ఐఎంఓ చీఫ్ వ్యాఖ్యలు
లండన్ : అంతర్జాతీయ సముద్ర జలాల సంస్థ (ఐఎంఓ)లో చైనా క్రియాశీల సభ్యురాలిగా వుందని, రాబోయే కాలంలో సంస్థ ముందు భారీ ఎజెండా వున్నందున, చైనా కీలక పాత్ర కొనసాగిస్తుందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆర్సెనియో డొమింగజ్ తెలిపారు. లండన్‌లో ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో సంస్థ ప్రాధాన్యతలను ఆయన వివరించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ రేవులను చైనా నిర్వహిస్తోందని, ప్రస్తుతం అతిపెద్ద నౌకా నిర్మాణ దేశంగా వుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాంకేతికతలో చైనా అభివృద్ధి, హరింత కార్యకలాపాల దిశగా పరివర్తన, భద్రత, రక్షణ, నౌక నుంచి ఓడరేవుకు జరిగే కార్యకలాపాలు వంటి అంశాల్లో సామర్ధ్యం పెంపు కోసం కృషి చేస్తోందని చెప్పారు. సముద్ర జలాల భద్రత, అంతర్జాతీయ షిప్పింగ్‌లో డీ కార్బనైజేషన్‌ను వేగవంతం చేయడం, డిజిటలైజేషన్‌ను మెరుగుపరచడం, స్మార్ట్ షిప్పింగ్‌ను అభివృద్ధి పరచడం, సముద్ర నావికుల సంక్షేమం, వారి హక్కులను కాపాడడం వంటి అంశాల్లో ఐఎంఓ కీలక ప్రాధాన్యతలను ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ సంస్థలో 176మంది సభ్యులున్నారు.



