Sunday, December 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం50 వేల కిలోమీటర్లు దాటిన చైనా హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌

50 వేల కిలోమీటర్లు దాటిన చైనా హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌

- Advertisement -

బీజింగ్‌ : హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ విషయంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించి ఉన్న హైస్పీడ్‌ రైలు మొత్తం నెట్‌వర్క్‌ను చైనా అధిగమించింది. తాజాగా షీ ఆన్‌-యాన్‌ఆన్‌ హైస్పీడ్‌ రైల్వే ప్రారంభంతో చైనా హైస్పీడ్‌ రైళ్ల పొడవు 50వేల కిలోమీటర్లను దాటింది. ఇది రైల్వే రవాణా చరిత్రలో ఒక కీలక మైలురాయి అని చైనా రైల్వే సంస్థ వెల్లడించింది. చైనాలో ప్రస్తుతం 5 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో 97 శాతం ప్రాంతాలకు హైస్పీడ్‌ రైలు సేవలు అందుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక హైస్పీడ్‌ రైలు మార్గాలున్న దేశంగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. వాణిజ్యపరంగా అత్యధిక వేగంతో నడిచే రైళ్ల విషయంలోనూ చైనానే ముందంజలో ఉన్నది.

500 కిలోమీటర్ల పరిధిలోని ప్రధాన నగర సమూహాల మధ్య ఒకటి నుంచి రెండు గంటల ట్రావెల్‌ సర్కిల్స్‌ ఉన్నాయి. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లోనే, రెండు వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కూడా ఒకే రోజులో వెళ్లి వచ్చేటువంటి సౌకర్యం హైస్పీడ్‌ రైళ్లు కల్పిస్తున్నాయి. గరిష్టంగా రోజుకు 1.6 కోట్ల మంది ప్రయాణికులను రవాణా చేసే సామర్థ్యం ఈ నెట్‌వర్క్‌కు ఉన్నది. కొత్తగా ప్రారంభమైన షీఆన్‌-యాన్‌ఆన్‌ హైస్పీడ్‌ రైలు మార్గం 299 కిలోమీటర్ల పొడవు కలిగి.. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుంది. ఈ మార్గంలో పది స్టేషన్లు ఉండగా.. షీఆన్‌ నుంచి యాన్‌ఆన్‌ వరకు ప్రయాణ సమయం కేవలం 68 నిమిషాలకు తగ్గింది. 14వ ఐదేండ్ల ప్రణాళిక (2021-25) కాలంలో మాత్రమే చైనా సుమారు 12వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గాలను ప్రారంభించింది. దీనితో 128 కౌంటీలకు తొలిసారిగా హైస్పీడ్‌ రైలు సౌకర్యం అందింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -