Wednesday, February 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమరోసారి కక్ష్యలోకి చైనా అంతరిక్ష విమానం

మరోసారి కక్ష్యలోకి చైనా అంతరిక్ష విమానం

- Advertisement -

బీజింగ్‌ : తిరిగి వినియోగించడానికి వీలున్న అంతరిక్ష విమానాన్ని చైనా నాలుగోసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తద్వారా అంతరిక్ష సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో మరో అడుగు ముందుకు వేసింది. అయితే ఈ అంతరిక్ష విమానం చేసే పనేమిటో పరిశీలకులకు అంతపట్టడం లేదు. షెన్‌లాంగ్‌ (డివైన్‌ డ్రాగాన్‌) అని పిలిచే ఈ అంతరిక్ష విమానం ఈ నెల 7వ తేదీన వాయవ్య చైనాలోని జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరింది. దీనిలో లాంగ్‌మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ కూడా ఉంది. చైనా 2020లో అంతరిక్షంలోకి విమానాలను పంపడం మొదలు పెట్టింది. ఈ విమానాల లక్ష్యాలేమిటి, అవి ఎంతకాలం కక్ష్యలో ఉంటాయి అనే వివరాలు పరిమితంగానే తెలుస్తున్నాయి. సాంకేతిక పరీక్షలో భాగంగానే అంతరిక్ష విమాన కార్యక్రమాన్ని చేపట్టామని చైనా తెలిపింది. భవిష్యత్తులో అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడమే దీని ఉద్దేశమని స్పష్టం చేసింది. గతంలో చేపట్టిన షెన్‌లాంగ్‌ మిషన్ల కాలపరిమితి కొన్ని రోజుల నుంచి ఎనిమిది నెలలకు పైగానే ఉంది. ఒక సందర్భంలో అంతరిక్ష విమానం కక్ష్యలో కొన్ని వస్తువులను వదిలింది. అవి చిన్న చిన్న ఉపగ్రహాలు లేదా టెస్ట్‌ హార్డ్‌వేర్‌ కావచ్చు. అమెరికా కూడా గతంలో బోయింగ్‌ ఎక్స్‌-37బీ అనే మానవ రహిత అంతరిక్ష విమానాన్ని కక్ష్యలోకి పంపింది. అది అక్కడ అనేక మిషన్లు నిర్వహించింది. చైనా పంపుతున్న అంతరిక్ష విమానాలు కూడా అలాంటివే. ఇవి సాధారణ ఉపగ్రహాలకు మించి తక్కువ భూ కక్ష్యలో విన్యాసాలు చేయగలవు. ఈ విమానాలు కక్ష్యలో సేవలకు, ఉపగ్రహ విస్తరణకు, ఇతర ప్రత్యేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయి. వీటి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ అంతరిక్ష అన్వేషణకు ఉపకరిస్తాయని మాత్రం చెప్పవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -