Tuesday, March 17, 2026
E-PAPER
Homeఆటలుచిన్నస్వామి రైట్‌ రైట్‌

చిన్నస్వామి రైట్‌ రైట్‌

- Advertisement -

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్‌ సిగ్న‌ల్‌
ప్రభుత్వ నియమిత నిపుణుల కమిటీ ఆమోదం

నవతెలంగాణ-బెంగళూరు
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌ ముంగిట చిన్నస్వామి స్టేడియం ఉత్కంఠ వీడింది. 2025 ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌.. విజయ సంబురాల్లో అపశృతి చోటు చేసుకుని 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు అనువుగా లేదని ప్రభుత్వ విచారణ కమిటీ తేల్చింది. కానీ, కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (కెఎస్‌సీఏ) అభ్యర్థనతో ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియాన్ని తనిఖీ చేసిన నిపుణుల కమిటీ.. ఐపీఎల్‌ సహా అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. సోమవారం కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌బేరర్లు, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రతినిధులు, నిపుణుల కమిటీ సభ్యుల సమావేశం అనంతరం తుది ఆమోదం లభించింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు సైతం చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలువనుంది.

గుణాత్మక సూచనలు!
కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి జి. మహేశ్వర్‌ రావు చైర్మన్‌గా వ్యవహరించారు. బెంగళూరు నడిబొడ్డున ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మరోసారి విషాద ఘటనలు చోటుచేసుకునేందుకు తావులేకుండా నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. అందుకు అనుగుణంగా రెండు నెలల వ్యవధిలోనే చిన్నస్వామి స్టేడియంలో మార్పులు చేశారు. అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించేందుకు అనువుగా కొత్తగా ఆరు ప్రవేశ ద్వారాలు నిర్మించారు. ఇప్పటికే ఉన్న ప్రవేశ ద్వారాలను పెద్దవిగా మార్పు చేశారు. గతంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ కొనసాగిన స్థలాన్ని.. అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించేందుకు వీలుగా ర్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

ఐపీఎల్‌ సమయంలో అభిమానులు సులువుగా, సురక్షితంగా స్టేడియానికి చేరుకునేందుకు.. బెంగళూరు మెట్రో రైల్‌ కార్పోరేషన్‌తో కెఎస్‌సీఏ ఒప్పందం చేసుకుంది. మ్యాచ్‌ల సమయంలో అర్థరాత్రి 1 గంట వరకు రైలు సేవలు ఉండనున్నాయి. మ్యాచ్‌ టికెట్‌ ఉన్న ప్రయాణికులు రైల్‌లో ఉచితంగా ప్రయాణించేందుకు ఒప్పందం కుదుర్చుకునేలా చర్చలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు.. ఆఫ్‌లైన్‌ టికెట్‌ కోసం బాక్స్‌ఆఫీస్‌ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా, నేరుగా క్యూఆర్‌ కోడ్‌తో (ఈ-టికెట్‌) స్టేడియంలోకి ప్రవేశించేలా కసరత్తు చేస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో స్టేడియం పరిసరాల్లో, స్టేడియం పక్కన ప్రధాన రహదారి సహా మెట్రోలో రద్దీ నివారణకు, జనాన్ని కట్టడిచేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

చివరగా చిన్నస్వామి స్టేడియం 2025 ఐపీఎల్‌ సీజన్‌లోనే ఓ మ్యాచ్‌కు ఆతిథ్యం వహించటం. ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి మ్యాచ్‌లు జరుగలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ తొలి, తుది మ్యాచ్‌లో ఇక్కడే జరుగనున్నాయి. మార్చి 28న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 5న చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆర్‌సీబీ పోటీపడనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తొలుత 20 మ్యాచ్‌లకే షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఈ సీజన్‌లో ఏడు ఆతిథ్య లీగ్‌ మ్యాచ్‌లను ఆర్‌సీబీ రెండు స్టేడియాల్లో ఆడనుంది. ఐదు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో, రెండు మ్యాచ్‌లను రారుపూర్‌లో ఆడనుంది. ఈ మేరకు చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఆర్‌సీబీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. ఐదు లీగ్‌ దశ మ్యాచ్‌లతో పాటు ప్లే ఆఫ్స్‌లో క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ మ్యాచ్‌లు సైతం చిన్నస్వామిలోనే జరుగుతాయి. ఇదిలా ఉండగా, చిన్నస్వామి స్టేడియాన్ని అధికారికంగా ఐపీఎల్‌ ప్రాంఛైజీ ఆర్‌సీబీ ఆధీనంలోకి తీసుకుంది. ఆర్‌సీబీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ భాగస్వామి డిఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్టేడియంలో ఏర్పాట్లను చేయనుంది. రాయల్‌ చాలెంజర్స్‌, సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు మరో రెండు రోజుల్లో ఆరంభం కానున్నాయి!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -