Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా భాగస్వామ్యంతోనే చైనా అభివృద్ధి

ప్రజా భాగస్వామ్యంతోనే చైనా అభివృద్ధి

- Advertisement -

అవినీతికి తావులేని సమాజ నిర్మాణం కోసం కృషి
భారత్‌, చైనా బంధం మరింత బలపడాలి
ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజల భాగస్వామ్యం లేకుండా చైనాలో ఏ అభివృద్ధి కార్యక్రమం లేదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయంతో ‘నేటి చైనా సీపీఐ(ఎం) బృందం పర్యటన విశేషాలు’ అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ చైనా అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇందుకోసం చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న ఆచరణాత్మక పని విధానాన్ని తెలిపారు. ఎస్‌సీవో సమావేశాల తర్వాత రెండు దేశాల మధ్య సబంధాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్నదని గుర్తు చేశారు. అయితే ఇరు దేశాల ప్రజల మధ్య సంబధాలు మరింత మెరుగుపడటం అవరసరమని తెలిపారు. ఆయా దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ఇది మంచిదని వివరించారు.

ఇరు దేశాలు పూర్వకాలం వలస దేశాలుగా ఉన్నాయనీ, భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేండ్ల తర్వాత వలస పాలన నుంచి చైనా విముక్తి పొందిందని తెలిపారు. 1978-81 వరకు చైనా భారత్‌కంటే వెనుకంజలో ఉందని తెలిపారు. ఆ తర్వాత ఆ దేశం అనుసరించిన విధానాల వల్ల అమెరికాకు ధీటుగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. జీడీపీ కొలమానంలో అది రెండో దేశంగా ఉందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశం ముందంజలో ఉందన్నారు. ప్రతి విషయంలో అగ్రదేశాల సరసన ఉండటానికి ప్రజల అభివృద్ధి కేంద్రంగా అ దేశం తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని చెప్పారు. అక్కడ పర్యటించి వచ్చిన వారు ఆ దేశం కూడా ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నదనీ, అందుకే ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చంద్రబాబులాంటి వారు ప్రచారం చేశారని గుర్తు చేశారు. తద్వారా ఇక్కడి కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు పలు రకాల ప్రచారాలు చేశారని తెలిపారు.

కానీ..వాస్తవంగా పెట్టుబడిపై ఆ దేశం నియంత్రణ ఉంటుందని తెలిపారు. గుత్త పెట్టుబడిగా మారటాన్ని ఆ ప్రభుత్వం అంగీకరించబోదని చెప్పారు. దీనికి అనుగుణంగా అనేక చట్టాలు చేసినట్టు వివరించారు. ఇక్కడ చట్టాలున్నా..నిర్వీర్యమవుతున్నాయనీ, కానీ..అక్కడ చట్టం చేస్తే అది అమలు కావాల్సిందేనని తెలిపారు. ముఖ్యమైన రంగాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రణాళికాబద్దంగా కృషి జరుగుతున్నదని వివరించారు. అందరికీ ఇండ్లు, విద్యా, వైద్యం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందన్నారు. అక్కడ 8గంటల పనివిధానం అమల్లో ఉందని చెప్పారు. అదనపు పనికి..మూడింతల వేతనం చెల్లించాల్సిందేనని చట్టం చేసినట్టు తెలిపారు. సాంస్కృతిక సంబంధాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టారన్నారు. ఆనకట్టలు, బ్రిడ్జీల నిర్మాణం జరిగినప్పుడు పర్యావరణం దెబ్బతినకుండా చర్యలు చేపట్టారని తెలిపారు.

ముఖ్యంగా అవినీతిని నిర్మూలించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అవినీతి పెచ్చరిల్లితే అభివృద్ధి ఆగిపోతోందని వారు గ్రహించారనీ, అందుకే ప్రారంభంలోనే దాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఇటీవల వివిధ రంగాల్లో ప్రధాన బాధ్యతల్లో ఉన్న వారిపై చర్యలు తీసుకున్న విధానాన్ని వివరించారు. 30 లక్షల మంది పార్టీ కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకంగా క్యాంపెయన్‌ చేస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యన ఉండి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రజలంతా బయట తిరగొద్దని నిబంధన ఉంటే..కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం బాధితులకు సేవా కార్యక్రమాల్లో నిమగమయ్యారని గుర్తు చేశారు. వరదలు, భూకంపాల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారని అరుణ్‌కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ధికి చైనాలో 15వ పంచవర్ష ప్రణాళికను రూపొందిస్తున్నారనీ, అందుకు తగిన విధంగా పనిచేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -