Friday, October 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికీలెరిగి వాత పెడుతున్న చైనా!

కీలెరిగి వాత పెడుతున్న చైనా!

- Advertisement -

కీలెరిగి వాత పెట్టాలని పెద్దలు చెప్పారు. దీని వర్తమాన అర్థం శరీరంలోని కీళ్లు కాదు. మనల్ని దెబ్బతీసేందుకు చూసే ఎదుటివారిని ఎక్కడ దెబ్బతీయాలో తెలుసుకుని ఆపని చేయటం. ఇప్పుడు చైనా అదే చేస్తోంది. తమను దెబ్బతీయాలని ప్రపంచంలోని అనేక శక్తులను కూడగట్టేందుకు అమెరికా వేస్తున్న ఎత్తులు, చేస్తున్న జిత్తులను చూసిన తర్వాత దాని కీళ్లెరిగి వాత పెట్టటంతో ట్రంప్‌ అల్లాడిపోతున్నాడు. దిక్కుతోచక ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. నరేంద్రమోడీ తననెంతో ప్రేమిస్తారని అయితే అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయదలుచుకోలేదని తాజాగా ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ తాజాగా చైనాను ఎదుర్కోవాలంటే తమతో భారత్‌, ఐరోపా దేశాలు చేతులు కల పాలని ఒక టీవీలో చెప్పాడు. ఈ పెద్దమనిషి కొద్ది నెలలక్రితం మన దేశంపై ఒత్తిడి పెంచి వాణిజ్య రాయితీలు రాబట్టుకోవటం తమ ఎత్తుగడ అన్నాడు.

మన దేశాన్ని పన్నుల రారాజు అని వర్ణించాడు. మన రూపాయి పతనాన్ని అపహాస్యం చేశాడు. మన ఎగుమతులపై సుంకాలు, రష్యా చమురు కొనుగోలుపై అపరాధ సుంకాలు విధించాలన్న నోటితో మూడు నెలల్లో ఇన్ని పిల్లిమొగ్గలు వేయటం వెనుక అమెరికాకు చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బే కారణంగా చెప్పవచ్చు. బెసెంట్‌ మాట్లాడిన సమయం లోనే ట్రంప్‌ మరోబాంబు పేల్చా డు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తానని మోడీ హామీ ఇచ్చినట్లు బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ఏం చెప్పాలో దిక్కుతోచని కేంద్ర ప్రభుత్వం విదేశాంగశాఖ ప్రతినిధి ద్వారా స్థిరమైన ధరలు, భద్రమైన సరఫరా అనే రెండు లక్ష్యాలతో ఇంథన విధానం ఉంటుందని చెప్పించారు తప్ప అవునని కాదనీ, అసలు మోడీ అలాంటి హామీ ఇచ్చారా లేదా అన్నది చెప్పలేదు.

విలువైన లేదా అపురూప ఖనిజాలు. వాటి ఉత్పత్తులు నేడు ఏంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాటి ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న చైనా ప్రభుత్వ అనుమతించిన మేరకే ఏ దేశానికైనా పంపాలని తన కంపెనీలను ఆదేశించింది. ఇది అన్ని దేశాలకూ వర్తించేదే. చైనా అందరికీ ముప్పు తలపెట్టిందని, అందరం కలసి చైనా మీద కత్తిగట్టాలని భారత్‌ కలసి రావాలని బెసెంట్‌ కుటిల నీతిని ప్రదర్శించాడు. చైనా ఈనెల 9న ఆంక్షలు ఎందుకు విధించింది ? బీజింగ్‌ నిర్ణయం వెనుక అన్నింటికీ సన్నద్దత ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికిప్పుడు అపురూప ఖనిజాల ఉత్పత్తుల విషయంలో మరోదేశం దాన్ని అధిగమించే స్థితిలో లేదు. అదే చైనా బలం. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నే వాడుంటాడు అన్నట్లుగా ఇంతకాలం తిరుగులేని అమెరికా తన షరతులతో ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఇప్పుడు కొన్ని అంశాల్లో నా మాటే శాసనం అన్న శివగామిలా చైనా తయారైంది.

ఈ సమస్యను ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిలో పరిష్కరించుకోవాలి తప్ప బెదిరింపులకు దిగితే చెల్లేరోజులు కావివి, ఇది చైనాతో సహా అన్ని దేశాలకూ వర్తిస్తుంది. చైనా చర్యకు ప్రతిగా దాని వస్తువుల మీద నవంబరు ఒకటి నుంచి వందశాతం పన్ను విధిస్తానని ట్రంప్‌ చెప్పాడు, ఇంత జరిగాక దక్షిణ కొరియాలో జరిగే అపెక్‌ సమావేశాల్లో షీ జిన్‌పింగ్‌ను కలవాల్సిన అవసరం ఏముందన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా జియలాజికల్‌ సర్వే నివేదిక ప్రకారం ఈ అపురూప ఖనిజాలు, వాటి ఉత్పత్తులు లేకపోతే విద్యుత్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌తో పాటు కృత్రిమ మేధ చిప్స్‌, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంథన వ్యవస్థలు పనిచేయవు. అమెరికా అసలు సమస్య ఇదే. ఎఫ్‌-35 ఆధునిక యుద్ధ విమానాలను అది తయారు చేయగలదు గానీ చైనా నుంచి వచ్చే ఈ ఖనిజాల ఉత్పత్తుల్లేకుండా అవి ఎగరవు.

ప్రపంచంలోని ఈ ఖనిజాల నిల్వల్లో చైనా 36, వియత్నాం 22, బ్రెజిల్‌ 18శాతం కలిగిఉండగా అమెరికాలో కేవలం రెండుశాతమే ఉన్నాయి. తరువాతేం జరుగుతుందో తెలియదు గానీ ఈ ఖనిజాలతో తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం 70శాతం చైనాలోనే జరుగుతున్నాయి. ప్రపంచ ఉత్పాదక సామర్ధ్యంలో 90శాతం వాటా కలిగి ఉంది. అమెరికా తన అవసరాల్లో 70శాతం చైనా నుంచి తీర్చుకుంటున్నది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నా ఐదు నుంచి పదేండ్లు పడుతుందని అంచనా. అంతకాలం అమెరికా కార్పొరేట్లు వేచి ఉండే అవకాశం లేదు. అందుకే అవి చైనాతో రాజీకి రావాలని ట్రంప్‌ మీద ఒత్తిడి కూడా తెస్తున్నాయి.వివేచనతో వింటాడా, మొండిగా ముందుకు పోయి ముక్కు పగలగొట్టుకుంటాడా? అన్నది చూడాల్సి ఉంది. ఎవరి ప్రయోజనాలు వారివి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -