలను కలిగి ఉండాలనె ఆలోచనను ప్రభావితం చేసే అత్యాధునిక యంత్ర అభ్యాస నిర్మాణం. డీప్‌సీక్‌ ప్రధాన ప్రయోజనం, వినియోగదారులకు ఖర్చులను తగ్గించే సామర్థ్యంలో ఉంది. అమెరికా ఎఐ కంపెనీల ఆధిపత్యానికి భిన్నంగా, డీప్‌సీక్‌ ఎఐ సాంకేతికతలో ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తుంది. ఆంగ్లభాష అధిపత్యానికి భిన్నంగా ప్రపంచ ప్రజల అన్ని భాషలలో సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. ఆ దేశ ప్రజల భాష హక్కులను డీప్‌సీక్‌ గౌరవిస్తుంది. భాషాధిపత్యాన్ని బద్దలు కొడుతుంది.

బడా సాంకేతిక కంపెనీల్లో సునామీ
డీప్‌సీక్‌ అమెరికా బడా సాంకేతిక కంపెనీల స్టాక్‌ల్లో సునామీని రేకెత్తించింది. ఎఐ విప్లవంలో నిజమైన ఓపెన్‌ సోర్స్‌ లీడర్‌గా నిలిచింది. తన పోటీదారుల కంటే అత్యంత మెరుగైన ఫలితాలతో వినియోగిస్తున్న ప్రజల ముందు నిలిచింది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన వేగం, సామర్థ్యం, పనితీరును ప్రదర్శించింది. డీప్‌ సీక్‌ అనే కొత్త కంపెనినీ చైనాలో 140 మంది యువ ప్రతిష్టాత్మక అగ్రసేని ప్రతిభావంతులు సృష్టించారు. వీరిలో ప్రధాన సభ్యులు చైనాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులయ్యారు. కృత్రిమ మేధా ఏఐ ప్రపంచ మానవాళికి సేవ చేయడం తప్ప, దోపిడీ చేయడం కాదని చైనా యువకులు బడా కంపెనీలకు భారీ గుణపాఠం చెప్పారు. ఎఐని ఆయుధంగా చేసుకుని ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించడం సరికాదని హెచ్చరించారు. క్లోజ్‌ ఎండ్‌ డెవలప్మెంట్‌ ఎఐ ఇతరులకు నిషేధితం. ఓపెన్‌ సోర్స్‌ డెవలప్మెంట్‌ అందరి ప్రయోజనాల కొరకని నిరూపించారు.

ఓపెన్‌ సోర్స్‌ ఎఐ, వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, దేశాలు, సంస్కృతులు, నాగరికతల మధ్య ఉన్న ”ఎఐ విభజనను”, వివక్షను తగ్గించడానికి, తొలగించడానికి ఉత్తమ మార్గం. ప్రపంచ ప్రజలందరినీ ఐక్యంగా సంధానం చేసే రహదారి. అధిక ఖర్చులతో కాకుండా అతి తక్కువ ఖర్చుతో ఎఐని మరింత సరసమైనదిగా డీప్‌సీక్‌ చేసింది. అత్యాధునిక చిప్‌లపై అమెరికా విధించిన కఠిన ఆంక్షలు, నిషేధాలను (అత్యాధునిక ఎన్వీడియా చిప్‌ లు)ఎదిరించి అనేక సవాళ్ల మధ్య డీప్‌ సీక్‌ ఎఐ అద్భుతాన్ని సృష్టించడం మామూలు విషయం కాదు. లాభమే లక్ష్యం అయిన సమకాలీన ప్రపంచానికి విరుద్ధమైనది. ఎఐని బడా కంపెనీలకు వదిలేస్తే మానవాళి భవిష్యత్తును నాశనం చేస్తాయి. డీప్‌సీక్‌ అమెరికా బడా కంపెనీల ట్రిలియన్‌ డాలర్ల స్టాక్‌లను కుప్పకూల్చింది. ప్రపంచంలోనే అత్యాధునిక అమెరికా సెమీ కండక్టర్ల కంపెనీ ఎన్‌ వీడియా షేర్లు నాడు ఆరువందల బిలియన్‌ డాలర్లు ఆవిరి అయిపోయాయి. అంతిమంగా డీప్‌సీక్‌, ఎఐ ప్రపంచ మానవాళి కల్యాణం కొరకు మాత్రమే ఉపయోగపడాలనే సందేశాన్ని బలంగా చైనా ఎఐ చాటిచెప్పింది.

భారత్‌లో అంధకారం, అజ్ఞానం
కేంద్ర ప్రభుత్వం పాఠ్యప్రణాళికలు మార్చి మన దేశ విద్యార్థుల్లో మూఢత్వాన్ని పెంచుతోంది. నూతన విద్యా విధానం విద్యార్థులను అంధకారం, అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది. ప్రతిభావంతులకు పరిశోధన వసతులు లేక బ్రెయిన్‌డ్రైయిన్‌గా మారి విదేశాలకు వలస వెళుతోంది. ఇండియాకు భిన్నంగా, అమెరికా పశ్చిమ ఐరోపాలో గొప్ప విద్యనభ్యసించిన చైనా ప్రతిభావంతులు అన్ని రంగాలలో అగ్రస్థాయికి చేర్చే అభివృద్ధి లక్ష్యంగా ఆ దేశానికి వస్తున్నారు. చైనా ప్రపంచ ప్రమాణాలతో కూడిన పరిశోధన డెవలప్మెంట్‌ ల్యాబులు పెడుతోంది. భారత విద్యార్థుల్లో ఆరెస్సెస్‌-బీజేపీ చాందస విషబీజాలను నాటుతోంది. అక్రమ వలసదారుల పేరుతో అమెరికా ట్రంప్‌ ప్రభుత్వం వెంబడించి తరుముతోంది.

అక్కడి సైనిక విమానాల్లో కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి దేశంలో బలవంతంగా దించుతోంది. మనవారు భార్యాబిడ్డల పోషణ కోసం విదేశాల్లో అనేక మోసాలకు గురై, ఎలాంటి పత్రాలు లేక చౌకకూలీలుగా నికృష్టంగా జైళ్లలో మగ్గుతున్న పరిస్థితి నెలకొంది. ఏ దిక్కులేక మరణించిన శవాలకై ఆప్తుల వేదనలు పత్రికల్లో కథనాలైనా ఏ పాలకున్ని కదిలించవు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అద్భుతాలను సృష్టిస్తున్న చైనా యువత ఆదేశంవలె, మోడీ భారత్‌ను మార్చగలరా? భారత యువత భవితకు గ్యారెంటీ ఇవ్వగలరా? లేకపోతే 145 కోట్ల భారీ జనాభాకు అవసరమయ్యే సరుకులన్నీ, విదేశాలనుంచి దిగుమతి చేసుకునే వెన్నెముకలేని, పరాన్నదేశంగా మారిపోతాం. దిగుమతులతో పాటు విదేశీ వాణిజ్యలోటు పెరుగుతుంది. తస్మాత్‌ జాగ్రత్త!

నైనాల గోవర్ధన్‌
9701381799

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -