రెండు శతాబ్దాల రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో భారీఓడల నిర్మాణం, సముద్ర సరుకు రవాణా అత్యంత కీలకమైనది. ఈ శతాబ్దాల ఆధిపత్య సామ్రాజ్యవాదులకు భిన్నంగా, వారిని కూల్చడమే లక్ష్యంగా చైనా భారీ ఓడలు, ఓడరేవులను నిర్మించింది. సముద్ర సరుకు రవాణాను చరిత్రలో ఎన్నడూ లేనంత చౌకగా ప్రపంచ మానవాళి కేంద్రంగా మార్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎనిమిది దశాబ్దాలు అమెరికా, ప్రపంచంపై బలమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఆ..ఏకధ్రువ ప్రపంచం శరవేగంగా బీటలు బారుతూ, బహుళ ధ్రువ ప్రపంచం ఉద్భవిస్తోంది. 15నుంచి 20వ శతాబ్దాల వరకు కొనసాగిన పోర్చుగిస్, స్పానిష్, డచ్, బ్రిటిష్ సామ్రాజ్యాలు ఆధిపత్యం చెలాయించాయి.ఈ సామ్రాజ్యం విస్తరణలో పారిశ్రామిక బలంతో పాటు, ఆయా కాలాలలో భారీ ఓడల నిర్మాణం ఒక చోదకశక్తిగా పనిచేసింది.
గత నలభైఏళ్లలో భారీ ఓడల నిర్మాణం, సముద్ర సరుకు రవాణాలో, పతన సామ్రాజ్యాల దోపిడీకి పూర్తి భిన్నంగా చైనా ఎదుగుదల ఉంది. ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నేడు ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచింది. సరుకు ఉత్పత్తి పంపిణీ విధానాన్ని, చాలాచౌకగా, నాణ్యంగా, విప్లవాత్మకంగా మార్చింది. సామాన్యుడి నుండి ఏ స్థాయి వారికైనా, ఆయా స్థాయిల్లో సరసమైన ధరలు గల సరుకుల ఉత్పత్తి విధా నాన్ని అమలు చేస్తుంది. ఏ దేశమూ పోటీపడడమే అసాధ్యంగా పారిశ్రామిక ఉత్పత్తి విధానాన్ని ప్రగతి శీలంగా, వందశాతం స్వయం చాలకంగా (ఆటోమేషన్) మార్చింది. దేశాల మధ్య వాణిజ్యంలో పరస్పర దోపిడీ స్థానంలో, పరస్పర వాణిజ్య విజయం అనే సూత్రాన్ని పాటిస్తుంది. నాటి పతన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పంచుకొని దోచుకున్నాయి. గత పాతికేళ్లుగా చైనా ఆఫ్రికా ఖండంలో ఆ దేశాల ప్రజలను అన్ని విధాల నిలబెట్టే, అప్పుల నుంచి విముక్తి చేసే, అనేక రకాల ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. బుర్కినో పాసో, మాలి, నైజర్ దేశాలలో ఫ్రెంచ్ అమెరికా సైన్యాలను, వారి తొత్తులను ఆ దేశ ప్రజలు తరిమేశారు. సరికొత్త మిలటరీ పాలకులు ఆదేశ ఖనిజ సంపదను జాతీయం చేశారు. ఆ సంపదను ప్రజా సంక్షమానికి వినియోగిస్తున్నారు. చైనా 21వ శతాబ్దపు నియమాలను తిరగరాస్తూ ప్రపంచ షిప్ బిల్డింగ్ పరిశ్రమలో, ఓడరేవుల నిర్మాణంలో అగ్రస్థానానికి చేరింది. సముద్ర సరుకు రవాణా రంగపు నియమాలను చైనా తిరగరాస్తుంది.
ప్రపంచ మానవాళికి ఉపయోగపడే అనేక రకాల సరుకులు, గృహ వినియోగ వస్తువులను చైనా ఏ దేశం కంటే నాణ్యంగా చౌకగా ఉత్పత్తి పంపిణీ చేస్తుందని ప్రతీతి. ప్రపంచ మార్కెట్లో చైనా భారీ వాటాని కలిగి ఉంది. ప్రపంచ షిప్ బిల్డింగ్ నిర్మాణంలో 21వ శతాబ్దం నిమేడ్ ఇన్ చైనా శతాబ్దంగా మారింది ప్రతిసారి అమెరికా ఒక్క షిప్పును నిర్మిస్తే చైనా 333 షిప్పులను నిర్మాణం చేస్తోంది. అమెరికా కంటే మూడువందల రెట్లు అధికంగా చైనా భారీ ఓడల నిర్మాణం చేస్తుంది.సరుకు రవాణాలో ఉపయోగించే, అంటే భారీ కంటైనర్స్ లేదా ఆయిల్ ట్యాంకర్స్ లాంటివి ప్రపంచంలోని ఎక్కువ భాగం కార్గో షిప్స్‌ను చైనా ఒక్క దేశమే నియంత్రిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు కఠిన వాస్తవం.
కేవలం రెండు దశాబ్దాల కాలంలో, షిప్ బిల్డింగ్ నిర్మాణంలో ప్రాథమిక దశలో ఉన్న దాని పరిశ్రమ, ప్రపంచంలోనే అగ్రస్థాయికి ఎదిగింది. ప్రపంచ పరిశ్రమలన్నింటిలో అగ్రస్థానానికి చేరాలనే దృఢమైన దీక్ష గల, ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) అగ్రనాయకత్వానికే ఆ కీర్తి దక్కుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా చైనా 57శాతం భారీ ఓడలను నిర్మిస్తోంది. సముద్రంలోకి వెళ్లే ప్రతి భారీ రెండవ షిప్ చైనా నిర్మించిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అతి భారీ ఓడల నిర్మాణ కేంద్రాలను షాంగై, డాలియన్, గాంగ్జులలో చైనా స్థాపించింది. ప్రపంచ వ్యాపార ఓడల నిర్మాణ రంగంలో అమెరికా వాటా 0.01శాతానికి పడిపోయింది. అమెరికాలో ఉన్న మొత్తం షిప్‌యార్డులలో నిర్మాణమయ్యే మొత్తం ఉత్పత్తికి, చైనాలోని ఒక్క షిప్‌యార్డు సమానంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ ఓడల నిర్మాణం మొత్తంలో అమెరికా వాటా ఒక్క శాతానికి పడి పోయింది. చైనా ఇటీవలే కార్లను రవాణా చేసే నిఅంజి అన్షెంగ్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద ఓడను నిర్మించింది. ఏడు వేల కార్లతో ఇటీవలే షాంగై ఓడరేవు నుంచి బయలుదేరింది. 228 మీటర్ల పొడవు, 37.8 మీ. వెడల్పు ఉంది. ఈ ఓడ అత్యధిక సామర్థ్యంతో 9,500 కార్లను రవాణా చేయగలదు. ఇది ఇంధన పొదుపును, ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 5.5 మిలియన్ వాహనాలు 2024లో అంతర్జాతీయ మార్కెట్‌కు రవాణా అయ్యాయి. 2026కల్లా ఇలాంటి భారీ ఓడల నిర్మాణం 22 నిర్మించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా ఎదగడం వెనుక, సిపిసి అగ్రనాయకత్వం కఠోరమైన శ్రమ ఉంది. ఒక స్పష్టమైన ప్రపంచ స్థాయి ప్రణాళిక ఉంది. దానికి అనుగుణమైన ఆచరణ వల్లనే ఈ స్థాయికి చేరింది. ఇది ఆషామాషి విషయం కాదు. అమెరికా ఓడల నిర్మాణంలో ప్రపంచ మార్కెట్‌లో వాటానూ, ఆధిపత్యాన్ని కోల్పోవడమే కాదు. ప్రపంచ సముద్ర జలాలలో, భారీ ఓడరేవులపై దాని ఆధిపత్యాన్ని నియంత్రణను కోల్పోతుందని, ఈ గుణాత్మక పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.1999లో చైనా వాటా ఐదు శాతం, కాగా 2023 నాటికి అది 50శాతానికి చేరింది. 2024 నాటికి ప్రపంచ షిప్ బిల్డింగ్‌లో 57.1శాతానికి చేరింది. 2020-22 మధ్య చైనా నాలుగు వేల భారీ ఓడలను నిర్మాణం చేసింది. అమెరికా కేవలం పన్నెండు ఓడలను నిర్మించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఓడల నిర్మాణంలో ప్రపంచ నాయకుడిగా ఉండేది. ఆ స్థానాన్ని అమెరికా నేడు కోల్పోయి, అట్టడుగుకు చేరింది. చైనా తొమ్మిదివేల కంటే ఎక్కువ నౌకలను కలిగి ఉంది, ఇది ప్రపంచం మొత్తం నౌకలలో 34శాతం వాటా. అమెరికా 200 షిప్పులు కలిగి ఉంది. ఇవన్నీ కేవలం అమెరికా దేశ జలాల్లో తిరిగేవి. ప్రపంచ సముద్ర పటంలో, జలాల్లో అమెరికా ఓడలు మాయమైపోయాయి.నిర్దిష్ట ప్రమాణంతో కూడిన కంటైనర్ షిప్ 1200 అడుగుల పొడవు ఉంటుంది. పదివేల (20 అడుగులకు సమానమైన సామర్థ్యం గల కార్గో బాక్స్) టిఈయు సామర్థ్యం షిప్పును చైనా 55 మిలియన్ డాలర్లకు నిర్మిస్తుంది. దాన్ని అమెరికా 330 మిలియన్ డాలర్లకు నిర్మిస్తుంది. అమెరికా నిర్మించే ప్రతి భారీ ఓడకు ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది.
చైనా షిప్ యార్డులు నిరంతరం పనిచేస్తాయి. 1.5 మైళ్ల పొడవు, 26 ఫుట్‌బాల్ మైదానాలతో సమానమైన స్థలాన్ని కలిగి ఉన్నాయి. చైనా ఓడల నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ను ఉపయోగి స్తుంది. 95శాతం షిప్పింగ్ కంటైనర్లను ఒక్కచైనానే నిర్మిస్తుంది. ఇవి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత ప్రాణప్రదమైనవి. 2010 నుండి 2018 మధ్య చైనా 132 బిలియన్ డాలర్ల విలువచేసే షిప్పులను నిర్మాణం చేసింది. చైనా ప్రభుత్వ రంగంలో నడిచే ఓడల నిర్మాణం, ప్రభుత్వం నుండి సబ్సిడీలని ఆర్థిక ప్యాకేజీలని అందుకుంటుంది. డాలియన్ షిప్ యార్డ్ నిర్మాణంలో 30 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులు ప్రపంచంలోనే గొప్ప పారిశ్రామిక నిపుణులు. వీరు చాలా వేగంగా ఓడల నిర్మాణం చేయగలరు. అమెరికాతో పోలిస్తే, పదింట్లో ఒకటో వంతు ధరలోనే ఓడల నిర్మాణం చేయగలవారు. గత రెండు దశాబ్దాలలో చైనా ప్రపంచ సముద్ర రవాణా రంగంలో గణనీయమైన వాటాను, స్థానాన్ని సంపాదించింది. భవిష్యత్తులో నిర్మించే ప్రపంచ షిప్పింగ్ నిర్మాణంలో భారీ వాటాను కలిగి ఉంటుంది. మార్కెట్లో తన వాటా కొరకు చైనా పోటీ పడే అవసరం లేకుండానే, అతి చౌకగా ఓడల నిర్మాణక్రమాన్ని మార్చడం వల్ల ప్రపంచ మార్కెటే చైనా వద్దకు తరలివస్తుంది. చైనా ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ‘ఆధునిక సిల్క్ రోడ్డు, బెల్ట్ అండ్ రోడ్డు ఇన్సియేటివ్ (బిఆర్‌ఐ)’ ఇప్పటికే 90-96 వరకు ఓడరేవులను కలిగి ఉంది. ఇవన్నీ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి.
