Sunday, September 21, 2025
E-PAPER
Homeజాతీయంభారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా

భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా

- Advertisement -

అమెరికాకు ఎగుమతులు తగ్గడంతో మార్పు

చెన్నై : భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించింది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికాకు ఎగుమతులు, దిగుమతులు పడిపోవడంతో భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. ట్రంప్‌ వేసిన అధిక సుంకాలు, జరిమానాలు అమలులోకి రావడంతో గడిచిన ఆగస్టులో అమెరికాకు భారత ఎగుమతులు 16.3 శాతం తగ్గి 6.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం జులైలో 8 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. యుఎస్‌ సుంకాలు ఏప్రిల్‌లో 10 శాతంగా ఉండగా.. ఆగస్టు 7న 25 శాతానికి, ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి 50 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌, అమెరికా మధ్య వాణిజ్యం తగ్గింది. కాగా.. ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను భారత్‌ వెనక్కి నెట్టి.. చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఈ ఏడాది మే నుంచి క్రమంగా అమెరికాకు ఎగుమతులు పడిపోతున్నాయి. మేలో 8.8 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. జూన్‌లో 8.3 బిలియన్‌ డాలర్లకు, ఆ తర్వాత జూలైలో 8 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయాయి. అధిక సుంకాలు అమలులోకి రాగానే, ఆగస్టులో ఎగుమతులు 16.3 శాతం తగ్గాయి. మరోవైపు అమెరికా నుండి దిగుమతులు మరింత తీవ్రంగా పడిపోయాయి. ఆగస్టులో అమెరికా నుండి దిగుమతులు 20.8 శాతం తగ్గి 3.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. జులైలో 4.5 బిలియన్‌ డాలర్లుగా ఉండగా మరింత తగ్గాయి. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే గడిచిన నెలలో దిగుమతులు 18 శాతం తక్కువగా నమోదయ్యాయి.

గడిచిన ఆగస్టులో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 0.67 శాతం పెరిగి 10.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. భారత ఎగుమతులు 22.38 శాతం పెరిగి 1.21 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం 12.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ పరిణామంతో చైనా ఆగస్టులో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. ట్రంప్‌ అధిక సుంకాలను ఇలాగే కొనసాగిస్తే రాబోయే నెలల్లో అమెరికాతో వాణిజ్యం మరింత క్షీణించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా 2014 నుండి 2018 వరకు, మళ్లీ 2021లో, 2024లో భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022, 2023, 2025 ఆర్థిక సంవత్సరాల్లో అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2014కు ముందు యుఎఇ భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. ఇప్పుడది మూడో స్థానంలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -