ప్రపంచ అభివృద్ధికి ఇంధనం
పాశ్చాత్య దేశాల భయం అర్థరహితం
కలిసి నడిస్తే ఎంతో ఉపయోగం
‘గ్లోబల్ టైమ్స్’ కథనం
బీజింగ్ : ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చుకుంటే చైనా అనేక రంగాల్లో వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో సాంకేతిక రంగమూ ఒకటి. రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలతో ప్రపంచ మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నది. ఇలాంటి తరుణంలో అగ్రరాజ్యంగా భావించే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చైనా ఎదుగుదలను చూసి తట్టుకోవడం లేవు. దీంతో చైనా టెక్ ఆవిష్కరణలపై ప్రపంచంలో లేనిపోని ఆందోళనలను సృష్టిస్తున్నాయి. అన్నింటిలోనూ తామే ముందు ఉండాలన్న దురుద్దేశంతో చైనాపై అవాస్తవాలు, కల్పిత వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నాయి. అయితే చైనా సాంకేతిక ఆవిష్కరణలు యావత్ ప్రపంచానికి ఉపయోగపడేవే కానీ ఏ మాత్రమూ ముప్పును కలిగించేవి కావని, అవి సమగ్ర సమృద్ధికి కొత్త శక్తిగా మారనున్నాయని ‘గ్లోబల్ టైమ్స్’లో ప్రచురితమైన ఒక కథనం పేర్కొన్నది.
చైనా తన కొత్త ఐదేండ్ల ప్రణాళికలో సాంకేతిక ఆవిష్కరణలను ప్రాధాన్యంగా తీసుకుంటూ.. అధిక నాణ్యతతో కూడిన అభివృద్ధి దిశగా ముందకెళ్తోంది. ఇందులో భాగంగా చైనా కమ్యూనిస్టు పార్టీ.. 2030 వరకు దేశ అభివృద్ధికి దారి చూపే 15వ ఐదేండ్ల ప్రణాళికకు సిఫారసులను ఆమోదించింది. ఇది అధిక ప్రమాణాల విధానాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని, పరస్పర లాభదాయకమైన సహకారానికి కొత్త మార్గాలను సృష్టించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నది. ఇప్పటి వరకు చైనాపై స్థిరమైన అభివృద్ధి విషయంలో సందేహాలు వ్యక్తం చేసిన కొన్ని పాశ్చాత్య దేశాలు.. ఇప్పుడు దాని వేగాన్ని అంగీకరిస్తున్నాయి. అయితే చైనాలోని టెక్నాలజీ పురోగతి తమ దేశాల ఆధిపత్యానికి అడ్డంకి అవుతుందనే ఆందోళనలో ఉన్నాయి. చైనాకు ఉన్న సామర్థ్యాన్ని ఆ దేశాలు గుర్తించినప్పటికీ.. తమ ఉనికికి ఎక్కడ ప్రమాదం ఏర్పడుతుందోనని అక్కసును వెళ్లగక్కుతున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంపై చైనా టెక్ ప్రభావం విషయంలో తప్పుడు వాదనలు చేస్తున్నాయి.
చైనా ‘టెక్’ సహకారానికి కొన్ని ఉదాహరణలు
జూన్‌లో థారులాండ్‌లోని ఒక మారుమూల ప్రాంత నర్సింగ్ హౌమ్‌లో జరిగిన ఒక ఘటన మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ఒక మహిళ 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిపుణులతో ఎలాంటి అంతరాయం లేకుండా వీడియో సంప్రదింపులు జరిపింది. ఒక చైనీస్ అంతరిక్ష సంస్థ, థారు విశ్వవిద్యాలయం మధ్య భాగస్వామ్యంతో ఏర్పడిన ఉపగ్రహ నెట్‌వర్క్ ద్వారా ఈ ఎలాంటి అంతరాయాలు లేని వీడియో కనెక్షన్ సాధ్యమైంది. చైనాలోని టెక్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఒక ఫలవంతమైన, సానుకూల మార్పులను తెచ్చే పరిష్కారాలను అందిస్తోందనటానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సెప్టెంబర్‌లో చైనా-ఏసియాన్ ఏఐ కన్సల్టేషన్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇది చైనాలో నిర్మాణంలో ఉన్న ఏఐ ఆధారిత ఉపగ్రహ నెట్‌వర్క్ ద్వారా దక్షిణ- తూర్పు ఆసియాలో వ్యవసాయం, లాజిస్టిక్స్, విపత్తు నివారణ రంగాల్లో సేవలు అందిస్తుంది. ఈ ఉదాహరణలు చైనీస్ టెక్ సంస్థలు చాలా కాలం క్రితమే గ్రహించిన విషయాన్ని చూపుతున్నాయి.
కొత్త ఉద్యోగాల కల్పన
చైనా టెక్నాలజీ కేవలం ఉత్పత్తుల విక్రయమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సమానమైన డిజిటల్ వృద్ధికి మౌలిక వసతులను ఏర్పరుస్తోంది. చైనా టెక్ పెట్టుబడులు పేద ప్రాంతాల్లో పరిశ్రమలను విస్తరించి, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి. యూరప్‌లో పునరుత్పాదక శక్తి రంగంలో చైనా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి, స్థానిక టెక్నాలజీని వేగవంతం చేస్తున్నాయి. స్విస్ కంపెనీ ఏబీబీ, చైనా భాగస్వామ్యం ద్వారా రూపొందించిన గ్రీన్ మైక్రోగ్రిడ్ యూరప్‌లో స్మార్ట్ ఎనర్జీ అభివృద్ధికి తోడ్పడుతోంది. ఇది చైనా సహకార ప్రాజెక్టులకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
కలిసి నడిస్తే అంతులేని అవకాశాలు
ఈ విధంగా చైనా సాంకేతిక ఆవిష్కరణలు, సహకారం ప్రపంచ దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంటే.. చైనా టెక్ ఎదుగుదల పాశ్చాత్య దేశాలు చెప్తున్నట్టుగా ప్రపంచానికి ముప్పు కానే కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ జోక్యాలు పరిశ్రమలు, సాంకేతిక రంగాన్ని దెబ్బ తీస్తాయి. అది మార్కెట్‌లో గందరగోళాన్ని సృష్టిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పాశ్చాత్య దేశాలు చైనా గురించి అపోహలు సృష్టించకుండా ముందుకెళ్తే.. యావత్ ప్రపంచానికి అంతులేని అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.