ఈ క్రమంలో అమెరికా ఎక్కడ ఉంది? రెండో ప్రపంచ యుద్ధంలో నాలుగేళ్లలో 2,700 షిప్స్ నిర్మించిన అమెరికా, ఈరోజు పతనపు టంచలకు చేరింది. అమెరికా వాటా ప్రపంచ వ్యాపార షిప్పుల నిర్మాణంలో 0.01శాతానికి పడిపోయింది. అమెరికా, పశ్చిమ ఐరోపా బడా పెట్టుబడిదారి షిప్ నిర్మాణ కంపెనీలు చైనా ప్రభుత్వ రంగ కంపెనీల పోటీలో కుప్పకూలిపోయాయి. ప్రపంచంలోనే ఎదురులేని మహాశక్తిగా అమెరికా ఒకనాడు ప్రపంచ సముద్రాలను ఏలింది. నేడు ఆ స్థానం నుండి అమెరికా వైదొలిగింది! సరుకు ఉత్పత్తి పంపిణీ ధరలను, ప్రపంచ మానవాళికి సరసమైన ధరలో, భూ మార్గం పట్టించి, వినియోగదారులను గెలుచుకున్న చైనా, ప్రపంచ పారిశ్రామిక రంగంలో అద్భుతాలను సృష్టిస్తోంది. దీనినే ”సోషలిస్టు మార్కెట్ ఎకానమీ” అంటుంది చైనా సిపిసి. చౌకైన, నాణ్యమైన పారిశ్రామిక సరుకుల తయారీలో, చైనాను అధిగమించడం ఏ దేశానికి సాధ్యం కాలేదు.
డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న సరుకుల పైన భారీఎత్తున సుంకాలు వేస్తుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రపంచంలో ప్రతి దేశం అమెరికాతో వాణిజ్య ప్రయోజనాల కోసం రాజీపడుతూ, రహస్య చర్చలు జరుపుతున్నాయి. సోవియట్ రష్యా పతనం తర్వాత చైనా ఒక్కటే అమెరికాతో దీటుగా తలపడుతోంది. ట్రంప్ దిగిరాగా, ఇరుదేశాలు చర్చలతో సుంకాలు పరస్పరం తగ్గించుకున్నాయి.తొంభై రోజుల పరస్పర సరుకుల ఎగుమతికి మార్గం సుగుమమైంది.ట్రంప్ వాణిజ్య యుద్ధం మిగిలి ఉన్న అమెరికా షిప్ బిల్డింగ్ రంగాన్ని మరింత నాశనం చేస్తుంది. ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, చైనా తన వాణిజ్యాన్ని దక్షిణాఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా, దక్షణ అమెరికా ఖండాలకు మళ్లిస్తుంది.ఈ దేశాలకు చైనా చాలాచౌకగా తన షిప్పులను, సౌకర్యాలను, సేవలందిస్తుంది. చైనా గ్రీన్ ఎనర్జీ (ఎల్‌ఎన్‌జి, హైడ్రోజన్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షిప్పులను నిర్మిస్తూ, నడుపుతోంది. మితనోల్ రీఫియలింగ్ డిజైన్ అనే ఇంధన సమర్ధత కలిగిన భారీ ఓడలను నిర్మిస్తుంది. ఆ ప్రయోజనాలను ప్రపంచ దేశాలకు పంచుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 96 నుండి 100 ఓడరేవులలో చైనా కీలక భాగస్వామ్యం ఉంది. సిఎస్‌ఐఎస్ అధ్యయనం ప్రకారం 2023 వరకు 53 దేశాలలో 95 పోర్టులను చైనా కలిగి ఉంది.గ్రీస్‌లో పిరాయస్, శ్రీలంకలో హంభన్ టోట, యుఎఈలో ఖలీఫా, పాకిస్తాన్‌లో గ్వాడార్, రిపబ్లిక్ ఆఫ్ డ్జిబౌటిలో డ్జిబౌటి అనే ఓడరేవును చైనా నిర్మించింది. ఇవి ప్రముఖ ఓడరేవులు. చైనా బెల్ట్ అండ్(సిల్క్) రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌ఐ)లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పోర్టుల నిర్మాణం చేపట్టింది. వాణి జ్యాన్ని పెంచడంతోపాటు, భూ భౌగోళిక రాజకీయ పరిస్థి తుల్ని సమూలంగా మార్చడం దీని ఉద్దేశం.అమెరికా, పశ్చిమ ఐరోపాల అనేక దశాబ్దాల ఆధిపత్యాన్ని కూలదోసి, అన్ని దేశాలు సమానంగా వ్యవహరించే, బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించడమే చైనా, రష్యాల లక్ష్యం.
నైనాల గోవర్ధన్
9701381799



